ఆఫీసుల్లోనూ ‘సభ’ చర్చలే! | All employees in office dicusse on Samaikya sankharavam meeting | Sakshi
Sakshi News home page

ఆఫీసుల్లోనూ ‘సభ’ చర్చలే!

Oct 27 2013 2:19 AM | Updated on Jul 25 2018 4:09 PM

సచివాలయంతో పాటు జంటనగరాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, ఉన్నతాధికారులందరు శనివారం సమైక్య శంఖారావం సభపైనే దృష్టి పెట్టారు.

టీవీలకు అతుక్కుపోయిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్: సచివాలయంతో పాటు జంటనగరాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, ఉన్నతాధికారులందరు శనివారం సమైక్య శంఖారావం సభపైనే దృష్టి పెట్టారు. ఉదయం కార్యాలయాలకు వచ్చినప్పటి నుంచి సభ ఎలా జరుగుతుంది, వర్షం ఇబ్బంది పెడుతుందా? అనే విషయాలనే చర్చించుకున్నారు. సచివాలయంలో ఉద్యోగుల నుంచి ఐఏఎస్‌ల వరకు అంతా మధ్యాహ్నం నుంచి సాయంత్రం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ముగిసేదాకా టీవీల ముందే కనిపించారు.
 
 సభకు భారీగా వచ్చిన జనం, వారి స్పందన చూసిన కొంత మంది ఉద్యోగులు మళ్లీ ఇదే స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని జగన్ ప్రశ్నించిన తీరును ఉన్నతాధికారులు, ఉద్యోగులు మెచ్చుకున్నారు. అలాగే రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను సోదాహరణంగా చెప్పడంతో పాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచాలో కూడా జగన్ స్పష్టంగా వివరించారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు, వరదలను కూడా లెక్కచేయకుండా భారీ సంఖ్యలో జనం తరలిరావడం సాధారణమైన విషయం కాదని, వారిలోని బలమైన సమైక్య ఆకాంక్షకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నాం 1.30 గంటల ప్రాంతంలో వర్షం జల్లులు రావడంతో కొంత మంది ఉద్యోగులు వర్షం ఆగిపోవాలని కోరుకున్నారు.
 
 పటిష్ట బందోబస్తు
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నగర పోలీసులు మాత్రం తమ విధుల్ని పక్కాగా నిర్వర్తించారు. ఫలితంగా ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభ పూర్తి ప్రశాంతంగా ముగిసింది. సభకు పోలీసులు కనీవినీ ఎరుగని బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నుంచే ఆ విధుల్లో నిమగ్నమయ్యారు. సభకు వచ్చిన సమైక్యవాదులు కూడా పూర్తి సంయమనం, క్రమశిక్షణలతో నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నారు. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సభా వేదికైన ఎల్బీ స్టేడియం ఉన్న మధ్యమండలంతో పాటు రాజధాని మొత్తాన్ని డేగ కళ్లతో పహారా కాశారు. నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 5,000కు పైగా సిబ్బంది తెల్లవారుజాము నుంచే నగరవ్యాప్తంగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనా జరగకుండా పర్యవేక్షించారు. స్టేడియం పరిసరాల్లోనే 3,000 మంది దాకా విధుల్లో ఉన్నారు. స్టేడియాన్ని లోనికి దారి తీసే కీలక మార్గాలతో సహా కేంద్ర బలగాల అధీనంలో ఉంచారు. నగరంలోని ఒక్కో జోన్‌కు ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement