అంగన్‌వాడీలా!

Anganwadi Workers Demanding Hike In Salaries - Sakshi

బయోమెట్రిక్‌తో ఒత్తిళ్లు

పెరగని వేతనాలు..

అరకొర వేతనాలు సైతం సకాలంలో అందని వైనం

3211 జీవోతో కేంద్రాల ఎత్తివేతకు పన్నాగం

తప్పని రాజకీయ ఒత్తిళ్లు  

గుడ్‌బై చెప్పేస్తున్న పలువురు ఉద్యోగులు 

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరితో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు డీలా పడుతున్నారు. నెలనెలా ఇచ్చే సరుకుల విషయంలో నిబంధనలను సర్కార్‌ కఠినతరం చేయడంతో లెక్కలు చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం వీరినే వాడుకుంటుండడంతో నలిగిపోతున్నారు. అయినా.. అన్నీ భరిస్తున్నా గౌరవ వేతనం సకాలంలో అందక ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం వీరి కష్టాలు మరీ ఎక్కువయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీల వేతనాలు భారీగా పెరగ్గా.. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు బయోమెట్రిక్‌ పేరుతో ఇటీవల జారీ చేసిన 3211 జీవో ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్రాలను కుదించాలనే లక్ష్యంతోనే ఈ జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని అంగన్‌వాడీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌ తీరుపై మండిపడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలను సైతం వదిలేయడానికి సన్నద్ధమవుతున్నారు.

రాజాం : చంద్రబాబు సర్కార్‌ తీరుతో అంగన్‌వాడీ కేంద్రాలు ఉనికి కోల్పోతున్నాయి. కొత్త కొత్త జీవోలు, నిబంధనలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో చాలా మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పేందుకు  సిద్ధపడుతున్నారు. 

బయోమెట్రిక్‌ తంటాలు.. 
అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా పెట్టిన బయోమెట్రిక్‌ విధానం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏప్రిల్‌ నెల నుంచి అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా కార్యకర్తలు, ఆయాలు ప్రతీ రోజు సమయపాలన పాటించడంతో పాటు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేయాలి. అయితే ఈ కేంద్రాలను ఆయా అంగన్‌వాడీలకు ఇవ్వకుండా దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అప్పగించారు. దీంతో  కార్యకర్తలు, ఆయాలు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంది. చాలాచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో పాఠశాలలు కూడాలేవు.ఇలాంటివారు రెండు మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న  పాఠశాలలుకు వెళ్లి బయోమెట్రిక్‌ నమోదు చేసుకొని రావాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పెరగని గౌరవ వేతనాలు..
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు కొన్నేళ్లుగా చెల్లిస్తున్న వేతనాలే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పనిభారం పెరిగినప్పటికీ.. గౌరవ వేతనం మాత్రం పెరగలేదు. అరకొర వేతనం కూడా నెల నెలా చెల్లించడం లేదు. మన రాష్ట్రంలో ప్రధాన అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ. 7 వేలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు, ఆయాలకు రూ. 4,500 ఇస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తకు నెలకు రూ. 10.500, ఆయాలకు రూ. 7 వేలు ఇస్తున్నారు.  

రాజకీయ ఒత్తిళ్లు
అంగన్‌వాడీలు రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతున్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు వచ్చిన తరువాత పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో ఇచ్చిన విధంగా పోషకాహార వస్తువులు కూడా కేంద్రాలకు రావడంలేదు. అయినప్పటికీ ఒత్తిళ్లు ఎదుర్కోక తప్పడం లేదు. కోడిగుడ్లు, వస్తు సామగ్రి విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు ఆరునెలలు క్రితం ప్రారంభించిన అన్న అమృతహస్తం మరింత ఇబ్బందికరంగా మారింది. వీటికి సరిపడా సరుకులు కూడా సకాలంలో రావడంలేదు. కుర్చీలు, బెంచీలు వంటివి  కేంద్రాల్లో లేకపోవడంతో గర్భణులు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కపక్క రాజకీయ ఒత్తిళ్లు.. మరోపక్క అధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు పెరడంతో అవస్థలు పడుతున్నారు.   ఫలితంగా కొన్నిచోట్ల కార్యకర్తలు, ఆయాలు ఉద్యోగాలను వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు.

ఫలితాలివ్వని పోరాటాలు
అంగన్‌వాడీ కేంద్రాల్లోనే బయోమెట్రిక్‌ పెట్టాలని, ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కార్యకర్తలు పోరాటాలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. మెర్జి కేంద్రాల పేరుతో రాజాం, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో అంగన్‌వాడీ కేంద్రాలును మూడు నుంచి నాలుగు ఒకచోట్ల మెర్జి చేసి పోస్టులను కుదించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి భవిష్యత్‌లో ఏర్పడనుంది. వీటిపై కార్యకర్తలు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా జీతాలు కావాలని చేస్తున్న డిమాండ్‌ను తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఎప్పటికప్పుడు బకాయిలు..
అంగన్‌వాడీలకు ఇస్తున్న గౌరవ వేతనాలు కూడా సకాలంలో చెల్లించడంలేదు. మూడు,   నాలుగు నెలలు బకాయిలు ఉంటున్నాయి. ప్రస్తుతం మూడు నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయి. సుమారు రూ.12.94 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని సకాలంలో చెల్లించకపోవడంతో వీటి ఆధారంగా జీవిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు 
అంగన్‌వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏళ్ల తరబడి ఈ ఉద్యోగాలను నమ్ముకుని జీవిస్తున్నాం. చాలా చోట్ల మాపై ఒత్తిళ్లు  ఉన్నాయి. వెట్టిచాకిరీ చేయించుకోవడం తప్పా ఎటువంటి ఫలితం కనిపించడంలేదు. పోరాటాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం. గౌరవ వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.                  
 -ఎన్‌.హిమప్రభ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. 

ఇబ్బందులు పడుతున్నాం 
మాకు సకాలంలో జీతాలురాక ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాజకీయ, అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికమౌతున్నాయి. ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పడంతో పాటు ప్రతి సమస్యకు మేమే బాధితులుగా మారుతున్నాం. గౌరవవేతనాలు పెంచాలి. 
- పి.విజయలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్త, వంగర మండలం.  

కోతకు సిద్ధంగా కొత్త జీవో
అంగన్‌వాడీ కేంద్రాలను కుదించేందుకు  బయోమెట్రిక్‌ విధానం అమలుతో పాటు కొత్త జీవో 3211ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. గతేడాది ఏప్రిల్‌లోనే జీవోను తీసుకురాగా... ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో కాస్తా జాప్యం చేశారు. ప్రస్తుతం ఈ జీవోను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో కనీసం 12 మంది పిల్లలు ఉండాలని, లేకుంటే అలాంటి కేంద్రాలు మూసేస్తామని కొత్త జీవోలో మెలిక పెట్టారు. ఇదివరకే జరిగిన పల్స్‌ సర్వేను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పల్స్‌ సర్వేలో చాలా చోట్ల చిన్నారులు, గర్భిణుల వివరాలను ఎన్యూమరేటర్లు సక్రమంగా పొందుపర్చలేదు. ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటే చాలా చోట్ల   కేంద్రాలు మూతపడనున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top