
ఆధునికతను అందిపుచ్చుకోండి
● సేంద్రియం, పంట మార్పిడితోనేఅధిక దిగుబడులు ● మోతాదుకు మించి రసాయనమందులు వాడొద్దు ● ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్
న్యాల్‌కల్(జహీరాబాద్): ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటలు పండిస్తే ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చునని బసంత్‌పూర్ ప్రొఫెసర్, జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’కార్యక్రమంలో సోమవారం మండల పరిధిలోని మామిడ్గి గ్రామంలో పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ అధిక శాతం రైతులు ఇంకా పాత విధానంలోనే పంటలు పండిస్తూ సరైన దిగుబడులు రాక నష్టపోతున్నారని చెప్పారు. అధిక దిగుబడులు సాధించాలనే తపనతో రసాయన మందులు, పురుగు మందులు మోతాదుకు మించి వాడుతున్నారని, ఫలితంగా లాభాలకంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. పంట మార్పిడి తప్పకుండా చేయాలన్నారు. నీటిని వృథా చేయకుండా అవరానికి అనుగుణంగా వాడుకోవాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసుకొని వాటికి సంబంధించిన రశీదును తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల నకిలీ విత్తనాలు అని తేలితే పరిహారం పొందవచ్చునన్నారు. పంటల సాగు విధానాలపై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు అందు బాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల శాస్త్రవేత్త చరిత్ కుమార్‌తో పాటు అనీల్‌కుమార్, అవినాష్‌వర్మ, రమేష్ పాటిల్, రైతులు పాల్గొన్నారు.