
నకిలీ విత్తు
మార్కెట్లోకి..
గుట్టుగా బీటీ–3 పత్తి విత్తన విక్రయాలు!
చాపకింద నీరులా..
బీటీ–3 పత్తి విత్తనాలు గుజరాత్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నో ప్రాంతాలతో పాటు ఏపీలోని నంద్యాల నుంచే కాకుండా, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ నుంచి ఈ సరుకు వస్తోంది. కాగా సాధారణ బీటీ–2 విత్తనాల పంపిణీకి అధికారుల నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ విత్తనాల విక్రయం అధికారికంగా ప్రారంభం కాగానే బీటీ– 3 విత్తనాన్ని సైతం చాపకింద నీరులా గుట్టుగా రైతులకు పంపిణీ చేయడానికి దళారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రత్యేకించి గజ్వేల్, వర్గల్, ములుగు, రాయపోల్, జగదేవ్‌పూర్, చేర్యాల, బెజ్జంకి తదితర ప్రాంతాల్లో రైతుల వద్ద బీటీ–3 విత్తనాల కోసం రైతుల నుంచి రూ.1500 నుంచి రూ.2వేలు అడ్వాన్స్‌లు వసూలు చేస్తున్నారు. అనుమతిలేని బీటీ–3 పత్తి విత్తనాల అమ్మకంపై వరుసగా కేసులు నమోదవుతున్నా.. తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
అనుమతిలేని బీటీ– 3 పత్తి విత్తనం అమ్మకాలకు ఈసారి కూడా రంగం సిద్ధమైంది. ఏటా కేసులు నమోదవుతున్నా తీరు మారడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సరుకు దిగుమతి చేసుకొని రైతులకు అంటగట్టడానికి దళారులు గ్రామాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకుంటున్నారు. తెగుళ్లను తట్టుకొంటుందని, కలుపు రాకుండా నివారిస్తుందని, అధిక దిగుబడులనిస్తుందని నమ్మబలుకుతున్నారు. దీంతో అమాయక రైతులు ఈ రకం విత్తనాలు వాడటానికి ఆసక్తి చూపుతుండటంతో దళారులకు వరంగా మారుతోంది.
గజ్వేల్: జిల్లాలో ఏటా వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తుంటాయి. ఇందులో వరి 3.50లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుండగా మరో 1.50లక్షల సాగుతో పత్తి రెండోస్థానాన్ని ఆక్రమిస్తోంది. కాలం కలిసోస్తే...తెల్ల‘బంగారం’గా చెప్పుకునే పత్తి పంటతో జిల్లా రైతులకు విడదీయరాని బంధం ఉంది. కానీ ఏటా ఈ పంట సాగులో నకిలీ విత్తన మకిలీ కలవరపరుస్తోంది. ఇతర పంటలతో పోలీస్తే...బెట్టకు తట్టుకుందని, కష్ట కాలంలో తమను ఆదుకుంటుందని రైతులు ఈ పంట సాగుపై ‘మమకారం’ ప్రదర్శిస్తు వస్తున్నారు. రైతుల అమాయకత్వమే వ్యాపారులకు పెట్టుబడిగా మారుతోంది. అక్రమాలకు అలవాటుపడిన వ్యాపారులు, దళారులు...ఇదే అదనుగా అనుమతిలేని ‘బీటీ–3’ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ విత్తనాలను వేస్తే ‘బీటీ–2’ కంటే తెగుళ్లను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా కలుపు ఉండదని.. దీని ద్వారా అధిక దిగుబడులు వస్తాయని నమ్మబలుకుతున్నారు. పంటల సాగులో కలుపు నివారణకు కూలీలు సకాలంలో దొరక్క ప్రతి ఏటా భారీఎత్తున నష్టాలు అంటూ వ్యాపారుల ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. బీటీ–2 విత్తన ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ. 901 కానీ.. బీటీ–3 అనుమతిలేని విత్తనాలను ఇందుకు రెట్టింపు, అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. గతేడాది జిల్లాలో 1.04లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకి వస్తే ఇందులో 20శాతానికిపైగా ‘బీటీ–3’వేసినట్లు అంచనా. క్యాన్సర్ కారకమే కాకుంగా నేలలకు అతి ప్రమాదకారిగా బీటీ–3 విత్తనాన్ని పరిగణిస్తారు. అయినా ఈ విత్త నం ఏటా విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు.
పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు
అమాయక రైతుల నుంచి అడ్వాన్సులు
అధిక దిగుబడుల పేరుతో మాయ
వరుసగా కేసులు నమోదవుతున్నా
మారని తీరు
గతంలో ఇలా...
గతేడాది హుస్నాబాద్ ప్రాంతంలో బీటీ–3 విత్తనాల పట్టివేత.
వర్గల్ మండలంలో గోప్యంగా అనుమతిలేని బీటీ విత్తన విక్రయాలు కొనసాగుతున్నాయనే సమాచారం మేరకు 2019 ఏప్రిల్ నెలలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మాదారం, అంబర్‌పేట, దండుపల్లికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
గజ్వేల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఏడేళ్ల క్రితం వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు భారీగా అనుమతిలేని బీటీ–3 విత్తనాలను పట్టుకొని అక్రమార్కులపై కేసు నమోదు చేశారు.
ములుగు మండలంలోని పలు గ్రామాల్లోనూ నాలుగేళ్ల కిత్రం కేసులు నమోదయ్యాయి.
నిషేధిత విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు
అనుమతి లేని బీటీ–3 విత్తనాల విక్రయిస్తే సహించేది లేదు. ఈ అక్రమ ‘దందా’ను అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను వేస్తున్నాం. మండలస్థాయిలో ఈ టీమ్ బీటీ పత్తి విత్తనాల విక్రయాలపై నిరంతరం నిఘా పెడుతోంది.
– రాధిక, జిల్లా వ్యవసాయాధికారి

నకిలీ విత్తు