breaking news
-
‘చేబ్రోలు కిరణ్ కుమార్‌ను పెంచి పోషించింది ఐటీడీపీనే’
గుంటూరు,సాక్షి: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా చేబ్రోల్ కిరణ్ కుమార్ వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కిరణ్ కుమార్‌ను ఐటీడీపీ పోషిస్తోంది. ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని దుయ్యబట్టారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసేందుకు అంబటి రాంబాబు శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్ రాత్రి ఎలా ట్రీట్ చేశారో అని తెలుసుకునేందుకు వచ్చా. మాధవ్‌ను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని చెప్పారు. కోర్టు ముందు ప్రవేశ పెట్టేటప్పుడు కలిసేందుకు అవకాశం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిపారు.‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. చేబ్రోలు కిరణ్ కుమార్ ఏడాది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అప్పటినుంచి అతన్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. కిరణ్ కుమార్‌ను ఐటీడీపీ పోషిస్తోంది. ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని ధ్వజమెత్తారు. -
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
తిరుపతి, సాక్షి: తిరుమల ప్రతిష్టతను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన.. గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతిని బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ, ఇవాళ జరుగుతోంది ఏంటి?. టీటీడీ గోశాల(TTD Goshala)లో అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు. కానీ, తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు... మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల పట్ల కూటమి సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్ అంటూ లేడు. డీఎఫ్‌వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జిగా నియమించారు. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది.. భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ మహా పాపం కూటమి సర్కార్, టీటీడీ అధికారులదే. ఇంత జరుగుతున్నా.. పవనానంద స్వామి(Pawan Kalyan) ఎక్కడ? ఏం చేస్తున్నారు?. గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్న భూమన.. గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారాయన. -
టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?
ఆంధ్రప్రదేశ్ కూటమి భాగస్వాములు టీడీపీ, జనసేనల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే.. ఒకపక్క సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్.. పవన్ కళ్యాణ్‌ను అతిగా పొగిడేస్తూంటే.. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూండటం!. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడంటూ పలు కార్యక్రమాల్లో ప్రశంసిస్తూండటం.. ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు! ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవీ స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది.జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలని ఏకంగా లేఖలు రాస్తుండటం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది!. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అసలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు.నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పినవారికే పనులు చేయాలని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు. ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారన్నది జనసేన కేడర్‌లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే, సమస్య ఏమిటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించిందన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్ని సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ, ఆ తర్వాత రోజులలో అవే పెద్దవిగా మారుతుంటాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల మధ్య స్నేహం పెరిగిన మాట నిజమైనా.. ఎన్నికల తరువాత మాత్రం వీరిద్దరూ అంటీ అంటనట్టుగానే ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత లోకేశ్ ఒకరకంగా పవన్ కళ్యాణ్‌ను అవమానించేలా వ్యాఖ్యానించారు కూడా. టీటీడీ అధికారులు, ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే, అది ఆయన పార్టీ అభిప్రాయం అని లోకేశ్ తీసిపారేశారు. చైర్మన్‌తో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పించారు తప్పితే పవన్ కోరినట్లు అధికారులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. క్షమాపణలు కూడా చెప్పించ లేదు. పవన్ కళ్యాణ్ వద్ద పనిచేసే అధికారుల నియామకం విషయంలో కూడా లోకేశ్ జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానిపై పవన్ ఢిల్లీలో కూడా నిరసన చెప్పారని కథనాలు వ్యాపించాయి.అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడ లేదు కానీ, లోకేశ్ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేశ్‌కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్‌కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పాలిట్‌బ్యూరో నిర్ణయమని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు ఏభై సీట్లు డిమాండ్ చేయమని సూచించినా, పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు.2017 ప్రాంతంలో లోకేశ్‌పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీపడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్‌ల కన్నా లోకేశ్ పవర్ఫుల్ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ‘సీజ్ ద షిప్’ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వులపాలయ్యారు. చంద్రబాబు, పవన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు కానీ.. లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేశ్ కోరిక తీరలేదని అంటారు. ఇప్పటికే లోకేశ్‌ను సీఎంను చేయాలని చంద్రబాబుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుందని చంద్రబాబు సర్ది చెబుతుండవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ఇక, ఇది నిజమా? కాదా? అన్నది చెప్పలేం కానీ.. పవన్ కళ్యాణ్ ఆయా సభలలో చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని, ఆయన సమర్థుడని, అనుభవజ్ఞుడని పనికట్టుకుని పొగుడుతున్న తీరు లోకేశ్ అనుచరులకు మింగుడుపడటం లేదనిపిస్తుంది. కేవలం లోకేశ్‌ను సీఎం కానివ్వకుండా, లేదా డిప్యూటీ సీఎం ప్రమోషన్ రానివ్వకుండా చూడడానికి పవన్ ప్రకటనలు ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ వ్యూహం మార్చి తన ప్రమోషన్‌కు పవన్ కళ్యాణ్ నుంచి ఆటంకం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు ఆరంభించారా అన్న సందేహం కలుగుతుంది. కొన్నాళ్లుగా లోకేశ్ తనకు సంబంధం లేని శాఖలలో కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. ఆ సభలలో ఒకటికి రెండుసార్లు 'పవనన్న, పవనన్న’ అని ప్రస్తావిస్తూండటం.. ‘పవనన్న పట్టుబడితే సాధించి తీరుతారని, కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నారని’ పొగడ్తలు కురిపిస్తున్నారు.గతంలో ఇలాంటి ప్రోగ్రాంలను చంద్రబాబు వదలి పెట్టేవారు కారు. ఇప్పుడు తన కుమారుడి ఆధిపత్యానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. దాంతో టీడీపీ మంత్రులు లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాలలో లోకేశ్ పర్యటనలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు తర్వాత పెత్తనం ఎటూ లోకేశ్‌దే కనుక ఇందులో పెద్దగా ఆక్షేపించవలసింది ఉండకపోవచ్చు. పార్టీ పరంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కాని, ప్రభుత్వ పరంగా లోకేశ్ ఇలా పెత్తనం చెలాయించడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది.మరోవైపు, పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ, లోకేశ్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేశ్ బుజ్జగించి పవన్‌ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చన్నది పలువురి భావన. పదిహేనేళ్లు కలిసి ఉండాలని అనుకుంటున్నప్పుడు మరీ తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్‌కు వస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేశ్ మరో మాట కూడా చెబుతున్నారు.టీడీపీ, జనసేనల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరు పడబోమని అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు. లోపల జరిగేవి వేరుగా ఉంటుంటాయి. అలాగే పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ, కలిసి ఉన్నట్లు కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు యత్నించినా ఆశ్చర్యం ఉండదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోలీసుల కుట్ర.. తోపుదుర్తిపై మరో కేసు నమోదు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.వైఎస్సార్సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాప్తాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా తోపుదుర్తిపై రామగిరి పోలీసులు కేసు పెట్టారు. వైఎస్ జగన్ వచ్చిన సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు.. హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. దీంతో, పోలీసులు భద్రతా వైఫల్యం కనిపించింది. ఈ క్రమంలోనే తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని తాజాగా తోపుదుర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌తో ఫిర్యాదు చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇక, ఇటీవల ఎంపీపీ ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై పెనుగొండ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ అద్భుత నాయకుడు
సాక్షి, హైదరాబాద్: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన నాయకుడు.. జీవితంలో ఆయన అత్యంత కఠిన సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది. ఆయన పోరాట యోధుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ 2.0ను చూస్తున్నాం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వూ్యలో కవిత మాట్లాడుతూ, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావన రాగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు.‘పవన్ కళ్యాణ్‌ను నేను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దురదృష్టవశాత్తూ ఆయన పొరుగు రాష్ట్రం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఆయన గురించి అన్నీ ప్రశ్నించాలి్సన అంశాలే. చెగువేరాను ప్రేమించే వ్యక్తి ఏకంగా సనాతన వాదిగా ఎలా మారతాడు. ఆయన ఇచ్చే రాజకీయ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీని రుద్దకూడదు అని కూడా అంటాడు. అందుకే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నలపై నేను నిజంగా స్పందించాలని అనుకోవడం లేదు. ఆయనను సీరియస్ రాజకీయ నాయకుడిగా పరిగణించడం లేదు’ అని కవిత వ్యాఖ్యానించారు. గతంలో ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కవిత గుర్తు చేశారు. ‘దళిత మహిళ కాబట్టే హోంశాఖ మంత్రి అనితను పక్కన పెట్టి తాను హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటాను అన్నాడు. లోకేశ్ హోంమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసేవాడా’ అని కవిత ప్రశ్నించారు. -
చర్యకు ప్రతి చర్య! బాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
న్యూటన్ సూత్రం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుంది..! చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో.. అంతకు రెట్టింపు వేగంతో పైకి లేచి ఆయనకు తగులుతుంది – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. మంచి చేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకుని ఒక నాయకుడు పాలన చేయాలి. అలా కాకుండా అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టి కాయ వేస్తారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఏపీ, తమిళనాడు ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు.కాబట్టి మనం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలి’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో పాటు, పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే..విలువలు, విశ్వసనీయతే మన సిద్ధాంతం..వైఎస్సార్సీపీకి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లిన పరిస్థితుల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఇవాళ బలమైన పార్టీగా ఎదిగింది. మన పార్టీ సిద్ధాంతం ఏమిటంటే.. విలువలతో కూడిన రాజకీయాలు, విశ్వసనీయత. రాష్ట్ర చరిత్రలో వీటికి అర్థం చెప్పిన పార్టీ వైఎస్సార్ సీపీనే. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశా. నాలో ఈ గుణాలను చూసి మీరంతా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగులో అడుగు వేశారు.రాజకీయాల అర్థాన్ని తిరగరాశాం..రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవాళ్టికి కూడా వైఎస్సార్సీపీకి చెందిన ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు గర్వంగా కాలర్ ఎగరవేసుకుని ప్రజల వద్దకు ఏ ఇంటికైనా వెళ్లగలడు. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చి తిరగరాసిన చరిత్ర వైఎస్సార్ సీపీది. మనం రాక మునుపు మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటులా ఉండేది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి హామీలను పక్కాగా అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. మాటకు కట్టుబడి 99 శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం. ప్రతి ఇంటికీ బాబు మోసం..ఇన్ని చేసినా కూడా మనం ఓటమి చెందాం. కారణం.. కొద్దో గొప్పో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. జగన్ వస్తే ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే వస్తాయి..! కానీ చంద్రబాబు వస్తే మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి రూ.45 వేలు వస్తాయని ఆశ పడ్డారు. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు జగన్ రూ.18,750 ఇచ్చాడు.. కానీ చంద్రబాబు వస్తే 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.48 వేలు ఇస్తానన్నాడు...! ప్రతి ఇంటికీ కరపత్రాలు, బాండ్లు పంచారు.ఇంట్లో పిల్లాడు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ బయటకు వస్తే నీకు రూ.18 వేలు అని, ఆ పిల్లల అమ్మమ్మలు బయటకు వస్తే మీకు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు రూ.26 వేలు అని, చదువుకున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. అంటూ ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. దీని వల్ల పది శాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్ చేశాడు కాబట్టి, చంద్రబాబు కూడా చేస్తాడని నమ్మారు. జగన్ చేసినవన్నీ నేను కూడా చేస్తా..! అది కాకుండా ఇంకా ఎక్కువే చేస్తానన్న చంద్రబాబు మాటలను నమ్మారు. చంద్రబాబు మారాడేమోనని కొద్దో గొప్పో ప్రజలు నమ్మారు. దాంతో గతంలో మనకు వచ్చిన 50 శాతం ఓట్ షేర్లో పది శాతం మంది ప్రజలు చంద్రబాబును నమ్మడంతో అటువైపు చెయ్యి అలా వెళ్లింది. ప్రతి హామీ ఒక మోసం..చంద్రబాబు వచ్చి 11 నెలలు గడుస్తోంది. రెండో ఏడాది బడ్జెట్ కూడా పెట్టారు. అదిగో చంద్రబాబు చేస్తారు..! ఇదిగో చేస్తారని పిల్లలు, మహిళలు, రైతులు, యువత ఎదురు చూస్తూ వచ్చారు. అప్పుడు మాట చెప్పా కానీ.. ఇప్పుడు భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు. ఇక్కడ కూడా నిజాయితీ లేదు. ఎగ్గొట్టేందుకు అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రానికున్న అప్పులు రూ.12 లక్షల కోట్లు అని ఒకసారి, రూ.11 లక్షల కోట్లు అని ఒకసారి, రూ.10 లక్షల కోట్లు అని ఇంకోసారి అంటున్నారు. నాడు జగన్ పాలనలో నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాయని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు వచ్చారు.. తింటున్న కంచాన్ని లాగేశాడని అంటున్నారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసంగా మిగిలిపోయింది.తెగింపుతో విజయం సాధించాం..సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని చంద్రబాబు రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం చంద్రబాబుకు కనిపించకపోవడంతో ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మిగతా 50 చోట్ల అనివార్య పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. ఆ తెగింపు వైఎస్సార్సీపీ కేడర్ చూపించింది కాబట్టే.. చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. పోలీసులను వాచ్మెన్ల కంటే ఘోరంగా వాడుకున్నారు. సరిదిద్దుకుని మంచి చెయ్..!చంద్రబాబూ.. ! సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలిచ్చావ్..! ప్రజలకు మంచి చెయ్..! పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టావు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో పెట్టావు. రైతులకు కూడా అన్యాయం చేస్తున్నావ్. ఇవన్నీ సరిదిద్దుకో.. మంచి చెయ్.. ప్రజల మనసులో స్థానం సంపాదించుకో. పూర్వపు బిహార్‌లా తయారైంది మన రాష్ట్రం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటా..మీ అందరికీ ఒకటే చెబుతున్నా. కష్టాలు శాశ్వతంగా ఉండవు. చీకటి వచ్చిన తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది. ఈ మూడేళ్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. ప్రజలకు తోడుగా ఉండండి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్ 2.0 పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్ తోడుగా ఉంటాడు. జగన్ 1.0 లో అనుకున్న మేరకు మీకు తోడుగా ఉండకపోవచ్చు. కోవిడ్ లాంటి విపత్తులతో పాటు ఆ తర్వాత కూడా ప్రజల ప్రతి అవసరంలో వారికి తోడుగా నిలబడాల్సి వచ్చింది. కానీ ఈసారి కార్యకర్తలకు జగన్ 2.0 లో జరిగే మేలు మరెవరికీ జరగని విధంగా చేస్తా.అన్ని రంగాల్లో తిరోగమనమే..⇒ ఈ రోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తిగా తిరోగమనం కనిపిస్తోంది. ⇒ స్కూళ్ల వ్యవస్థను నాశనం చేశాడు. నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. మూడో తరగతి నుంచి టోఫెల్ చదువు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే పరిస్థితి కూడా గాలికెగిరిపోయింది. చివరకు డిగ్రీ, ఇంజనీరింగ్ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిగా గాలికెగిరిపోయాయి.⇒ వైద్య రంగం తీసుకుంటే.. ఆరోగ్యశ్రీలో నెట్వర్క్ ఆస్పత్రులకు 11 నెలలకు దాదాపు రూ.3500 కోట్లు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. ఆరోగ్య ఆసరాను సైతం ఎగ్గొట్టారు.⇒ రైతులకు పెట్టుబడి సాయం కింద అందుతున్న రైతు భరోసాను ఎగరగొట్టారు. చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు గాలికెగిరి పోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. పారదర్శకత పక్కకు పోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. బెల్టు షాపులు లేని గ్రామాలు కనిపించడం లేదు. పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయి. ఏ పరిశ్రమ కొనసాగాలన్నా ఎమ్మెల్యేలకింత..! చంద్రబాబుకింత! అని డబ్బులు కడితేగానీ నడవని పరిస్థితిలో వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి.ఆరు నెలల్లోనే ఆ పరిస్థితి వచ్చిందిసాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమై ప్రజల తరపున నిలబడాలని పిలుపునిచ్చే కార్యక్రమం రెండేళ్ల తర్వాత వస్తుంది. కానీ మొట్ట మొదటి సారిగా చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. చూస్తుండగానే 11 నెలలు పూర్తయ్యాయి. మూడేళ్లు ఇట్టే గడిచిపోతాయి. పార్టీ శ్రేణులు, నాయకులు కలసికట్టుగా నిలవాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలిచి ముమ్మరంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది.మన కార్యకర్త అంటే బాబుకు భయం..అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు చేస్తూ ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కారణం.. వైఎస్సార్ సీపీ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్సార్సీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీల అమలులో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు పాలనలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి. టీడీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సహా కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు సైతం టీడీపీ కేడర్‌ను తిరగనిచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటంతో చంద్రబాబు క్యాడర్ ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తమను ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.రామగిరి ఉప ఎన్నికలో..అనంతపురం జిల్లా రామగిరిలో పది ఎంపీటీసీలుంటే వైఎస్సార్ సీపీ తొమ్మిది గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది. తొమ్మిది గెలిచిన వైఎస్సార్ సీపీనే ఆ ఉప ఎన్నికలో గెలుస్తుందని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు ప్రొటెక్షన్‌తో ఎంపీటీసీలు ప్రయాణించాల్సి వచ్చింది. కానీ ఈ పోలీసులు ఎంత అన్యాయంగా తయారయ్యారంటే.. వారే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమం చేశారు. రామగిరి ఎస్సై ఎంపీటీసీల వాహనం ఎక్కి ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ వీడియో కాల్లో మాట్లాడించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా తలొగ్గలేదు. దీంతో మన పార్టీ ఎంపీటీసీలను సమయం దాటిపోయే వరకు తిప్పుతూ ఎన్నిక జరిగే సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కోరమ్ లేదని ఎన్నిక వాయిదా వేశారు. పెనుగొండ తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్‌ఛార్జి మీద కేసులు పెట్టారు. ఉషమ్మ గట్టిగా ఉక్కు మహిళలా నిలబడి పోరాటం చేసింది. ధర్నా చేస్తే కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం చేశారు. రామగిరిలో ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం సృష్టించేందుకు.. చురుగ్గా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్త, బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను హాకీ స్టిక్‌లతో కొట్టి చంపేశారు. చాలా బాధ అనిపించింది. రాజకీయాలను ఎందుకు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు? -
గోరంట్ల మాధవ్ ఎక్కడ?.. పోలీసులు చెప్పడం లేదు: అంబటి
సాక్షి, గుంటూరు: గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పడం లేదని.. ఒక వేళ అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాత్రి.. గోరంట్ల మాధవ్‌తో మాట్లాడేందుకు నగరపాలెం పీఎస్‌కు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వెళ్లారు. కానీ గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పకపోవడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చేబ్రోలు కిరణ్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోందని.. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కిరణ్‌ను అరెస్ట్ చేయించి.. చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి మండిపడ్డారు. -
‘జగన్‌కి భద్రత కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలం’
సాక్షి, తాడేపల్లి: దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోలీస్ భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏర్పాటైన తరువాత నుంచి జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వైయస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయన ఎక్కడ పర్యటించినా వేల సంఖ్యలో అభిమానులు వస్తుంటారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కనీస పోలీస్ బందోబస్త్ కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..రామగిరి మండలంలో వైయస్ఆర్సీపీ నాయకుడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాపిరెడ్డిపల్లెకు వెళ్లిన వైయస్ జగన్‌కి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. అంతే కాకుండా జగన్ పర్యటనపై హోంమంత్రి అనిత అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. లోపాలను సరిద్దిద్దుకుంటామని కానీ, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కానీ హోంమంత్రి చెప్పకపోవడం చూస్తుంటే జగన్ భద్రత విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.జగన్‌ను పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడినంత మాత్రాన ఆయనకున్న ప్రజాదరణను ఏమాత్రం తగ్గించలేరని గుర్తించుకోవాలి. రోజూ ఏదొక మూలన రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఈ హోంమంత్రికి బాధితులను పరామర్శించే తీరిక ఉండదు. వైఎస్ జగన్ ప్రజలకు అండగా నిలబడితే ఆయన్ను విమర్శించడానికి మాత్రం మీడియా ముందు వాలిపోతుంటారు. ఈ రాష్ట్రంలో నివాసమే ఉండని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా వైఎస్ జగన్ గురించి ఆరోపణలు చేయడం విడ్డూరం. పేరులో ఉన్న సత్యం ఆయన మాటల్లో ఏనాడూ కనపడదు. రాజకీయ భిక్ష పెట్టిన జగన్ ని ఉద్దేశించి మాట్లాడే స్థాయికి ఎంపీ కృష్ణదేవరాయలు తెగబడ్డాడు. కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడు.టీడీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారురామగిరి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత అనైతికంగా వ్యవహరిస్తే, పరిటాల కుటుంబానికి ఎస్సై సుధాకర్ తొత్తులా వ్యవహరించి వైయస్సార్సీపీ ఎంపీటీసీలపై బెదిరింపులకు దిగాడు. పాపిరెడ్డిపల్లెలో వైయస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయకుండా బాధిత కుటుంబాలపైనే కేసులు నమోదు చేసిన నీచంగా వ్యవహరించాడు. రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది ఎస్సై సుధాకర్ లాంటి పోలీసులు చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను సొంత ప్రైవేటు సైన్యంలా వాడుకుంటూ వైయస్సార్సీపీ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికలు పూర్తయినప్పుడు భయంతో రాష్ట్రం విడిచి వెళ్లిన కుటుంబాలు 10 నెలల తర్వాత కూడా నేటికీ గ్రామాల్లో అడుగు పెట్టలేని భయానక వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తోంది.రాష్ట్రంలో గాడితప్పిన శాంతిభద్రతలురాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవి ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో నడిరోడ్డు మీద హత్యలు, ఇళ్లపైన దాడులు, మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, భూ కబ్జాలు జరిగేవా? వైయస్సార్సీపీ నాయకుల మీద పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తుంటే ఇప్పటికే అనేకసార్లు పోలీసులకు కోర్టులు మొట్టికాయలు వేసిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మీద సీఎం చంద్రబాబు దృష్టిసారించాలి. రాప్తాడు లాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలు ఇకనైనా నెరవేర్చకపోతే దారితప్పిన ఈ శాంతిభదత్రలు మీకే ప్రమాదంగా పరిణమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. -
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఆక్వా రైతుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మండిపడ్డారు. ‘‘చంద్రబాబూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15 శాతం సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15 శాతం నుంచి 5 శాతంకి తగ్గింది. అలాగే సోయాబీన్ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? టారిఫ్ సమస్యతో సంబంధం లేని యూరప్ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటి రేటుకూడా పెరగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.220ల రేటు కూడా రైతులకు రావడంలేదు. 100 కౌంట్ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. 1. @ncbn గారూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025 -
వైఎస్ జగన్‌కు భద్రతా వైఫల్యం.. కూటమి ప్రభుత్వానికి బొత్స వార్నింగ్
అమరావతి,సాక్షి: కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ తరుణంలో వైఎస్ జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లిన అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ జగన్ భద్రతపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం. భద్రత విషయంలో కేంద్ర హోమంత్రి అమిత్‌షాను కలుస్తాం. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవురామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. మాజీ సీఎం జగన్‌కు భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్, ఆ సంగతి అధికారులకు తెలుసు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఆక్రోశం.ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారు. గేట్లు సరిగా కట్టకపోతే దానికి ప్రకాష్ రెడ్డిదా తప్పు. అధికారం ఎన్నడు శాశ్వతం కాదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వ తీరు ఇలానే ఉంటే ప్రజలు తిరగబడతారు. జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రతను గాలికి వదిలేస్తున్నారు.జగన్‌కు కావలసిన భద్రత కల్పించాలి. జగన్ భద్రత పట్ల మాకు ఆందోళన ఉంది. జగన్ భద్రత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాము. ప్రధాని మంత్రి దగ్గరకు వెళ్ళి జగన్‌కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తాము.ఎంపీ కృష్ణదేవరాయలకు వారి తండ్రి సంస్కారం నేర్పలేదా. కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది.కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ వర్గం ప్రజలు కూటమి పాలనలో సంతోషంగా లేరు. 1100 మందితో భద్రత కల్పిస్తే పోలీసులు ఎక్కడ ఉన్నారు.1100 మంది కాదు కదా 110 మంది కూడా లేరు. 1100 మంది పోలీసులు ఉండి ఉంటే అందరూ సివిల్ డ్రెస్‌లో ఉన్నారా. ఒక సెలబ్రిటీ వస్తేనే పోలీసులు ఎంతో హడావడి చేస్తారు. మాజీ సీఎం పరామర్శకు వెళ్తే భద్రత కల్పించలేరా. గతంలో చంద్రబాబు పోలీసులు గురించి మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి.రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలి.ఈ రోజు మేము అవ్వచ్చు, రేపు మీరు అవ్వొచ్చు. రాజకీయ నాయకులపై మాట్లాడడం పోలీసులకు ఫ్యాషన్ అయింది. మాన్యువల్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటే మళ్ళీ మాట్లాడరు’ అని వ్యాఖ్యానించారు. -
రామగిరి ఎస్ఐ పనులకు పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి: గోరంట్ల మాధవ్
సాక్షి, తాడేపల్లి: అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్ అని.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా ఆయనేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు మూడంచెల భద్రత అవసరం. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా వేలాదిగా అభిమానులు వస్తున్నారు. వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే’’ అని మాధవ్ అన్నారు.‘‘రామగిరి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్‌గా కనిపించింది. హోంమంత్రి అనిత మాత్రం జగన్ పర్యటనలో 1100 మంది పోలీసులను పెట్టామని చెప్తున్నారు. ఆ 1100 పోలీసుల్లో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి దగ్గరే పెట్టారు. హెలికాఫ్టర్‌ను ఇబ్బందులకు గురిచేసి మార్గమధ్యలో ఆయనపై దాడి చేయాలని కుట్ర పన్నారు. మంత్రి నారా లోకేష్‌కు జెడ్ ప్లస్ రక్షణ కల్పిస్తున్నారు. వైఎస్ జగన్‌కు మాత్రం రక్షణ తగ్గిస్తున్నారు. జగన్‌కు పూర్తిస్థాయి రక్షణ బాధ్యత పోలీసులదే’’ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.‘‘రామగిరిలో ముత్యాలు అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరిగిన సమయంలో నేనే పోలీసులకు సమాచారం ఇచ్చా. ఘటన సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు కింద పడ్డ రాళ్లను తమ వాహనంలో వేసుకుని వెళ్లారు. రామగిరి ఎస్ఐ.. బాధితుల వాహనాల్లో కత్తులు పెట్టి తిరిగి అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్లింది. రామగిరి ఎస్ఐ పనులకు పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం హాస్యాస్పదం’’ అని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. -
పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మంగళవారం.. మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్– 4లోని ఆయన ఇంటికి వెళ్లారు.ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు. -
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution)తో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. అయితే ప్రతి చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారాయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీనే గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయారు... అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ(YSRCP) స్వీప్ చేసింది. అలాంటి చోట్ల బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్మెన్లకంటే ఘోరంగా వాడుకున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో 10కి 9 చోట్ల గెలిచాం. మరి అక్కడ గెలవాల్సింది వైఎస్సార్సీపీ కదా?. అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు. రామగిరి ఎస్సై(Ramagiri SI) ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ బెదిరించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్ఛార్జిమీద కేసులు పెట్టారు. దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్యచేశారు. ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది? అని జగన్ ప్రశ్నించారు. ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీ దారుణాలకు దిగుతోంది. ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ, ప్రతి చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడితే.. అంతే వేగంతో అది పైకి లేస్తుంది. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈపక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ఉమ్మడి కర్నూలు కేడర్‌ను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు. -
‘బాబూ.. వృద్ధిరేటు బాగుంటే అప్పులెందుకు?.. సూపర్ సిక్స్ ఎక్కడ?’
