అంతులేని కథేనా? | AP budget generous to ports, Rs 652 crore alloted for Kakinada port | Sakshi
Sakshi News home page

అంతులేని కథేనా?

Aug 22 2014 1:13 AM | Updated on Oct 1 2018 2:03 PM

అంతులేని కథేనా? - Sakshi

అంతులేని కథేనా?

అటు పంట కాలువలు, ఇటు మురుగు కాలువలు పూడుకుపోవడంతో సాగు నీరందక, ముంపు నీరు దిగక డెల్టా రైతులు ఏటా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. వీరంతా గోదావరి డెల్టా ఆధునికీకరణ

 అమలాపురం : అటు పంట కాలువలు, ఇటు మురుగు కాలువలు పూడుకుపోవడంతో సాగు నీరందక, ముంపు నీరు దిగక డెల్టా రైతులు ఏటా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. వీరంతా గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తయ్యే మంచిరోజు కోసం ఎదురు చూస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆధునికీకరణ పనులకు కోట్ల రూపాయలు కేటాయించారు. ఆయన మృతితో ఆధునికీకరణ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. అరకొర నిధుల కేటాయింపు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆరంభించి ఆరేళ్లు దాటినా 15 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గతంలోని అరకొర నిధులకు కూడా తాజా బడ్జెట్‌లో కోత పెట్టడంతో ఆధునికీకరణ పనులు పూర్తవుతాయనే నమ్మకం డెల్టా రైతులకు లేకుండా పోయింది.
 
 ఇచ్చింది రూ.141.13 కోట్లే..
 ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత జిల్లా అయినా తూర్పులోని డెల్టా రైతులకు ప్రయోజనం కలిగించే ఆధునికీకరణ పనులకు బడ్జెట్‌లో అరకొర నిధులే కేటాయించారు. గత బడ్జెట్‌లో డెల్టా ఆధునికీకరణ పనులకు రూ.180.57 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.141.13 కోట్లు మాత్రమే ఇచ్చారు. తూర్పు, మధ్యడెల్టాల్లోని ఆధునికీకరణ పనులకు వైఎస్ ప్రభుత్వం రూ.1695 కోట్లు కేటాయించింది. దీనిలో రూ.1,145 కోట్లతో పంట కాలువలను, రూ.550 కోట్లతో మురుగు కాలువలను ఆధునికీకరించాల్సి ఉంది. 2008లో పనులు ఆరంభించి 2012లో పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం రూ.283 కోట్ల (మొత్తం ఆధునికీకరణ పనుల్లో 15 శాతం) పనులు మాత్రమే జరిగాయి. మురుగు కాలువల ఆధునికీకరణ ప్యాకేజీలకు ఆరేళ్లు కావస్తున్నా టెండర్లు ఖరారు కాలేదు.
 
 పంట కాలువలకు ఐదు పెద్ద ప్యాకేజీల్లో సుమారు రూ.600 కోట్ల పనులకు, రెండు చిన్న ప్యాకేజీల్లో రూ.73 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారైన పనులు సైతం ఇంత వరకు 30 శాతం కూడా పూర్తి కాలేదు. కాకినాడ,  సామర్లకోట, మండపేట, పి.గన్నవరం, కోటిపల్లి బ్యాంకు కెనాల్‌లకు పూర్తిగా, ముక్తేశ్వరం బ్యాంక్ కెనాల్‌లో రెండు ప్యాకేజీ పనులకు టెండర్లు ఖరారయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క మండపేట కాలువపై మాత్రమే చెప్పుకోదగ్గ పనులు జరిగాయి. పంట కాలువలకు లాంగ్‌క్లోజర్ (రబీ పంటకు విరామం) ప్రకటించకపోవడం వల్ల ఆధునికీకరణ పనులు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యానికి తోడు కాంట్రాక్టర్లు పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడమే కారణమని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సబ్ కాంట్రాక్టర్లు కాసులు మిగిలే మట్టిపనులు చేసి కాంక్రీట్ పనులు వదిలేయడం వల్ల ఈ దుస్థితి నెలకొందంటున్నారు.
 నిజమైన కాంట్రాక్టర్ల అనుమానం..
 
 వైఎస్ మరణం తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఆధునికీకరణ నిధులకు కోత పెట్టాయి. చేసిన పనులకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన, ప్రస్తుత ప్రభుత్వానిది లోటు బడ్జెట్ కావడంతో పనులు చేసినా బిల్లులు రావన్న భావనతో  కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ కారణంగానే ఈ ఏడాది క్లోజర్‌లో రెండు డెల్టాల్లో రూ.150 కోట్లతో ఆధునికీకరణ పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం రూ.50 కోట్ల పనులే మొదలు పెట్టారు. చేపట్టిన పనులు సగం కూడా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లు భయపడినట్టే చంద్రబాబు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో నిధులకు మరింత కోత పెట్టడంతో డెల్టా రైతుల కష్టాలు గట్టెక్కేలా కనిపించడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement