ఆన్‌లైన్‌లో ‘టెట్‌’ | ap govt conduct TET In online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ‘టెట్‌’

Dec 12 2017 3:55 AM | Updated on Aug 18 2018 8:08 PM

ap govt conduct TET In online - Sakshi

సాక్షి, అమరావతి: ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ‘టెట్‌’ విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం జీఓ నెంబర్‌ 91 జారీ చేసింది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. టెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి టీచర్‌ పోస్టుల కోసం పేపర్‌ 1 పరీక్ష జరుగుతుంది. 6 నుంచి 8వ తరగతి టీచర్‌ పోస్టులకు పేపర్‌ 2లో అర్హత సాధించాలి. 

టెట్‌ పేపర్‌ 1 అర్హతలు ఇవీ
పేపర్‌ 1కు దరఖాస్తు చేసే వారు ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. రెండేళ్ల డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీ.ఇఎల్‌.ఈడీ), లేదా రెండేళ్ల డిప్లొమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యాహక్కు చట్టం– 2010 కన్నా ముందు ఇంటర్మీడియెట్, డీఎడ్‌ వంటి పరీక్షలు రాసిన వారికి మాత్రం అర్హత మార్కుల్లో కొంత మినహాయింపు ఉంటుంది. వీరికి ఇంటర్‌లో 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులలకు 40 శాతం మార్కులతో పాటు డీఎడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

టెట్‌ పేపర్‌ 2 అర్హతలు ఇవీ
టెట్‌ పేపర్‌ 2కు దరఖాస్తు చేసుకునేవారు బీఏ, బీఎస్సీ, బీకాంలలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులుండాలి. దీంతోపాటు బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యాహక్కు చట్టం– 2010 కన్నా ముందు బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈడీ లాటి పరీక్షలు రాసిన వారికి మాత్రం అర్హత మార్కుల్లో కొంత మినహాయింపు ఉంటుంది. వీరిలో బీఏ, బీఎస్సీ, బీకాం చదివిన ఓసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండడంతో పాటు బీఈడీ తదితర శిక్షణ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏ (ఈడీ), బీఎస్సీ (ఈడీ) కోర్సుల్లో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. లాంగ్వేజ్‌ టీచర్లకు సంబంధించి  బ్యాచులర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ లాంగ్వేజెస్, సంబంధిత లాంగ్వేజెస్‌లో గ్రాడ్యుయేషన్, పండిట్‌ ట్రయినింగ్, లాంగ్వేజ్‌లో బీఈడీ (సంబంధిత సబ్జెక్టులో మెథడాలజీతో కూడి ఉండాలి.

ఫైనల్‌ పరీక్షలకు హాజరయ్యే వారూ అర్హులే
ప్రస్తుతం బీఈడీ, డీఈడీ తదితర కోర్సులు అభ్యసిస్తూ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత షరతులకు లోబడి డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేలా వారికి అవకాశం కల్పించనున్నారు.

అర్హత మార్కులు తప్పనిసరి
డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్‌లో కనీస అర్హత మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. జనరల్‌ అభ్యర్ధులు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్‌ రాసిన వారికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డిజిటల్‌ ఫార్మాట్‌లో ధ్రువపత్రాలు జారీ చేస్తుంది. ఈ ధ్రువపత్రానికి ఏడేళ్ల చెల్లుబాటు ఉంటుంది. ఈలోపల ప్రకటించే డీఎస్సీలన్నిటికీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అర్హత ఉంటుంది. 

ఏటా రెండుసార్లు టెట్‌..
టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉంటుంది. టెట్‌ మార్కులకు 20 శాతం, డీఎస్సీలో వచ్చిన మార్కులకు 80 శాతం చొప్పున వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని ఎంపిక జాబితాను రూపొందిస్తారు. టెట్‌ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా, జాయింట్‌ డైరక్టర్‌ (టెట్‌) సభ్యకన్వీనర్‌గా మరో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తారు. ఈ కమిటీ టెట్‌ షెడ్యూల్‌ ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్‌/జులైలో ఒకసారి అక్టోబర్‌/నవంబర్‌లో మరోసారి టెట్‌ పరీక్ష ఉంటుంది. అభ్యర్ధులు ఎన్నిసార్లైనా వీటికి హాజరుకావచ్చు. 

టెట్‌ పరీక్షా విధానం ఇలా...
టెట్‌ పరీక్షను కంప్యూటర్‌ ఆధారంగా బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలతో నిర్వహించనున్నారు. 
ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. 
నెగిటివ్‌ మార్కుల విధానం లేదు. 
అభ్యర్ధులు పేపర్‌1 లేదా పేపర్‌2లకు వేర్వేరుగా హాజరుకావచ్చు. రెండు పేపర్లనూ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. 
ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలుంటాయి. 
పరీక్ష రాయడానికి రెండున్నర గంటల సమయం ఇస్తారు. 
అంశాలవారీగా ప్రశ్నలను జీఓలో పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement