కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు

AP Planning Commission Former Vice Chairman Kutumba Rao Involvement in land grab - Sakshi

రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడికి విలువైన భూమి ధారాదత్తం

విజయవాడ నడిబొడ్డున5.10 ఎకరాలు అప్పగింత 

దశాబ్దాల తర్వాత కుటుంబరావు, సోదరుల అధీనంలోకి భూమి 

వ్యవస్థలను మేనేజ్‌ చేసి బదలాయించుకున్నారంటున్న అధికారులు  

రెవెన్యూకు తెలియకుండానే రైల్వే శాఖ ద్వారా చక్కబెట్టేసిన వైనం 

కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వ పెద్దల సహకారం    

ప్రభుత్వ భూమిని కాపాడాలని ’స్పందన’లో ఫిర్యాదులు 

విచారించి నిజాన్ని నిగ్గుతేల్చాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు   

అనగనగా ఓ నక్క. ఆ నక్క అడవి నిబంధనలకు విరుద్ధంగా అపారంగా ఆహారం సంపాదించింది. అడవి రాజు దృష్టికి ఈ విషయం వెళితే తన ఆహారాన్ని లాక్కుంటాడని జిత్తుల మారి తనాన్ని ప్రదర్శించింది. ‘నా ఆహారంలో కొంత మీకిస్తాను..’ అని మరో జంతువుకు ఇచ్చింది. ఆ వెంటనే తగిన పరిహారం ఇవ్వాలని కోరింది. ఇచ్చినట్టే ఇచ్చి పరిహారం కోరేసరికి.. అది నీ ఆహారమే అని గ్యారంటీ ఏమిటి? అని ఆ జంతువు ప్రశ్నిస్తే నక్క పంచాయితీ పెట్టింది. ఇలాగైతే ‘నీ ఆహారమే నాకొద్ద’నిఆ జంతువు వెనక్కు ఇచ్చేసింది. దీంతో ఆ మిగులు ఆహారం అడవి రాజు బారిన పడకుండా నక్క తన మాయాజాలంతో ఎట్టకేలకు సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భూ వ్యవహారం అచ్చం ఈ కథను మరిపిస్తోంది. 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆయన సోదరులు ఒక తరానికి పైగా ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అనేక ఎత్తులు వేసి రూ.200 కోట్లకు పైగా విలువ చేసే 5.10 ఎకరాల భూమిని చేజిక్కించుకున్న వైనమిది. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డు పక్కన మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఈ భూమిని ఎట్టకేలకు వారి ఖాతాలో వేసుకున్నారు. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్‌ చేసి భారీగా లబ్ధి పొందిన విషయం ఇటీవల ‘స్పందన’కు అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసింది. 1976లో వచి్చన అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం కింద మిగులు భూమిని కోల్పోకుండా కుటుంబరావు కుటుంబం రైల్వే శాఖకు ఆ భూమిని ఇస్తూ రెవెన్యూ శాఖ సహాయంతో పరిహారం పొందాలని భావించింది.

రైల్వే ఉద్యోగులకు స్టాఫ్‌ క్వార్టర్లు, ఎలక్ట్రికల్‌ ట్రెయినింగ్‌ స్కూల్‌ ఏర్పాటుకు విజయవాడలో స్థలం అవసరమైంది. అప్పటి విజయవాడ తాలూకా మాచవరం గ్రామ పరిధిలోని ’న్యూ టౌన్‌ సర్వే నంబర్‌ (ఎన్‌టిఎస్‌) 1 నుంచి 29 వరకు 22.19 ఎకరాలు (14 మందికి చెందిన పట్టా, ప్రభుత్వ భూమి) కావాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్‌ సూపరింటెండెంట్‌ రెవెన్యూ విభాగానికి 1977 మార్చి 5వ తేదీన లేఖ రాశారు. 1979 నవంబరు 5న భూసేకరణకు రెవెన్యూ శాఖ అనుమతించింది. 1980 మార్చి 31న 22.19 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్‌ నోటిíÙకేషన్‌ (డీఎన్‌), డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ (డీడీ) ప్రచురితమైంది. అయితే ఈ లోపే 18.58 ఎకరాలను సంబంధితుల నుంచి రైల్వే శాఖ తీసుకుంది. రైల్వేకి అప్పగించిన ఈ భూమిలో కుటుంబరావు కుటుంబానికి చెందిన భూమి కూడా ఉండేలా చూసుకున్నారు.  

మధురానగర్‌ సమీపంలో రైల్వే స్టేషన్, కేంద్రీయ విద్యాలయం,  రైల్వే క్వార్టర్స్‌ను (వృత్తాల్లో ఉన్నవి) ఆనుకుని ఉన్న రైల్వే భూమి. కుటుంబరావు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న భూమి ఇదే.

