‘ఎస్మా’కు భయపడం | Afraid to 'Esma' | Sakshi
Sakshi News home page

‘ఎస్మా’కు భయపడం

Aug 19 2013 3:43 AM | Updated on Sep 1 2017 9:54 PM

సీమాంధ్ర జిల్లాలోని ఉద్యోగులపై ఎస్మా(ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సీమాంధ్ర జిల్లాలోని ఉద్యోగులపై ఎస్మా(ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి భయపడేది లేదని ఉద్యోగులు అంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎన్జీవోలు నిరవధిక సమ్మెలో వెళ్లారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లో పరిపాలన స్తంభించి పోయింది. శనివారం జిల్లా అధికారుల సంఘం సైతం సమైక్యాంధ్ర దీక్షలో పాల్గొన్న ఎన్జీవోలకు సంఘీభావం తెలిపింది.

ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘నో-వర్క్... నో-పే’ అంటూ జీవో నెంబర్ 177 అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తొలుత ఖజానా, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ శాఖలు వాటి అనుబంధ విభాగాలపై సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రధాన శాఖలకు చెందిన ఆఫీసు సబార్డినేట్ నుంచి గెజిటెడ్ స్థాయి వరకు ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ స్థాయి అధికారిపై ఎస్మా ప్రయోగించాలో తెలియలేదని సంబంధిత శాఖల అధికారులు అంటున్నారు. దీనికి తోడు ‘ఎస్మా’కు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఉత్తర్వులు అందలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు.
 
వంద కోట్ల నష్టం
జిల్లాలోని 64 శాఖల్లోని దాదాపు 40 వేల మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. ప్రధానంగా మూడు శాఖలకు సంబంధించి 600 మంది 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో ఐదు రోజులకు గాను జిల్లా ఖజానాకు దాదాపు వంద కోట్ల రూపాయల గండి పడింది. మరో వైపు రవాణా శాఖ ఉద్యోగులు సైతం సమ్మె చేయడమే కాకుండా చెక్‌పోస్టులు సైతం మూసివేయడంతో ప్రభుత్వానికి ఆదాయం మరింతగా తగ్గుతోంది. శాఖల్లోని ఏ ఒక్క ఉద్యోగ సంఘం కూడా సమ్మెను వీడి విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఎస్మా ఎవరిపై ప్రయోగిస్తారో వేచి చూడాల్సి ఉంది.
 
ఎస్మా ప్రయోగానికి భయపడేది లేదు
ఎస్మాకు భయపడి విధులకు హాజరువుతామని ప్రభుత్వం అనుకుంటే పొరబాటు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. భావితరాల భవిష్యత్, ఉద్యోగుల ప్రయోజనాలు, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర కోసం పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలోని ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ప్రజలకు భద్రత కరువయింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు గణనీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వీరి కోసం మా పోరాటాలు కొనసాగిస్తాం. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.
  - ఎస్.సుబ్రమణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నాలుగో తరగతి ఉద్యోగుల సంక్షేమ సంఘం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement