‘ఇంటి’ లెక్కలతో మంత్రికి చిక్కులు | Sakshi
Sakshi News home page

‘ఇంటి’ లెక్కలతో మంత్రికి చిక్కులు

Published Tue, Mar 17 2015 3:36 AM

‘ఇంటి’ లెక్కలతో మంత్రికి చిక్కులు

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు
 మరో పక్క 95.99 శాతం బాగుందని మంత్రి మృణాళిని ప్రకటన
 ఇదే విషయాన్ని మళ్లీ స్పష్టం చేయమన్న విపక్ష నేత జగన్
 
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఇంటి లెక్కలపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ మంత్రికి ముచ్చెమటలు పట్టించింది.  పొంతనలేకుండా మంత్రి సమాధానం చెప్పటంపై విపక్ష నేత వివరణ కోరడం... జవాబు కోసం మంత్రి తడుముకోవడంతో అధికార పక్షం ఇరుకున పడింది.  మంత్రిని కాపాడుకునేందుకు విపక్ష నేతపై అధికార పక్షం ఆరోపణాస్త్రాలు సంధించింది. చర్చను పక్కదారి పట్టించేందుకు  ప్రయత్నించింది. మంత్రి తీరును చివరకు సభాపతే ఆక్షేపించడం గమనార్హం. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రశ్నోత్తరాల సమయంలో స్వల్ప చర్చ జరిగింది.
 
 మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు దీనిని లేవనెత్తారు. మండపేట పరిధిలో ఏఈ అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార పక్ష సభ్యులు కల్పించుకుని గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని, వీటిపై దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని బదులిస్తూ పథకంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పారు. జియోటాగింగ్ పద్ధతిలో క్షేత్రస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రాథమికంగా 30 వేల ఇళ్లను పరిశీలించామన్నారు. కొన్నిటిని షాపులకు, మరికొన్ని గొడ్ల చావిళ్లకు, ఇంకొన్ని రెండంతస్తుల భవనాలు నిర్మించినట్టు తమ దృష్టికి వచ్చిందని  వివరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 95.99 శాతం సక్రమంగానే ఉన్నాయని, కేవలం 4 శాతమే అక్రమాలు చోటు చేసుకున్నాయని బదులిచ్చారు.
 
 వివరణ కోరిన విపక్ష నేత
 ఈ దశలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని మంత్రిని వివరణ కోరారు. ‘నేను సరిగా వినలేదు. ‘‘ఈ పథకంలో కేవలం 4 శాతమే అక్రమాలు జరిగాయి. 95 శాతం సక్రమంగానే ఉన్నాయి’’.. ఇదే కదా మీరు చెప్పింది. ఈ విషయాన్ని మరోసారి వివరించండి’ అని కోరారు. అంతా సక్రమంగానే ఉందని అంతకు ముందే సర్టిఫికెట్ ఇచ్చిన మంత్రి... విపక్ష నేత ప్రశ్నతో దిక్కు తోచలేదు. క్షణం క్రితం చెప్పిన అంకెలనే సమాధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. తాను వివరాలన్నీ అడగడం లేదని, 95 శాతం సక్రమంగానే ఉందని మంత్రి చెప్పిన విషయంపైనే స్పష్టత కోరుతున్నానన్నారు. సూటిగా జవాబివ్వాలని పట్టుబట్టారు.
 
 ఈ దశలో  మృణాళిని తత్తరపాటుకు లోనయ్యారు.  ఇప్పటివరకూ కేవలం 30 వేల ఇళ్లకే జియోటాగింగ్ జరిగిందని, ప్రాథమిక వివరాల ప్రకారం 95 శాతం సవ్యంగానే ఉన్నాయని గుర్తించినట్టు చెప్పారు. మొత్తం 46 లక్షల ఇళ్ళను పరిశీలించిన తర్వాతే సమగ్ర వివరాలు అందుతాయని బదులిచ్చారు. సంతృప్తి చెంద ని ప్రతిపక్ష నేత.. వివరాలు చెప్పాలని మం త్రిని కోరారు. అవినీతి ఎంత జరిగింది పునరుద్ఘాటించాలన్నారు. మంత్రి సూటిగా జవాబు ఇవ్వాలని మిగతా సభ్యులూ పట్టుబట్టటంతో ఇరుకున పడ్డ అధికార పక్షం చర్చను పక్కదారి పట్టించేందుకు ఉపక్రమించింది. సంబంధం లేకున్నా మంత్రి కిషోర్ బాబు జోక్యం చేసుకుని విపక్ష నేతపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ దశలో మృణాళిని మరోసారి అవే లెక్కలు విన్పిస్తూ సభ సహనానికి పరీక్ష పెట్టారు. దీన్ని గమనించిన సభాపతి.. విపక్ష నేత అడిగిన దానికే సమాధానం చెప్పాలని సూచించారు. పూర్తిస్థాయి సర్వే తర్వాత వివరాలు సభముందు ఉంచుతామని మంత్రి చెప్పడంతో ఈ అంశం ముగిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement