ఒంగోలులో 14 రోజులు లాక్‌డౌన్‌ అమలు

14 Days Lockdown In Ongole City - Sakshi

ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్‌

ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమలు

సాక్షి, ఒంగోలు ‌: జిల్లా కేంద్రంలో మళ్లీ కంటైన్‌మెంట్‌ జోన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో నిర్బంధం ఒక్కటే విరుగుడుగా యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఎల్లుండి (ఆదివారం) నుంచి నగరంలో పూర్థిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో జిల్లాలో పాజిటివ్‌ కేసులు పూర్తిగా తగ్గిపోయి జీరో అయిన సంగతి తెలిసింది. తాజాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లా కేంద్రంలో మళ్లీ అవే నిబంధనలు పూర్తిగా అమలు చేయబోతున్నారు. (కరోనా అలెర్ట్‌.. 6 లక్షల పరీక్షలు)

మొత్తం కేసుల సంఖ్య 268
ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో రికార్డులు తిరగరాస్తోంది. బుధవారం అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయనుకుంటే తాజాగా గురువారం అందిన రిపోర్టులలో రికార్డు స్థాయిలో 38 కేసులు ఉండటం ఇటు జిల్లావాసులను, అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాజా కేసుల్లో ఒక్క చీరాల పట్టణంలోనే అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా జిల్లా కేంద్రంలో ఎనిమిది కేసులు, పామూరులో ఆరు కోవిడ్‌–19 కేసులు ఉన్నాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 268కి చేరింది.

30 కేసులు.. 13 కంటైన్‌మెంట్‌ జోన్లు.
ఒంగోలు నగరంలో ఈనెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాకు గురైన వారితోపాటు వారి కుటుంబీకుల్లో కూడా లక్షణాలు కనిపిస్తుండటం యంత్రాంగాన్ని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కరోనా కేసు వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఉన్న వారందరిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ నివేదికలు వచ్చేనాటికి సమయం పడుతుండటంతో యంత్రాంగం ముందుగానే రంగంలోకి దిగింది. ఒంగోలులో కరోనా విజృంభిస్తుండటంతో తొలిసారిగా 13 కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనుంది. నగరంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో భాగంగా 200 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించి, వాటి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంతమంది ప్రజలు నివశిస్తున్నారో లెక్క తేల్చారు. అదేవిధంగా మరో 200 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను బఫర్‌ జోన్లుగా గుర్తించి వాటి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు నివశిస్తున్నారో కూడా నిర్ధారించారు. (కుటుంబాలలో కరోనా వ్యాప్తి ఎక్కువ)

ప్రజల్లో కనిపించని మార్పు.. 
దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఒంగోలు నగరంలోని ప్రజలు మొదట్లో కొంతమేర సహకరించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి సడలింపులు ఇచ్చిన ప్రతిసారీ ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గుంపులు గుంపులుగా రోడ్లపై ఉండటం, ఫేస్‌ మాస్క్‌లు కూడా ధరించకుండా ఒకరినొకరు ఆనుకొని కూర్చోవడం, నిలబడటం వంటివి చేశారు. టీ కొట్ల వద్ద గుంపుగా నిల్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండటం వంటివి జరిగాయి. ఫేస్‌ మాస్క్‌లు ధరించనివారికి ఫైన్లు విధించినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. లక్ష రూపాయలకు పైగా ఫైన్లు కట్టారు తప్పితే ఫేస్‌ మాస్క్‌లు కూడా ధరించేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. నగర ప్రజలు కనీస రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో చివరకు లాక్‌డౌన్‌ పరిస్థితులకు దారితీసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top