
హక్కులకు ‘చెక్కు’
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు అంగీకార పత్రాలు (9.3) ఇచ్చిన రైతుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది.
- అంగీకార పత్రాలిచ్చినవారి హక్కులు హరించేందుకు
- ఏపీ సర్కారు ప్రయత్నాలపై రాజధాని రైతుల్లో ఆందోళన
- తొలివిడత కౌలు చెక్కులు తీసుకునేందుకు వెనుకంజ
- హక్కులు కోల్పోయేందుకు సిద్ధంగా లేని రైతులు
- పభుత్వం చేస్తున్న హడావుడిపై అనేక అనుమానాలు
- రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అంశాన్ని
- అఫిడవిట్లలో చేర్చకపోవడంపై సందేహాలు
- డిప్యూటీ కలెక్టర్లను సైతం నిలదీస్తున్న వైనం
- అనుమానాలు నివృత్తి చేసేంతవరకు ఒప్పందాలు
సాక్షి, హైదరాబాద్, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు అంగీకార పత్రాలు (9.3) ఇచ్చిన రైతుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఆయా భూములపై సర్వ హక్కులను దఖలు పరచుకునేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వారిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సింగపూర్ సంస్థల నుంచి మలివిడత మాస్టర్ ప్లాన్ అందేలోపు.. సమీకరించిన భూములపై వాటి యజమానులైన రైతులకు ఎలాంటి హక్కులూ లేకుండా చేసేందుకు, ఆ మేరకు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సర్కారు చేస్తున్న హడావుడి.. రైతుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో.. భూములపై తమకున్న హక్కులను ప్రభుత్వానికి కట్టబెట్టడానికి వారు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే అభ్యంతర పత్రాలు (9.2) ఇచ్చిన వేలాదిమంది రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తుండగా.. తాజాగా కౌలు చెల్లింపు పేరుతో 9.14 అఫిడవిట్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ప్రయత్నిస్తోంది.
అయితే ఈ అఫిడవిట్లపై అనుమానాలు నివృత్తి చేసేంతవరకు ఒప్పందాలు చేసుకోబోమని రైతులు తేల్చిచెబుతున్నారు. రాజధాని నిర్మాణంలో తమను భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఒప్పందాల్లో ఆ అంశం చేర్చకుండా.. భూములపై హక్కులను ప్రభుత్వానికి ఎలా కట్టబెడతామని ప్రశ్నిస్తున్నారు. ఒప్పందాలు చేసుకోవాలని వస్తున్న డిప్యూటీ కలెక్టర్లను ఈ విషయంలో నిలదీస్తున్నారు. సకాలంలో రాజధాని నిర్మాణం పూర్తి కాకపోతే భూములిచ్చిన తమ పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. రైతుల నుంచి భూములపై హక్కులు పొందే ఎత్తుగడలో భాగంగా కౌలు డీడీలు అందించడానికి డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున కేటాయించింది.
అయితే డీడీలు చూపించడం ద్వారా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయిం చాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదు. ముందుగా భూములిచ్చిన తుళ్లూరు, నేలపాడు, అనంతవరం రైతులు సైతం ప్రభుత్వ పరంగా స్పష్టత వచ్చాకే డీడీలు తీసుకుందామన్న ధోరణిలో ఉన్నారు. రెండురోజుల నుంచి పలు గ్రామాల్లో కౌలు పరిహారం డీడీలు/చెక్కుల పంపిణీ మొదలైనప్పటికీ వా టిని తీసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదు. తీసుకున్న కొద్దిమంది రైతులు వాటితో బ్యాంకులకు వెళితే ఆయా మొత్తాలను బ్యాంకర్లు పంట రుణాల బాకీ కింద జమ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణను మంగళవారం టీడీపీ అనుకూల గ్రామమైన వెలగపూడిలో రైతులు అడ్డుకున్నారు. రైతుల అనుమానాలు, జరీబు భూములుగా గుర్తించకపోవడం వంటి అంశాలు డిప్యూటీ కలెక్టర్లు సీఆర్‌డీఏ కమిషనర్‌కు నివేదించినట్టు తెలిసింది.
9.2 పత్రాలిచ్చిన రైతుల్లో ఉత్కంఠ
రాజ ధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతులు డిప్యూటీ కలెక్టర్లకు 9.2 అభ్యంతర పత్రాలు అందించారు. సుమారు పది వేలమంది వరకు ఈ పత్రాలిచ్చినట్లు అధికారులు నిర్ధారిస్తున్నా రు. అయితే హైకోర్టు ఇటీవల రాజధాని భూములపై నిర్ణయం వెలువరించిన నేపథ్యంలో.. తమ అభ్యంతరాలపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆ రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.
పెరుగుతున్న అనుమానాలు.. ఆందోళనలు
రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన 21 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలను సమీకరించినట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరందరికీ మొదటి ఏడాది కౌలు పరిహారం కింద రూ.22.35 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇటీవల గ్రామాల్లో చెక్కుల రూపేణా పరిహారం పంపిణీ మొదలై ంది. సమీకరణ సమయంలో ఒప్పించినట్టుగానే మున్సిపల్ మంత్రి నారాయణ దగ్గరుండి రైతులను ఒప్పిస్తూ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. భూములపై హక్కులు వదులుకుంటామని రైతులు 9.14 ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాతే కౌలు పరిహారం రైతులకు అందజేస్తోంది. అయితే ఈ ఫారాన్ని చూసిన రైతుల గుండె జారిపోతోంది. ఒక్కసారి సంతకం చేసిన తర్వాత ఇక రైతులకు ఎలాంటి హక్కులూ ఉండని నేపథ్యంలో.. వచ్చే ఏడాది కౌలు పరిహారం ఇవ్వకుంటే ఎవర్ని అడగాలి? అభివృద్ధి చేసిన భూములను ఎక్కడ ఇస్తారు? వంటి అంశాలేవీ ఒప్పందంలో లేకపోవడంతో రైతులు సంతకాలు చేయడంపై ఆలోచనలో పడ్డారు.
మంత్రి నారాయణ సోమవారం తుళ్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు ఆయనను నిలదీశారు. పలు సందేహాలను వ్యక్తం చేసిన రైతుల్లో మొత్తంగా మరికొంత కాలం వేచిచూడాలనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. మంగళగిరి మండలం నీరుకొండలో 968 మంది రైతులు అంగీకార పత్రాలు ఇవ్వగా 304 మందికి డీడీలు వచ్చాయి. అయితే 181 మంది మాత్రమే వీటిని తీసుకున్నారు. తాజాగా మంగళవారం అంగీకార పత్రాలు ఇచ్చినవారి భూములపై ప్రభుత్వానికి శాశ్వత హక్కులు లభించేలా 9.14ఏ (ఒకసారి ఒప్పందం జరిగాక దాన్ని తిరగదోడటానికి వీలులేని) ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రభుత్వం సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇలావుండగా సమావేశాలు నిర్వహించి డీడీల పంపిణీ కార్యక్రమం చేయడం వల్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నందున రైతుల ఇళ్ల వద్దకెళ్లి ఒప్పందాలపై సంతకాలు తీసుకుని చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.