ఏ రోజుకారోజు ఉద్యమ ఉప్పెనతో జిల్లా అట్టుడుకుతోంది. అటు పల్లెల్లో, ఇటు నగరాల్లో ఎటు చూసినా సమైక్య నినాదాల హోరే వినిపిస్తోంది. నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలతో ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది.
సాక్షి, కడప : ఏ రోజుకారోజు ఉద్యమ ఉప్పెనతో జిల్లా అట్టుడుకుతోంది. అటు పల్లెల్లో, ఇటు నగరాల్లో ఎటు చూసినా సమైక్య నినాదాల హోరే వినిపిస్తోంది. నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలతో ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. జన నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేయడంతోపాటు ర్యాలీలు, నిరసన దీక్షలు కొనసాగాయి. బుధవారం 29వ రోజు సైతం సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్సార్‌సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, భూపేష్‌రెడ్డి, కిశోర్‌కుమార్, అఫ్జల్‌ఖాన్ చేపట్టిన ఆమరణ దీక్షలు బుధవారంతో మూడవ రోజు పూర్తయ్యాయి. వెల్లువలా జనాలు తరలివచ్చి వీరికి సంఘీభావం తెలిపారు. జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి మద్దతు తెలిపారు.
నాన్ జేఏసీ అధ్యక్షుడు ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్‌ఓ ఈశ్వరయ్య నేతృత్వంలో జిల్లా అధికారులు కలెక్టరేట్ వద్ద ఉట్టి కొట్టి నిరసన తెలియజేశారు. అర్చకులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట హోమాన్ని నిర్వహించారు. డాక్టర్లు, ఐఎంఎ, మెడికల్, ఫాతిమా కళాశాల సిబ్బంది, నర్సింగ్ కళాశాలల సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. పశు సంవర్థక శాఖ ఉద్యోగులు కాగడాల ర్యాలీ చేపట్టారు. ఉపాధ్యాయ, రెవెన్యూ, జేఏసీ, విద్యుత్ కార్మికులు, మున్సిపల్, డీఆర్‌డీఎ సిబ్బంది నేతృత్వంలో దీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రొద్దుటూరులో పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, ఎల్‌ఐసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అమృతనగర్, కొర్రపాడు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. గోపీకృష్ణ స్కూల్ ఆధ్వర్యంలో 100 మంది చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో పట్టణంలో నిరసన తెలిపారు.
పులివెందుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా, కేంద్ర మంత్రుల ఫొటోలను తయారుచేసి వారు సోనియాకు భజన చేస్తున్న విధంగా దృశ్యాలను పొందుపరిచారు. ఉపాధ్యాయులు శరీరానికి ఆకులు కట్టుకొని ఈటెలు పట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు.
మైదుకూరులో చాపాడు, దువ్వూరు, ఖాజీపేట, మైదుకూరు నాలుగు మండలాల రెవెన్యూ సిబ్బంది భారీ ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు. ఇరువురు ఉద్యోగులు అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు.
రాయచోటిలో అద్దె బస్సుల సంఘం ఆధ్వర్యంలో బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో జల భిక్షాటన ఏర్పాటుచేసి నేతాజీ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. పట్టు పరిశ్రమల శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ నేత అల్లె ప్రభావతి నేతృత్వంలో 5వేల మంది మహిళలు మోరగుడి నుంచి పాతబస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చెక్కభజనలు, కోలాటం, కట్టెసాము, విచిత్ర వేషధారణలతో పాటు సమైక్య నినాదాలతో హోరెత్తించారు.
వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆయన సతీమణి అరుణ, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, హనుమంతరెడ్డి సంఘీభావం తెలిపారు. ఎర్రగుంట్లలో తెలుగుదేశం పార్టీ కారణంగానే రాష్ట్రం విడిపోయిందని ప్రసంగిస్తున్న ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు రఘురామిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడిచేశారు. ఈ దాడి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి పాతబస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా వ్యతిరేక నినాదాలతో పట్టణం మారుమోగింది.
బద్వేలులో మహిళా ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. 2వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో మార్కాపురం గ్రామస్తులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. కలసపాడులో జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. వంటావార్పు చేపట్టారు. కమలాపురంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులతో తహశీల్దార్ సమావేశం నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడాలని కోరారు.