ఏసీబీ వలలో లంచావతారం | ACB trap lancavataram | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో లంచావతారం

Sep 23 2014 2:56 AM | Updated on Sep 2 2017 1:48 PM

ఏసీబీ వలలో లంచావతారం

ఏసీబీ వలలో లంచావతారం

నాయుడుపేట : ఏసీబీ అధికారుల వలలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి తిమింగలం పడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ...

నాయుడుపేట : ఏసీబీ అధికారుల వలలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి తిమింగలం పడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఖాదర్‌బాషా రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిపోయాడు. అనంతరం గూడూరులోని ఆయన ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..సూళ్లూరుపేటలోని సూళ్లూరు నాగరాజుపురానికి చెం దిన కళత్తూరు సుబ్బరామిరెడ్డికి 1.04 ఎకరాల భూమి ఉండేది. సీలింగ్ యాక్ట్ కింద 1974లో అప్పటి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసమని 92 సెంట్ల భూమిని సేకరించింది. దానికి సంబంధించి ఆయనకు అప్పటి నుంచి పరిహారం అందలేదు. విలువైన భూమి కావడంతో ప్రభుత్వం ప్రకటించినా పరిహారం నచ్చక, భూమిని తనకే తిరిగి అప్పగించాలంటూ సుబ్బరామిరెడ్డి కొన్నేళ్ల పాటు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగారు. అధికారుల నుంచి స్పందన కరువవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుబ్బరామిరెడ్డికి రూ.23,18,923 చెల్లించాలని ఆరు నెలల క్రితం కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా అధికారుల తీరులో మార్పు రాలేదు. ఆయనకు పరిహారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే నాయుడుపేటలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కావడంతో ఏఓ ఖాదర్‌బాషా చుట్టూ తిరగసాగాడు. విషయం తెలుసుకున్న సుబ్బరామిరెడ్డి మనుమడు నాయుడుపేట పిచ్చిరెడ్డి తోపునకు చెందిన ప్రతాప్‌రెడ్డి ఆ భూమికి సంబంధించి పవర్ ఆఫ్ పట్టా పొందాడు. అనంతరం ఆయన కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందన కరువైంది. దీంతో ఖాదర్‌బాషాను ప్రతాప్‌రెడ్డి వారం క్రితం కలిసి మాట్లాడగా రూ.50 వేలు లంచం ఇస్తే పరిహారం అందేలా చూస్తానని చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ప్రతాప్‌రెడ్డి ఏసీబీ డీఎస్పీ నంజుండప్పను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఖాదర్‌బాషాకు రూ.25 వేలు మొత్తాన్ని ప్రతాప్‌రెడ్డి అందజేశాడు. అప్పటికే అక్కడ మాటేసిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాదర్‌బాషాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నెల్లూరుకు తరలించారు. డీఎస్పీ నంజుండప్ప వెంట ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, కృపానందం, శివకుమార్‌రెడ్డి, సిబ్బంది మధుసూదన్‌రావు, ఫణి, కుద్దూష్, షఫీ, సుబ్బారావు తదితరులు ఉన్నారు.
 పక్కా ప్రణాళికతో..
 ఏఓ ఖాదర్‌బాషాను ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకే లుంగీలు ధరించి ప్రైవేటు వాహనంలో సాధారణ వ్యక్తుల్లా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. ప్రతాప్‌రెడ్డితో ఖాదర్‌బాషాకు ఫోన్ చేయించారు. సాయంత్రం 6 గంటలకు ప్రతాప్‌రెడ్డి ఫోన్‌కు స్పందించిన ఖాదర్‌బాషా నగదు తీసుకుని బస్టాండ్ ప్రాంతంలోని అమరావతి హోటల్ వద్దకు రమ్మన్నాడు. మొదట రూ.25 వేలు తీసుకుని మిగిలిన రూ.25 వేలు విషయమై మాట్లాడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలోనే ఖాదర్‌బాషాపై పలు ఆరోపణలున్నాయి. మేనకూరు సెజ్‌కు సంబంధించి సేకరించిన భూముల పరిహారం చెల్లింపులో వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. పాత రికార్డుల ఆధారంగా బినామీ పేర్లతో పరిహారం డ్రా చేశారని అధికారులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి.
 గూడూరులో సోదాలు
 గూడూరు టౌన్: ఖాదర్‌బాషాపై పలు ఆరోపణలు రావడంతో గూడూరులోని మాళవ్యానగర్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పత్రాలు, నగదు దొరకలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ కృపానందం ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. అయితే ఖాదర్‌బాషా లంచం తీసుకుంటూ చిక్కాడనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన గూడూరు ఆర్డీఓ కార్యాలయంలోనూ ఏఓగా పనిచేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement