నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ | నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

Feb 11 2014 4:10 AM | Updated on Oct 8 2018 3:17 PM

నలుగురు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసి, వారి నుంచి *7 లక్షల విలువైన ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ పింగిలి నరేష్‌రెడ్డి తెలిపారు.

మహబూబాబాద్, న్యూస్‌లైన్ :  నలుగురు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసి, వారి నుంచి *7 లక్షల విలువైన ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ పింగిలి నరేష్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం... మరిపెడ మండలం ఉగ్గంపల్లికి చెందిన దరంసోత్ రాంకోటి, మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సమీపంలోని దామ ప్రాంతానికి చెందిన ధర్మేంద్రజైన్ కొంతకాలంగా మానుకోటలోనే నివాసముంటున్నారు. గతంలో ధర్మేంద్ర జైన్ నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా పనిచేసి అవినీతికి పాల్పడి సస్పెండయ్యాడు. అప్పటి నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రాంకోటి, ధర్మేంద్రజైన్‌కు మానుకోటకు చెందిన వెంకటనర్సింహారావుతో పరిచయం ఏర్పడింది.

ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై మానుకోట రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. రెండు బ్యాగుల్లో 52 కేజీల ఎండుగంజాయితో దొరికారు. పక్కా సమాచారం మేరకే ఆదివారం సాయంత్రం రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస థియేటర్ ఎదుట ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొరికిన 52 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని విచారించగా మరొకరి పేరు బయటపెట్టారు. వారి సమాచారంతో మానుకోట శివారు ఎన్‌జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్న దరంసోత్ కమల ఇంటిపై దాడి చేయగా 13 కేజీల గంజాయి లభ్యమైంది.

దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనంతోపాటు మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. ధర్మేంద్రజైన్, రాంకోటి, నర్సింహారావు విశాఖపట్నంలో *మూడున్నర లక్షల ఎండు గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. కేజీ *5 వేల చొప్పున కొనుగోలు చేసి, వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి కిలో 10 వేలు ఆదాయం ఆర్జించేలా భోపాల్‌లో విక్రయించేందుకు మానుకోట రైల్వేస్టేషన్‌కు వస్తున్నట్లు విచారణలో తేలింది.

అనంతరం ఆ నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ధర్మేంద్రజైన్, కమలతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడని, గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడి శిక్ష అనుభవించారని, పాత కేసుల్లో ఇద్దరు నిందితులేనని తెలిపారు. గంజాయి కేసు నిందితులను పట్టుకున్న టౌన్ ఎస్సై ప్రసాదరావు, సిబ్బందికి ఎస్పీతో మాట్లాడి వారికి రివార్డులను అందజేస్తామని సీఐ తెలిపారు. టౌన్ సీఐ ప్రసాదరావు, సిబ్బంది నర్సింగరావు, దేవ్‌సింగ్, శంకర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement