
ఉద్యమాలతోనే సంక్షేమ పథకాలు
తిప్పర్తి: కమ్యూనిస్టుల ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆదివారం తిప్పిర్తి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో సీపీఎం సీనియర్ నేత నన్నూరి అంజిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. అనంతరం వీరారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం నన్నూరి అంజిరెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన ఆశయాల సాధనకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, నాయకులు మన్నెం భిక్షం, భీమగాని గణేష్, ఆకిటి లింగయ్య, మంత్రాల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు.
మట్టపల్లిలో 10 నుంచి తిరుకల్యాణోత్సవాలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10 నుంచి 15వరకు జరగనున్న తిరుకల్యాణోత్సవాల వాల్‌పోస్టర్లను ఆదివారం ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసా చార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాలతోనే సంక్షేమ పథకాలు