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదో ఒక ఛార్జీలు పెంచుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్నికల ముందు సంపద సృష్టి అని బిల్డప్ ఇచ్చారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అని మండిపడ్డారు.కడపలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పేదల నడ్డి విరుస్తూ కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకో ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరిచారు. సంపద సృష్టి అన్నారు. కానీ, సృష్టి పక్కన పెడితే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అన్నారు.. ఒక్కటీ అమలు కాలేదు. ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదు.జన్మభూమి పేరును మారుస్తూ P-4 అంటూ కొత్త కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులకోసం ఈ కార్యక్రమం.. వారికి దోచి పెట్టేందుకే పీ-4 పథకం తెచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలి. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.మరోవైపు.. అనంతపురంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధి రేటులో ఏపీ నెంబర్-2 అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయరు?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఏమైంది?. వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసును నిర్వీర్యం చేస్తున్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీసు క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి సుధాకర్‌కు లేదు.కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కాంట్రాక్టు పనుల ద్వారా వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయి. రాజకీయ యుద్ధం చేస్తానని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు ఇచ్చిన హామీలపై విప్ కాలువ శ్రీనివాస్ ఎందుకు మాట్లాడరు?. వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు అంటూ ప్రశ్నించారు. -
జనసేన జోగినేని మణి అరాచకం.. మహిళతో అనుచిత ప్రవర్తన
సాక్షి, వైఎస్సార్: ఏపీలో జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ఓ మహిళను కాళ్లతో తన్ని.. తనకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, సదరు బాధితురాలు.. మణి వల్ల తమకు ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు పెట్టిన జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున మణి.. అదే మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక, జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్‌గా జోగినేని మణి కొనసాగుతున్నాడు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వ అరాచకాలు, రెడ్‌బుక్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు సృష్టిస్తున్న విధ్వంసంపై ప్రజలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డి పల్లిలో హత్యకు గురైన కురబ లింగమమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంగా ప్రజల ఆదరణ చూస్తే కూటమిపై వారి వ్యతిరేకత ఏమిటి? ఎంతస్థాయిలో ఉన్నదీ స్పష్టమవుతుంది.వైఎస్ జగన్ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం పన్నిన అన్ని కుట్రలూ ఇక్కడ విఫలమయయ్యాయి. పోలీసులు సృష్టించిన అడ్డంకులన్నింటినీ తొలగించుకుని మరీ జనసందోహం ఒక సునామీలా జగన్‌కు తన మద్దతు తెలిపింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలతో జగన్ పర్యటన విజయవంతమైంది. ప్రజాగ్రహంపై ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ అయ్యింది!.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు ఇప్పటివరకూ నెరవేర్చకపోవడం.. వీటి గురించి ప్రశ్నించిన వారిని రెడ్‌బుక్ పేరుతో అణచివేతకు గురి చేస్తూండటం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం. రాష్ట్రస్థాయి నాయకులు ఒక చిన్న గ్రామానికి వెళితే ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల వారు వెళ్లడం పరిపాటి. కానీ, జగన్ పాపిరెడ్డి పల్లి పర్యటనలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉండటం గమనార్హం. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కూటమి చేతిలో మోసపోయిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం తీవ్రత ఏమిటో తేటతెల్లమవుతుంది. జగన్ కార్యక్రమానికి తరలివస్తున్న ప్రజల దృశ్యాలు చూస్తుంటే తెలుగుదేశం వారి గుండెలలో రైళ్లు పరుగెత్తి ఉండాలి. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వందల మంది పొలాలకు అడ్డం పడి మరీ పరుగులు తీసుకుంటూ రావడం కనిపిస్తుంది. ప్రత్యేకంగా సభ ఏమీ లేకపోయినా, ఈ స్థాయిలో జగన్ అభిమానులు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు, లోకేశ్‌ల ప్రభుత్వ అరాచకపు పాలనపై నిరసనను చెప్పడానికే అన్నది స్పష్టం.వైఎస్ జగన్ మాజీ సీఎం అయినప్పటికీ ఆయనకు తూతూ మంత్రంగా కల్పించిన భద్రత కూడా ఈ పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీరుపై పలు విమర్శలకు కారణమైంది. జగన్ వచ్చిన హెలికాఫ్టర్ వద్దకు జనం చొచ్చుకుపోయారంటే పోలీసుల సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంత ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా మొదటి పేజీలో ప్రచురించడాన్ని బట్టి ఏపీలో ఉన్నది పోలీసు రాజ్యం అని, కింది స్థాయి పోలీసులపై అధికారులకు కంట్రోల్ లేదని స్పష్టమవుతుంది. ఇది ఆ ఎస్ఐ క్రమశిక్షణ రాహిత్యమైనప్పటికీ రెడ్‌బుక్ పాలనలో అలాంటివారికి ప్రోత్సాహం లభిస్తుండటం దురదృష్టకరం. ఆ ఎస్ఐ గత ఎన్నికలలో టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించి, లోకేశ్‌తో సహా పలువురు టీడీపీ నేతలను కలిశారని స్పష్టమైనప్పటికీ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోగా, టీడీపీ ఎమ్మెల్యే కోరినట్లు పోస్టింగ్ ఇస్తే, అతను ఆ పార్టీ ఏజెంట్‌గా కాకుండా, ప్రజల కోసం పనిచేసే పోలీసుగా ఎందుకు వ్యవహరిస్తారు? ఇలాంటి వారు టీడీపీకి అనుకూలంగా పనిచేయరన్న గ్యారెంటీ ఏముంటుంది?.పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. ఏపీలో బీహారును మించిన భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి బీహారులో ఇలా రెడ్ బుక్ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై హింసకు దిగడం లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ మాదిరి మారవద్దని బీహారులో అక్కడి రాజకీయ పార్టీలు చెప్పుకోవాలి. తప్పుడు కేసులు ఎలా పెట్టాలి? ప్రతిపక్ష నేతలను, పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని ఎలా వేధించాలి? సినీ నటులను సైతం వదలకుండా ఒకటికి ఇరవై కేసులు పెట్టి, వందల కిలోమీటర్ల దూరం ఎలా నిత్యం తిప్పాలి? ఎప్పుడో ఏదో జరిగిందని, ఏళ్ల తర్వాత మనోభావాలు గాయపడ్డాయంటూ చిత్రమైన కేసులు ఎలా పెట్టాలి? అన్న వాటిలో ఏపీ పోలీసులు ఆరితేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పిచ్చి పాలన ఏపీలో మాత్రమే ఉంటుందేమో!.వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా రెడ్‌బుక్ పాలన సాగుతోందని అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యలకు గురైన తీరు, వారి వివరాలు, తప్పుడు కేసులలో రోజుల తరబడి వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైళ్లలో నిర్భంధిస్తున్న విధానం, స్థానిక ఉప ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యకాండ, బలం లేకపోయినా పోలీసుల సాయంతో గెలవాలన్న దుర్నీతి, మొదలైన వాటిని సోదాహరణంగా వివరించారు. వాటిలో ఒక్కదానికైనా ప్రభుత్వపరంగా మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ, గత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాలను పక్కనబెట్టి, పోలీసులపై జగన్ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ టూర్‌ను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా ఒకటే ఏడుపుతో కధనాలు ఇచ్చిందని చెప్పాలి.పచ్చ చొక్కాలతో పనిచేసే పోలీసుల బట్టలూడదీస్తామని, అధికారంలోకి వచ్చాక చట్టం ముందు నిలబెడతామన్నది జగన్ భావన అయితే ఏదో రకంగా పోలీసులలో తప్పుడు అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వార్తలు ఇచ్చాయి. తమ ఏడుపుగొట్టు వార్తల ద్వారా జగన్ టూర్‌కు జనం అశేష సంఖ్యలో వచ్చారని ఎల్లో మీడియా పరోక్షంగా అయినా ఒప్పుకోక తప్పలేదు. గతంలో చంద్రబాబు, లోకేశ్‌లు, అచ్చెన్నాయుడు తదితరులు విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు, దూషణలు చేసింది అందరికీ తెలుసు. లోకేశ్ అయితే రెడ్ బుక్ పేరుతో జిల్లా ఎస్పీలనే బెదిరిస్తూ చేసిన ప్రకటన సంగతేమిటి?.పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలోనే పోలీసుల వ్యాన్ పైనే రాళ్లదాడి చేసినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నుపోతే కనీసం సానుభూతి అయినా చూపిందా?. అచ్చెన్నాయుడు కుప్పంలో పోలీసులను బూతులతోనే దూషించారే. ఈ ఎల్లోమీడియా అసలు ఆ ఘటనలపై వార్తలనైనా ఇచ్చిందా?. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అన్నట్లు అధికార టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తుంటే, వారికి ఎల్లో మీడియా భజన చేస్తోంది. ఏది ఏమైనా జగన్ టూర్ ద్వారా ఒక విషయం బోధపడుతుంది. రెడ్ బుక్ అన్న దానిని ఒక పిచ్చికుక్క మాదిరి ఎంత ఎక్కువగా ప్రయోగిస్తే ప్రజలలో అంత నిరసన వస్తుందని, అంత స్థాయిలో తిరుగుబాటు వస్తుందని తేలింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు
తిరుపతి, సాక్షి: ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(APFDC) మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా.. టీటీడీ చైర్మన్‌పై సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ కేసులు నమోదు చేసి వేధించాలని చూస్తోంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎంపికను పోసాని ఖండించారని, ఆయన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు ఇంతకు ముందే నమోదు అయ్యాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15వ తేదీన విచారణకు రావాలంటూ పోసానికి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు ఎవరు చేశారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు చేశారని.. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదు మేరకు ఇంతకు ముందు ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన హైదారాబాద్‌లో రాయచోటి(అన్నమయ్య జిల్లా) పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఓబులవారీపల్లి పీఎస్‌కు తరలించారు. మార్చి 22వ తేదీన గుంటూరు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మొత్తంగా ఆయనపై అప్పటికే ఏపీలో వ్యాప్తంగా 19 కేసులు నమోదుకాగా.. కోర్టు ఆయనకు ఊరట ఇచ్చింది. -
‘అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే’
సాక్షి, తాడేపల్లి: రామగిరిలో ఎంపీపీ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతల నుంచే కాదు.. పోలీసుల నుంచి మా ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు.. టీడీపీకి కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘పోలీసుల అండతో టీడీపీ నేతలు స్థానిక ఎన్నికలను వాయిదా పడేలా చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారు. ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబు పెద్ద చీటర్. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీశ్రేణులు గ్రామాలకు గ్రామాలే వదిలి వెళ్లిపోయారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని అనిత మీడియా ముందు అవాకులు, చవాకులు పేలుతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘రామగిరిలో గత నెల 27న ఎంపీపీ ఎన్నిక జరగాలి. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9 వైఎస్సార్సీపీ, 1 టీడీపీ గెలిచింది. ఒక్క ఎంపీటీసీతో ఎలా ఎన్నికకు వెళ్థామనుకున్నారో అర్థం కాలేదు. ఎన్నిక నేపథ్యంలో ఇద్దరు ఎంపీటీసీలను టీడీపీ లాగేసుకుంది. మిగిలిన ఆరుగురుని గద్దల్లా తన్నుకుపోకుండా మేం కాపాడుకున్నాం. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు భద్రత కల్పించమని కోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్య యుతంగా గెలిచిన మా ఎంపీటీసీలను పోలీసులు, అధికారుల నుంచి కాపాడుకోవాల్సి వచ్చింది..30వ తేదీన లింగమయ్యను అతిదారుణంగా హతమార్చారు. ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. అన్ని ప్రలోభాలకు గురిచేసినా అత్తిలిలోనూ మా బలం 13 మంది. ఎన్నికకు వెళ్లకుండా మా నాయకులు కారుమూరి నాగేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు ట్రాక్టర్లతో ముట్టడించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే టీడీపీ నేతలే క్రిమినల్స్. ఇచ్చిన హామీలను అమలు చేయలేని పెద్ద చీటర్ చంద్రబాబు. 2024 ఎన్నికల తర్వాత పల్నాడులో గ్రామాలను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది..హోంమంత్రి అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే. అనిత ఎస్ఐను కూడా ట్రాన్స్ఫర్ చేయించలేరు. మా నేతలను బెదిరించి.. భయపెట్టేవారికి పోస్టింగ్‌లు ఉంటాయి. నేనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. ఎందుకు కేసులు నమోదు చేయరని అడిగితే నాపైనే కేసు పెట్టారు. నేను కోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు నా ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తున్నారు. కచ్చితంగా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గానికి కొమ్ముకాస్తున్న వారిని కచ్చితంగా బట్టలిప్పి నుంచోబెడతాం..పోలీసులు సంఘవిద్రోహ శక్తులు అన్నది చంద్రబాబు కాదా. 1100 మంది పోలీసులను పెట్టామని హోంమంత్రి చెబుతున్నారు. ఏం చేయడానికి వచ్చారు అంతమంది అని ప్రశ్నిస్తున్నా. పలు మార్లు కోర్టులు అక్షింతలు వేసినందుకు డిఫ్యాక్ట్ హోం మంత్రి నారా లోకేష్ సిగ్గుపడాలి. చంద్రబాబు, లోకేష్‌కు జనం ఎగబడరు. కానీ జగన్ రోడ్డు మీదకు వస్తే వేలాది మంది వస్తారు. వేలాది మంది హెలీకాప్టర్ వద్దకు వస్తే పోలీసులు ఏం భద్రత కల్పించారు?..జగన్ ఇప్పటికి.. ఎప్పటికీ పులివెందుల ఎమ్మెల్యే. ఒక మాజీ సీఎం కుమారుడు.. మాజీ సీఎంగా చేసిన వ్యక్తి జగన్. అసాధారణమైన ప్రజాదరణ కలిగి గొప్ప నాయకుడు జగన్. అమ్మా హోంమంత్రి.. జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ నువ్వు, లోకేష్ ఇచ్చింది కాదు. ఆయనకు హక్కుగా వచ్చింది జడ్ ప్లస్ సెక్యూరిటీ. భద్రత ఇవ్వడం మీకు చేతకాకపోతే...ఇవ్వలేమని చెప్పండి. గుంటూరు మిర్చియాడ్కు వెళ్తుంటే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సెక్యూరిటీని తొలగించారు. సెక్యూరిటీ ఇవ్వకుండా జగన్‌కు ఏమైనా జరిగితే ఆనందపడాలని మీ ఆలోచన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..ఎన్నాళ్లు మీ అరాచకాలను సహించాలి. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?. ఐపీఎస్ అధికారులు స్ట్రిక్ట్‌గా ఉండకపోతే శాంతి భద్రతలు లోపిస్తాయి. వైఎస్ జగన్‌కి సెక్యూరిటీ కోసం మేం సైన్యాన్ని తయారు చేసుకోవాలా?. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగానే భద్రత కల్పించడం లేదనే అనుమానాలున్నాయి. దయచేసి అక్రమాలు, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఎవరైతే చట్టప్రకారం వ్యవహరించరో.. టీడీపీకి కొమ్ముకాస్తారో... వారిని చట్టం ముందు యూనిఫాం విప్పి నిలబెడతాం. ఎంపీపీ ఎన్నిక కోసం నిండుప్రాణాన్ని తీసేస్తారా?. చంద్రబాబు, లోకేష్ మాటలు విని కావాలనే కుట్ర చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి.పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాదిమంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.హెలికాప్టర్ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
