50 ఏళ్లకే ఇంటికి..

50 ఏళ్లకే ఇంటికి..


50 ఏళ్లు నిండగానే పనితీరుపై సమీక్ష

పనితీరు ఆధారంగా బలవంతంగా పదవీ విరమణ

ఉద్యోగుల ఫండమెంటల్, పెన్షన్‌ రూల్స్‌లో సవరణలు

ఐదు జీవోలు సిద్ధం చేసిన చంద్రబాబు సర్కార్‌

సర్కార్‌ నియమించే సమీక్షా కమిటీలదే తుది నిర్ణయం




ఆరు లక్షల మంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను షాక్‌కు గురిచేసే వార్త ఇది.  పనితీరు ఆధారంగా 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపించేయబోతున్నారు. ఇకపై సర్కారుకు నచ్చిన ఉద్యోగి.. సర్కారు మెచ్చినంత కాలం మాత్రమే ఉద్యోగంలో ఉండగలుగుతాడు.. నచ్చని మరుక్షణాన ప్రయివేటు ఉద్యోగిని తొలగించినట్లు ఒక్క కలం పోటుతో తొలగించి ఇంటికి పంపించేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను దశలవారీగా తొలగించి వారి స్థానంలో తాత్కాలిక.. కన్సల్టెంట్లను తెచ్చుకోవాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు బలవంతంగా రిటైర్‌ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చుతూ అందుకు అనుగుణంగా ఐదు జీవోలను కూడా తయారు చేశారు. ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం పొంది సీఎస్‌ వద్దకు చేరిన ఆ జీవోలు త్వరలో జీవం  పోసుకుని ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నాయి.



సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగికీ.. ప్రైవేటు ఉద్యోగికీ తేడా ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగికి అనేక హక్కులుంటాయి... అన్నిటినీ మించి ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగికి అవేవీ ఉండవు.  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అలాంటి ప్రివిలేజెస్‌ అన్నీ తొలగిపోనున్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగులకు వారికీ ఎలాంటి తేడా ఉండదు.. అదేమిటి.. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగ విరమణవయసు కూడా 60 ఏళ్లకు పెంచారు కదా అనుకుంటున్నారా.. అది పేరుకే.. త్వరలో నిబంధనలన్నీ మారబోతున్నాయి.



ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఇపుడు 50 ఏళ్లకే ఉద్యోగులను ఉద్యోగ బాధ్యతల నుంచి బలవంతంగా రిటైర్‌ చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. 35 సంవత్సరాలకు ముందు ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులను 50 సంవత్సరాలకే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు, 40 సంవత్సరాలు దాటిన తరువాత  ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులను 55 సంవత్సరాలకే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.



ఇందుకు అనుగుణంగా ఉద్యోగుల ఫండమెంటల్‌ రూల్స్, పెన్షన్‌ నిబంధనల్లో సవరణలు చేయడానికి ఐదు ముసాయిదా జీవోలను సాధారణ పరిపాలన శాఖ రూపొందించింది. ఈ ముసాయిదా జీవోలకు ఇప్పటికే ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోద ముద్ర వేశారు. సాధారణ పరిపాలన శాఖ ఈ ముసాయిదా జీవోలను న్యాయ శాఖ పరిశీలనకు పంపించింది. న్యాయ శాఖ ఆమోదం అనంతరం తిరిగి సీఎస్‌ వద్దకు చేరాయి.



ఉద్యోగి పనితీరుపై తరచూ సమీక్ష

ప్రస్తుతం ఫండమెంటల్‌ రూల్స్‌లో 56వ నిబంధన ప్రకారం ప్రభుత్వ సర్వీసులోకి చేరిన ఉద్యోగి 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు. అయితే ఇప్పుడు ఫండమెంటల్‌ రూల్స్‌లో సవరణ చేస్తూ 56 (1) పేరుతో ప్రతి ఉద్యోగి పనితీరును తరచూ సమీక్షించాలని నిర్ణయించింది. ఆ సమీక్ష ఆధారంగా ఆ ఉద్యోగిని సర్వీసులో కొనసాగించాలా లేదా బలవంతంగా పదవీ విరమణ చేయించాలనేది నిర్ణయిస్తారు. సమీక్షలో ఉద్యోగి నిజాయితీ (ఇంటిగ్రిటీ)పై అనుమానం కలిగితే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారు. అలాగే సమీక్షలో ఉద్యోగి పనితీరు (ఫెర్‌ఫార్మెన్స్‌)  ఆధారంగా అసమర్ధుడని (ఇనెఫిషియెన్సీ) తేలితే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారు. ఇందుకోసం ఫండమెంటల్‌ రూల్స్‌ 56లో (2) నిబంధన పేరుతో ముందస్తు నోటీసు ఇవ్వడం లేదా మూడు నెలలు జీత భత్యాలు ఇచ్చి బలవంతంగా పదవీ విరమణ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉండేలా చేశారు.



షోకాజ్‌ ఉండదు.. చర్చా ఉండదు..

అలాగే ఎటువంటి షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండానే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి ఆర్బిట్రేషన్‌ కూడా ఉండదని సవరణల్లో పేర్కొనడం గమనార్హం. ప్రతీ ప్రభుత్వ శాఖలోను అలాంటి ఉద్యోగులను సమీక్షా కమిటీలు ప్రతి ఏడాదీ గుర్తిస్తాయి. ఆ సమీక్షల ఆధారంగా ఉద్యోగుల భవితవ్యాన్ని నిర్ధారిస్తారు. బలవంతపు పదవీ విరమణ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ సవరించిన పెన్షన్‌ రూల్స్‌ 1980లోని సెక్షన్‌ (1)లో (బి) పేరుతో నిబంధనలను సవరించేందుకు ఒక జీవోను రూపొందించింది. బలవంతంగా పదవీ విరమణ చేయించే ఉద్యోగులకు ఎలాంటి షోకాజ్‌ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిని గతంలో సుప్రీం కోర్టు సమర్ధించిందని ముసాయిదా జీవోలో స్పష్టం చేశారు. 50 సంవత్సరాలు నిండే ఉద్యోగి అంతకు ముందు పనిచేసిన ఐదేళ్ల కాలంలోని పనితీరు, అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత ప్రవర్తన ఆధారంగా ఆ ఉద్యోగి భవిష్యత్‌ను సమీక్షా కమిటీలు నిర్ధారిస్తాయి. ఇందుకోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సమీక్షకు చీఫ్‌ విజిలెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరో ముసాయిదా జీవోను సర్కారు రూపొందించింది.



ఇప్పటి వరకు ఉన్నదేమిటి?

ఫండమెంటల్‌ రూల్స్‌లో 56వ నిబంధన ప్రకారం ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో ఉంటారు.



ఇపుడు జరిగేదేమిటి?

ఫండమెంటల్‌ రూల్స్‌ సవరిస్తున్నారు. దాని ప్రకారం ప్రతి ఉద్యోగి పనితీరును తరచూ సమీక్షిస్తారు.



దాని ఆధారంగానే సర్వీసులో కొనసాగించాలా లేదా బలవంతంగా ఇంటికి పంపించేయాలా అనేది నిర్ణయిస్తారు



నిజాయితీ, పనితీరు, సమర్థతలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తారు.



ఒక్క నోటీసు ఇచ్చి, మూడునెలల జీతభత్యాలు ఇచ్చి బలవంతంగా ఉద్యోగ విరమణ చేయిస్తారు..



అసలు ఎలాంటి షోకాజు నోటీసూ ఇవ్వకుండానే బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించవచ్చు.



దానిపై ఎలాంటి ఆర్బిట్రేషన్‌కూ వీలు లేని విధంగా సవరణలు చేస్తున్నారు.


సమీక్ష వర్తించేదెవరికి?

35 సంవత్సరాలకు ముందు ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగుల పనితీరును 50 ఏళ్లకు సమీక్షిస్తారు.



40 ఏళ్ల తర్వాత ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగుల పనితీరును 55 ఏళ్లకు సమీక్షిస్తారు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top