అన్నీ నాకు తెలియాలి! | all things are in my vision | Sakshi
Sakshi News home page

అన్నీ నాకు తెలియాలి!

Sep 10 2014 2:11 AM | Updated on Aug 10 2018 8:08 PM

అన్నీ నాకు తెలియాలి! - Sakshi

అన్నీ నాకు తెలియాలి!

నగర పాలక సంస్థ మేయర్ అజీజ్ మోనార్క్‌ గా భ్రమపడుతున్నారు. సంస్థలో అన్ని విషయాలు తనకు తెలియాలంటూ అధికారులను, సిబ్బందిని ఆదేశిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నగర పాలక సంస్థ మేయర్ అజీజ్ మోనార్క్‌గా భ్రమపడుతున్నారు. సంస్థలో అన్ని విషయాలు తనకు తెలియాలంటూ అధికారులను, సిబ్బందిని ఆదేశిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినా వారి వెంట వెళ్లకూడదని బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు కూడా తన కనుసన్నల్లోనే ఉండాలని భావించి ఆ మేరకు వారికీ చెప్పినట్లు తెలిసింది. వార్డుల్లో సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలు చేస్తున్న పర్యటనలను బహిష్కరించాలని మేయర్ అధికారులను హెచ్చరినట్లు తెలుస్తోంది.
 
తాను మేయర్‌ను, తనకు తెలియకుండా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని వేధిస్తున్నట్లు తెలిసింది. గతంలో పని చేసిన ఏ మేయరు ప్రవర్తించని విధంగా ఈయన ప్రవర్తించడాన్ని చూసిన ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి మేయరుగా ఎన్నికైన అబ్దుల్ అజీజ్  టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అజీజ్‌ను మేయరును చేసేందుకు అహరహం పాటుపడిన ఎమ్మెల్యేలపై ఆయన విషం కక్కుతున్నాడు. కార్పొరేషన్‌లో ఏ ఫైల్ అయినా తన వద్దకు రాకుండా, ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆయన అధికారులకు జారీ చేశారు. మేయర్ తీరుతో అధికారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
 
కొంత మంది సెలవుపై వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఉన్నత స్థాయి అధికారులను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోటోకోల్ ప్రకారం మేయరు కన్నా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మేయరు అటువంటి ప్రోటోకాల్‌ను పాటించరాదని అధికారులను ఆదేశించడంపై ఈ పరిణామాలకు తామెక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని అధికారులు మనోవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దిన వేడుకల్లో కూడా మేయరు ఇదే విధంగా వ్యవహరించారు.  ఇది అప్పట్లో వివాదమయింది. మేయరు తీరు కారణంగా జాయింట్ కలెక్టరు రేఖారాణితో చీవాట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు కార్పొరేషన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
టీడీపీ వర్గీయులతోనూ సఖ్యత లేదు
ఇకపోతే మేయర్ టీడీపీ వర్గీయులతో కూడా సఖ్యతగా ఉండటం లేదని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించాలని భావించారు. అయితే మేయరు దుడుకు స్వభావం వల్ల, ఆ పార్టీ నాయకులు కార్యక్రమాన్ని నగర పరిధిని దాటి నిర్వహించారు. మేయరు ప్రమేయం లేకుండా నిర్వహించారు. అయినా మేయరులో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. మేయరు తీరు చూస్తుంటే ఆయన మోనార్క్‌గా భావిస్తున్నారని, ఆయన తన స్థాయి, పరిధిని తెలుసుకుని మసలుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అధికారులు, కార్పొరేటర్లు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement