‘ఫేస్‌బుక్‌’లో అంగన్‌వాడీ సమాచారం

Anganwadi Details In Facebook Vizianagaram - Sakshi

ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరవాలనిఆదేశించిన ఐసీడీఎస్‌ అధికారులు

రోజువారీ కార్యకలాపాలన్నీఅందులో నమోదు చేయాలని సూచన  

ఆందోళనలో ఫోన్‌ వినియోగం     తెలియని అంగన్‌వాడీలు

గిరిజన గ్రామాల అంగన్‌వాడీలకు సిగ్నల్స్‌         సమస్య  

విజయనగరం ఫోర్ట్‌: ఇప్పటివరకు నాలుగు గోడలకే పరిమితమైన అంగన్‌వాడీల సేవలు ఇకపై బహిర్గతం కానున్నాయి. ఇప్పటి వరకు శాఖాపరమైన అధికారులు మాత్రమే వారి పనితీరును తెలు సుకునేవారు. ఇకపై ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉన్న వారంతా తెలుసుకునేలా చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరవాలని ఐసీడీఎస్‌ అధికా రులు ఆదేశాలు జారీ చేశారు. రోజువారీ కార్యకలాపాలన్నీ అందులోనే నమోదు చేయాలని సూచించారు. అయితే, ఫోన్‌ వినియోగం తెలియని అంగన్‌వాడీ కార్యకర్తలు అధికారుల ఆదేశాలతో ఆందోళన చెందుతున్నారు. గిరిజన పల్లెల్లో సిగ్నల్స్‌ ఉండవని, పింఛన్ల పంపిణీకే ఆపసోపాలు పడుతున్న సమయంలో ఫేస్‌ బుక్‌లో ప్రతీరోజూ అంగన్‌వాడీ కార్యకలాపాలు అప్‌లోడ్‌ చేయడం కష్టమన్న భావన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ పరిస్థితి...
జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,987 పెద్ద, 742 చిన్న అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2,987  మంది కార్యకర్తలు, 2,987 మంది ఆయాలు, 742 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరవాలని  అధికారులు ఆదేశించడంతో అధికశాతం మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. చాలా మం దికి ఫేస్‌బుక్‌ ఖాతా తెరవడం, కార్యకలాపాల ఆప్‌లోడింగ్‌ తెలియదు. ప్రధానంగా గిరిజన ప్రాంత అంగన్‌వాడీ కార్యకర్తల్లో చాలామందికి దీనిపై కనీస అవగాహన లేదు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో నెట్‌ సమస్య కూడా వారిని ఆవేదనకు గురిచేస్తోంది.

మారుతున్న పద్ధతులు...
అంగన్‌వాడీ కార్యకర్తలు గతంలో అనేక రికార్డులు నిర్వహిస్తూ వచ్చారు. సాధారణ పద్ధతిలో వాటిని నిర్వహించడం కష్టతరం కావడంతోఇదే విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అధికారులు కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ (కాస్‌)ను ప్రవేశ పెట్టారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు పిల్లలు 1,13,878 మంది,  15,575 మంది గర్భిణులు, 15,395 మంది బాలింతలకు సేవలు అందుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు అన్న అమృతహస్తం, బాలామృతం కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నీ ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌లో నమోదు చేయాలి.

జిల్లాకో డాష్‌ బోర్డు ఏర్పాటు...  
 ప్రతీ జిల్లాకు ఒక డాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు కొన్ని శాఖలకే పరిమితమైన డాష్‌ బోర్డు ఐసీడీఎస్‌ శాఖలో కూడా ఏర్పాటు చేయనున్నారు. కాస్‌ విధానం కాదని  ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరవాలని ఆదేశించడాన్ని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top