
గోపవ్వ గోస
● సొంత ఇల్లు ఉందంటూ ‘ఇందిరమ్మ’లో పేరు తొలగింపు ● కూలిపోయిన గుడిసెలోనే వృద్ధురాలి నివాసం
మేము అర్హులం కాదా..
ఇందిరమ్మ ఇంటి కోసం
దివ్యాంగ దంపతుల వేడుకోలు
మద్దూరు(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇల్లుకు మేము అర్హులం కాదా అని దివ్యాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంగపల్లికి చెందిన బొడికే మల్లేశం, రేణుక దంపతులకు పుట్టుక నుంచే కాళ్లు లేవు. ఇద్దరూ దివ్యాంగులే. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్‌తోనే ఇంటి అద్దె చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు మంజూరైన లిస్టులో వీరి పేరు రాకపొవడంతో ఆందోళన చెందారు. కొన్నేళ్లుగా కిరాయి ఇంట్లోనే జీవనం సాగిస్తున్నామని వారు పోయారు.
నంగునూరు(సిద్దిపేట): భర్త మరణించడంతో కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది వృద్ధ మహిళ. వర్షాలకు గుడిసె కూలిపోవడంతో మిగిలిన భాగంలో కవర్లు కప్పి అందులోనే నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెకు సొంత బిల్డింగ్ ఉందని అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఆర్హుల జాబితా నుంచి తొలగించారు. ఈవిషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని వృద్ధురాలు వాపోతోంది. నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన కందారం గోపవ్వ భర్త సిద్ధయ్య వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. సంవత్సరం కిందట అనారోగ్యంతో మరణించడంతో అతని కుమారుడు శేషాద్రి జీవనోపాధి కోసం కరీంనగర్ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో గోపవ్వ కూలిపోయిన గుడిసెలోనే నివాసం ఉంటూ ప్రభుత్వం అందించే పింఛన్‌తో బతుకీడుస్తోంది.
కలెక్టర్‌కు ఫిర్యాదు
ఇల్లు మంజూరు కాకపోవడంతో నిరుత్సాహానికి గురైన గోపవ్వ ఐదు రోజుల కిందట కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. తాను నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆధారాలను జత చేసింది. అధికారులు స్పందించి నిరుపేదనైన తనకు ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటోంది.

గోపవ్వ గోస