చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామ వీఆర్వో ఎమ్. మూర్తి రూ.1500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
రామచంద్రాపురం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామ వీఆర్వో ఎమ్. మూర్తి రూ.1500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన గురువారం రామచంద్రాపురం మండల రెవిన్యూ కార్యాలయంలో జరిగింది. వివరాల ప్రకారం.. నడమలూరు గ్రామానికి చెందిన హేమలత అనే మహిళా రైతు పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం గత నెల 27న దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె భర్త సాయిప్రసాద్ బుధవారం వీఆర్వో మూర్తిని కలిసి తొందరగా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని కోరాడు.
అయితే వీఆర్వో అందుకు రూ. 3 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సాయిప్రసాద్ అంత డబ్బు ఇవ్వలేనని రూ.1500లు తీసుకోవాలని కోరాగా, అందుకు వీఆర్వో ఒప్పుకున్నాడు. కాగా లంచం ఇవ్వడం ఇష్టం లేని సాయిప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సాయిప్రసాద్ లంచం ఇస్తుండగా వీఆర్వోను పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.