లోకేష్‌ను కలిసిన న్యాయం జరగలేదు.. పెట్రోల్ బాటిల్‌తో టీడీపీ కార్యకర్త నిరసన
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలనలో తనకు న్యాయం జరగలేదంటూ పెట్రోల్ బాటిలతో కలెక్టర్ కార్యాలయం ముందు ఓ టీడీపీ కార్యకర్త నిరసనకు దిగాడు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని.. న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ టీడీపీ కార్యకర్త బుద్ధా శ్రీను హెచ్చరించాడు.అధికార పార్టీకి చెందిన తనకే న్యాయం జరగలేదని.. ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేష్‌ను కలిసిన న్యాయం జరగలేదన్నారు. రికార్డులు తారుమారు వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బుద్ధా శ్రీను.. న్యాయం జరగకపోతే కుటుంబంతో ఆత్మహత్యే గతి అంటూ వాపోయాడు. -
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట లభించింది. తాము చెప్పేవరకు కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్య సినిమాలో క్లిప్పింగ్‌లు షేర్ చేశాడని సోషల్ మీడియా కార్యకర్త పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పవన్‌ను పులివెందుల పోలీసులు విచారించారుపవన్తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితపైనా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పైనా కేసు నమోదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా క్లిప్పింగ్ షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
‘కిరణ్ రాయల్‌పై చర్యలేవి’
సాక్షి,విశాఖ: పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే హోంమంత్రి అనిత ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తట్టడానికి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి సమయం ఉంటుంది. కానీ కామాంధులు చేతిలో బలైన బాధితులను పరామర్శించేందుకు సమయం ఉండదు.సొంతం నియోజకవర్గంలో మహిళపై దాడులు జరిగితే హోం మంత్రి అరికట్ట లేకపోయారు.పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే అనితకు ఉలికెందుకు. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. క్రిమినల్ అని ఎన్టీఆర్ ఎవరిని అన్నారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు.ఐఏఎస్ అధికారులను పేరు పెట్టి తిట్టిన ఘనత చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది. ఐపీఎస్ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర టీడీపీ నేతలది. దళిత ఐఏఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది.మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. ఎమ్మెల్యే ఆదిమూలం, కిరణ్ రాయల్ మహిళలను వేధిస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు’ అని కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. -
చంద్రబాబు తప్పుకుంటేనే మంచిదా వర్మ?
కాకినాడ, సాక్షి: అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయాయి. చేసిన త్యాగానికి ఒక పదవీ దక్కలేదు. రాజకీయంగా తన నియోజకవర్గంలోనే ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా మిత్రపక్ష పార్టీ.. ఆ పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నారాయన. ఈ వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను ప్రమోట్ చేసే బాధ్యతలను ఎత్తుకున్నారు. టీడీపీ అధినాయకత్వ మార్పుపై వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ‘‘నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వల్లే టీడీపీ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం. పార్టీ సారధిగా లోకేష్‌ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి. పార్టీకి 2047 ప్రణాళిక కావాలి’’ అని అన్నారాయన. అయితే వర్మ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబును తప్పుకోమని చెప్పడమేనన్న విశ్లేషణ నడుస్తోంది. కూటమి పార్టీలో టీడీపీ జనసేన అధినేతల మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ, లోకేష్‌తోనే పవన్‌కు గ్యాప్ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిందటి ఏడాది ఎన్నికల సమయంలో పొత్తు కుదరడం దగ్గరి నుంచి.. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలనే ప్రచారం దాకా నడిచిన పరిణామాలు ఎంత హాట్ హాట్‌గా సాగాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వల్ల కాకపోవడంతో పవన్ పార్టీ డామినేషన్‌కు చెక్ పెట్టేందుకే వర్మ లోకేష్ జపం మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అణచివేతలో.. ఇందిరమ్మకు తీసిపోని లోకేశ్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్ మాటల తీరు, చేష్టలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులు కూడా 1975 నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి రాజ్యమేలిన ఇందిరాగాంధీ అప్పట్లోనూ ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగానే అభివర్ణించారు. పోలీసుల అకృత్యాలకు తట్టుకోలేక ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు చాలా మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్ సారథి. ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారా? అనుకునేంత పవర్ ఫుల్. కేంద్ర మంత్రి ఒకరు సంజయ్ గాంధీ చెప్పులు మోశారన్న విమర్శలు వచ్చాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.మీడియాలో అయితే అంతా భజన వార్తలే ఇవ్వాలి. రామ్‌నాథ్ గోయాంకాకు చెందిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి పత్రికలే ప్రభుత్వం తప్పులపై విమర్శలతో వార్తలు ఇచ్చేవి. వాటిని కూడా సమాచార శాఖ అధికారులు సెన్సార్ చేసేవారు. దానికి నిరసనగా వార్తల బదులు ఖాళీగా ఉంచి పత్రికలను ముద్రించేవారు. దాదాపు రెండేళ్లపాటు దేశం అంతటా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంది. ఏపీలోనూ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతుందా? అన్న భయం కలుగుతోంది. టీడీపీలో చేరకపోతే వైఎస్సార్సీపీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏ జైలు చూసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికంగా కనిపిస్తున్నారట.ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అరాచకాలను తట్టుకోవడం కష్టంగా ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం వారిని నియంత్రించడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. మిగతా నేరాల అదుపు చేయడం సంగతి ఎలా ఉన్నా పోలీసులు బృందాలు, బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారట. ఇదంతా లోకేశ్ రెడ్ బుక్ ప్రభావమే. దానిని ఆయన కూడా నిర్ధారిస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు ఎక్కించి వేధిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి అంటుంటే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే ఏపీలో ప్రజలను రక్షించేదెవరన్న ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కన్నా లోకేశ్‌కే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీ వారంతా లోకేశ్ దృష్టిలో పడితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. లోకేశ్ జోక్యం చేసుకోని ప్రభుత్వ శాఖ ఉండడం లేదట. వేర్వేరు శాఖల మంత్రులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు లోకేశ్‌నే ప్రధాన అతిధిగా పిలుస్తూన్నారు.తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే, ఈయన మంత్రి అయ్యేవారా? ప్రస్తుతం యువరాజు మాదిరి ఇదంతా తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించ గలిగేవారా?. తన ఆదేశాల మేరకే రెడ్ బుక్ పనిచేస్తోందని, తానే దానికి బాధ్యుడనని మరింత ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ఎంత వీక్ అయింది అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పాలన ఇంత అధ్వాన్నంగా లేదు. లోకేశ్ అండ్ కో ఆదేశాల మేరకు రాజకీయంగా వ్యతిరేక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు శాఖ దుర్వినియోగం, ఒక కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటే మరికొన్ని కేసులు పెట్టి అరెస్టు చేయడం, రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పడం వంటివి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఏపీలో ఎవరినైనా ఎక్కువగా వేధించాలని అనుకుంటే వెంటనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తితో ఒక కేసు పెట్టిస్తున్నారు.నటుడు పోసాని కృష్ణ మురళి వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాదాపు నెల రోజుల పాటు వందల కిలోమీటర్ల దూరం ప్రతి రోజు తిప్పుతూ వేధించారంటే ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఒక ఎస్టీ వ్యక్తితో ఫిర్యాదు చేయించారట. మరో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అదే చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లోకేశ్ నేరుగా రెడ్ బుక్ అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఆయన వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి చెప్పినట్లు కనిపించినా, నిజానికి ఆయన బెదిరించింది ప్రజలనే. ఆయా చోట్ల ప్రాజెక్టులు వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. భూముల పరిహారం, కాలుష్యం తదితర సమస్యలు వస్తాయి. వాటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతారు. వారికి రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి. ఆ సమస్యలలో వాస్తవమైనవి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. అంతే తప్ప పోలీసులను పెట్టి కొట్టిస్తామని, వేధిస్తామని అన్నట్లుగా రెడ్ బుక్ తో భయపెడతామన్నట్లుగా స్వయానా ఒక మంత్రి మాట్లాడితే ఏమి చేయాలి? అలాంటివి ఎల్లకాలం సాగవన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే ప్రస్తుతం లోకేశ్ ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు గతంలో జగన్ ప్రభుత్వ కాలంలో మంజూరు అయినదే. రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా ఏపీకి వచ్చి జగన్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటూ ప్రసంగించారు. అయినా అవేవో తామే తెచ్చినట్లు లోకేశ్ బిల్డప్ ఇచ్చుకున్నారు. అలా చేసినంత వరకు ఆక్షేపించనవసరం లేదు. కానీ, ఆ సందర్భంలో కూడా జగన్ టైమ్ లో పరిశ్రమలు వెళ్లిపోయాయని అంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబును మించి అబద్దాలు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థం అవుతుంది. జగన్ టైమ్‌లో కర్నూలు వద్ద వచ్చిన గ్రీన్-కో ఎనర్జీ ప్లాంట్‌ను ఎద్దేవా చేసింది లోకేశ్ కాదా?. దానిని చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు ఎన్ని వ్యతిరేక కథనాలు రాసిందీ ఒక్కసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. ఈయన చెప్పినదాని ప్రకారం అయితే ఆ రెడ్ బుక్ ను ప్రయోగించవలసింది వారిపైనే కదా!.అదానీ, తదితరులు రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అదానికి రాష్ట్రాన్ని రాసిస్తున్నారని మరో టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిందే. తుని వద్ద జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్కుకు అనుమతి ఇవ్వవద్దని లేఖ రాసింది స్వయంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కాదా?. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం గురజాల ఎమ్మెల్యే బెదిరింపులతో రెండు సిమెంట్ పరిశ్రమలు మూతపడ్డాయట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే అవేం కంపెనీలు అంటూ మాట్లాడిన లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా దావోస్ వెళ్లి ఉత్తచేతులతో తిరిగి వచ్చారే. పైగా పెట్టుబడుల కోసం వెళ్లలేదని, ఏపీ బ్రాండ్ ప్రచారం కోసమని చెప్పుకున్నారే. ఆ తర్వాత ఆరున్నర లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు అయ్యాయంటూ, అవేమిటో చెప్పకుండానే ప్రచారం ఆరంభించారే. ఇప్పుడేమో కర్నూలు గ్రీన్ ఎనర్జీ కంపెనీని, కడప ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారే. కడపలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ను జగన్ తీసుకువస్తే దానిని అమరావతికి తరలించే యత్నం చేశారా? లేదా?.గతంలో జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వస్తే వాటికి అడ్డు పడడానికి తెలుగుదేశం కాని, ఎల్లో మీడియా కాని చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా పచ్చి అబద్దాలు ప్రచారం చేసిందీ వీరే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరికి బ్యాండ్ వాయించే వారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉంటే కొన్ని వందల కేసులు నమోదై ఉండేవి. ఉదాహరణకు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేశ్ ఎందరిని బెదిరించారో అందరికీ తెలుసు. జిల్లా ఎస్పీలను సైతం పేరుపెట్టి హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి మాదిరిగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఉంటే లోకేశ్‌పై ఎన్ని కేసులై ఉండేవి. ఇప్పటం వద్ద అనుమతి లేకుండా కారు పైన కూర్చుని పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. మరోసారి రోడ్డుపై అడ్డంగా పడుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన పవన్‌పై ఆ రోజుల్లో కేసులు పెట్టారా? లేదే!.మహిళలు మిస్ అయ్యారని తప్పుడు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి ఉండవచ్చు కదా?. అయినా అలా చేయలేదే. చంద్రబాబు, లోకేశ్‌లు అప్పటి సీఎం జగన్‌ను సైకో అంటూ, పలు అభ్యంతరకర పదాలు వాడారా? లేదా?. అయినా వారి మీద కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోలీసులు వైఎస్సార్సీపీ వారిపై, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారే!. ఏ రాజ్యాంగం వీటికి అనుమతి ఇస్తుంది?. ఈ విషయంలో ఏపీ హైకోర్టు సైతం పలుమార్లు పోలీసులను హెచ్చరించినా వీరి ధోరణి మారడం లేదు. సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతూ ఒక జూనియర్ లెక్చరర్ ప్రశ్నిస్తే ఆయన వద్ద నాటు సారా దొరికిందని కేసు పెట్టారట. ఇలా ఒకటి కాదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చూశాం.ఇవన్నీ రెడ్ బుక్ లో భాగమేనని లోకేశ్ గర్వంగా ఫీల్ అవుతుండవచ్చు. కానీ షాడో సీఎం స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలని ఆశపడుతున్న లోకేశ్ నిజంగానే ఆ పదవిలోకి వస్తే రాష్ట్రం ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అన్న భయం ప్రజలలో ఏర్పడదా?. నిత్యం అబద్దాలు చెప్పడం కాకుండా, కాస్త నిజాయితీగా మాట్లాడుతూ, హుందాగా వ్యవహరిస్తూ, రెడ్ బుక్ పిచ్చిగోలను వదలి వేయకపోతే రాజకీయంగా లోకేశ్‌కే నష్టం కలుగుతుంది. కక్ష పూరిత రాజకీయాలతోనే అధికారంలో కొనసాగాలనుకుంటే అది ఎల్లకాలం అయ్యే పని కాదని ఎమర్జెన్సీ అనుభవం తెలియచేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్ రెడ్డి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఏపీలో వైఎస్సార్సీపీ కేడర్ వినాశమే టార్గెట్‌గా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం అని హెచ్చరించారు.కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ భాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ భాషాను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్ భాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్ భాషాను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్ భాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దారుణం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని హెచ్చరించారు.