ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా..! | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా..!

Published Fri, Oct 25 2019 11:56 AM

AP Govt Takes Action Against Illegal Online Bookings Of Sand - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా వినియోగదారులకు ఇసుకను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు ఆన్ లైన్‌ మోసం ద్వారా పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఆన్‌లైన్‌ లో బల్క్‌ బుకింగ్‌లలో పలువురు బ్రోకర్లు వేర్వేరు అడ్రస్‌లతో ఇసుకను బుక్ చేస్తూ.. అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా నకిలీ ఐడిలతో ఇసుకను బుకింగ్‌ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై పోలీస్‌, మైనింగ్‌ అధికారులు జరిపిన విచారణలో గుంటూరు కేంద్రంగా కిషోర్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడయ్యింది.

సుమారు రూ.1.27 లక్షల విలువైన ఇసుకను కిషోర్‌ నకిలీ ఐడిలతో బుక్‌ చేసినట్లు గుర్తించారు. అక్రమంగా తరలించేందుకు సిద్దం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్‌లను మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. అలాగే గన్నవరంకు చెందిన దుర్గారావు అనే వ్యక్తిని కూడా గుర్తించారు. బినామీ పేర్లతో రూ. 3.80 లక్షల విలువైన ఇసుకను దుర్గారావు ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారు. మీసేవ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మకై ఈ మేరకు మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. దీనిపై కిషోర్‌, దుర్గారావులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ఐపీ అడ్రస్‌లను గుర్తించడం ద్వారా ఇటువంటి మోసాలకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. 

Advertisement
Advertisement