నష్టపరిహారంలో తిరకాసు  
1984 నుంచి 1996 వరకు నాలుగు విడతలుగా 18.58 ఎకరాల్లో 10.52 ఎకరాలకు నష్టపరిహారం లభించింది. మిగిలిన 8.06 ఎకరాల్లో కుటుంబరావు కుటుంబానికి చెందిన 5.10 ఎకరాలు ఉంది. ఈ భూమికి ఎన్‌వోసీ ఇస్తేనే పరిహారం ఇస్తామని చెప్పి అవార్డు పాస్‌ చేయలేదు. దీంతో భూమి సేకరణకు 1996 ఆక్టోబర్‌ 15న తిరిగి అనుమతి వచ్చేలా చక్రం తిప్పారు. అనంతరం రైల్వే శాఖ అవసరాల కోసం తమ భూమిని 1980లోనే తీసుకుని (ఎక్కువమంది రైతులే స్వచ్ఛందంగా రైల్వేకు స్వా«దీనం చేశారు) నష్టపరిహారం చెల్లించలేదని కుటుంబరావు, ఆయన సోదరులు సి.నాగేంద్ర, సి.ప్రవీణ్‌ కుమార్, సి.ప్రదీప్‌ కుమార్‌లు 1996లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌టిఎస్‌ నెం:1 లోని 5.10 ఎకరాలకు ఎన్‌వోసీ ఇవ్వనందునే కుటుంబరావు కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించలేదని, మిగతా రైతులకు పరిహారం ఇచ్చామని రైల్వే శాఖ చెప్పింది. 

గత ప్రభుత్వ సహకారం.. భూమి హస్తగతం 
ఇది మిగులు భూమి కాబట్టే ఎన్‌వోసీ ఇవ్వడం లేదని ఆయా శాఖల అధికారులు కోర్టుకు స్పష్టంగా చెప్పి సాక్ష్యా ధారాలు అందించలేకపోయారు. దీంతో కుటుంబరావు కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు 1997లో డైరెక్షన్‌ ఇచి్చంది. ఇది మిగులు భూమి అని.. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లగా గత తీర్పును సమరి్థంచింది. దీంతో ఆ భూమి తమకు అవసరం లేదని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని 2012లో రైల్వే శాఖ కోర్టుకు తెలిపింది. సరిగ్గా అప్పుడే ఈ భూమి మాదేనన్న ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ పరిణామం వెనుక కుటుంబరావు కుటుంబ సభ్యులు వ్యవస్థలను మేనేజ్‌ చేసినట్లు యూఎల్‌సీ, రెవెన్యూ విభాగాల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2018 సెపె్టంబర్‌ 12న రైల్వే శాఖ 5.10 ఎకరాలను కుటుంబరావు కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఈ వ్యవహారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరగాలి. కానీ రైల్వే శాఖే నేరుగా భూమిని వ్యక్తులకు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక అప్పటి సీఎం చంద్రబాబు మౌఖిక ఆదేశాలు ఉన్నాయని ఆర్‌డీఓ, తహశీల్దారు కార్యాలయాల ఉద్యోగులు చెబుతున్నారు.  

భూమి తమ ఆధీనంలో ఉన్నట్టు ఏర్పాటు చేసిన బోర్డు 

ప్రభుత్వానికి నివేదిక : కలెక్టర్‌ 
మాచవరం పరిధిలోని ఎన్‌టిఎస్‌ ఒకటవ నంబరులోని 5.10 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినది. ఆ భూమిని ఆక్రమించుకుని ప్రహరీ నిర్మించారని ’స్పందన’లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి విచారించాలని ఆదేశించాం. అన్ని వివరాలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. – ఎండీ ఇంతియాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్‌

రెంటికీ చెడ్డ రేవడి రైల్వే శాఖ 
రైల్వే అధికారుల తప్పిదమో, పైనుంచి వచ్చిన ఒత్తిడో తెలియదు కాని ఆ శాఖ బాగా నష్టపోయింది. కుటుంబరావు కుటుంబానికి తిరిగి ఇచ్చిన భూమిలో రూ.13 కోట్లతో ఎలక్ట్రికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భవనాన్ని నిర్మించింది. వివాదాల నేపథ్యం దాన్ని కూల గొట్టింది. లీజుకింద కుటుంబరావుకు రూ.25 లక్షలు చెల్లించింది. 1996 నుంచి కోర్టు కేసులు, ఖర్చులు దీనికి అదనం. అంతా చేసి ఇపుడు భూమి తమకొద్దని అప్పగించింది. వేయి మందికిపైగా ఉన్న రైల్వే ఉద్యోగుల పిల్లలు కేంద్రీయ విద్యాలయానికి వెళ్లడానికి దారికూడా లేకుండా చేసింది.

భూసేకరణ చట్టం 1984 సెక్షన్‌ 48(1), ఇన్‌వోకింగ్‌ ఆఫ్‌ అర్జన్సీ క్లాస్‌ సెక్షన్‌ 17 (4) ప్రకారం ఈ భూమి ప్రభుత్వానికి చెందినది. ఈ భూమిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ బదలాయించడానికి వీల్లేదు. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1976 ప్రకారం.. ప్రధాన నగరాలలో మేజర్‌ అయిన ఏ వ్యక్తికైనా 1,500 చదరపు మీటర్లు, లేదా 1,800 చదరపు గజాల భూమి మాత్రమే కలిగి ఉండాలి. అంతకు మించి ఉంటే మిగులు భూమిగా పరిగణిస్తారు. సెక్షన్‌ 10(3) ప్రకారం ఆ భూమి ప్రభుత్వపరం అవుతుంది. ఇటువంటి భూమికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే అందుకు యూఎల్‌సీ అథారిటీ నుంచి నో అబ్జక్షన్‌ సరి్టఫికెట్‌ తప్పనిసరి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top