ఇసుకాసురుల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

Published Fri, May 9 2025 8:19 AM | Last Updated on Fri, May 9 2025 8:19 AM

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ
● నామమాత్రంగా కేసులు

జహీరాబాద్‌ టౌన్‌: పైన ఫొటోలో ఉన్న ఇసుక లారీలు హద్నూర్‌ పోలీసు స్టేషన్‌ ముందు కనిపించాయి. న్యాల్‌కల్‌ మండలం గుండా కర్ణాటకలోకి అక్రమంగా తరలివెళ్తుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు. ఇలా ప్రతీరోజు యథేచ్ఛగా ఇసుక లారీలు ఆ రాష్ట్రానికి తరలివెళ్తున్నాయి. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సి అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడూ నామమాత్రంగా కేసులు నమోదుచేసి జరిమానాలతో సరిపెడుతున్నారు. అధికారుల, అక్రమార్కుల తీరుతో సహజ సంపదైన ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోవడంతోపాటుగా ప్రభుత్వ ఆదాయానికీ భారీగా గండిపడుతోంది. ఇక లారీల్లో అధికలోడు కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అడ్డూ అదుపులేకుండా...

ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సరిహద్దు రాష్ట్రాల వద్ద ఈ దందా జోరుగా సాగుతోంది. కర్ణాటకలో ఇసుకకు డిమాండ్‌ ఉండటంతో యథేచ్ఛగా సరిహద్దులు దాటుతోంది. న్యాల్‌కల్‌ మండలం సరిహద్దులో ఉన్న గ్రామాల పేరున వే బిల్‌ ఇతర అనుమతులు తీసుకుని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుకు సుమారు 12 కిలోమీటర్‌ దూరంలో ఉన్న బీదర్‌ పట్టణంలో తెలంగాణ ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం నుంచి ఇక్కడ అనుమతులు తీసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా ప్రతీరోజు వందల సంఖ్యలో ఇసుక లారీలు సరిహద్దులు దాటిపోతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయాని గండి పడుతుంది. ముంగి ఆదిలక్ష్మి మందిరం నుంచి రాంతీర్థం,గుంజెట్టి మీదుగా సరిహద్దు వరకు గల రోడ్డు లారీలు తిరగడంతో దెబ్బతిని అధ్వాన్నంగా తయారయ్యాయి.

పది లారీలు పట్టుకున్న పోలీసులు

ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కర్ణాటకలోని బీదర్‌ పట్టణానికి వెళ్తున్న పది ఇసుక లారీలను హద్నూర్‌ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. మరో ఘటనలో హుసెళ్లి వద్ద హద్నూర్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని లారీలను పట్టుకుని సీజ్‌ చేశారు.

ఇసుక లారీ సీజ్‌

మునిపల్లి(అందోల్‌): ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిసున్న లారీని బుదేరా పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం మండలంలోని కంకోల్‌ టోల్‌ ప్లాజా సమీపంలోని 65వ నంబర్‌ జాతీయ రహదారిపై వివిధ వాహనాలు తనిఖీ నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా సంగారెడ్డి నుంచి బీదర్‌కు లారీలో అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే లారీని బుదేరా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి లారీ యజమాని మహమ్మద్‌ ఇమ్రాన్‌, లారీ డ్రైవర్‌ సయ్యద్‌ మసియోద్ధిన్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

తనిఖీలు తప్పనిసరి...

ఇసుక లారీ డ్రైవర్లు తప్పనిసరిగా వే బిల్‌తోపాటు అన్ని అనుమతులకు సంబంధించిన పత్రాలను కలిగిఉండాలి. అనుమతి పత్రాలు లేని లారీలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తాం. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కర్ణాటకకు ఇసుక తరలిస్తున్న లారీలపై నిఘా పెట్టాం.

– రాంరెడ్డి, ఆర్డీఓ, జహీరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement