మీ రైస్‌లో ఆర్సెనిక్‌ ఉందా!?  | Study links climate change with rising arsenic levels in rice | Sakshi
Sakshi News home page

మీ రైస్‌లో ఆర్సెనిక్‌ ఉందా!? 

Published Mon, Apr 21 2025 5:14 AM | Last Updated on Mon, Apr 21 2025 5:14 AM

Study links climate change with rising arsenic levels in rice

వాతావరణ మార్పులతో వరిలో పెరుగుతున్న ఆర్సెనిక్‌ పాళ్లు

పొంచి ఉన్న పలు దారుణ వ్యాధుల ముప్పు 

తాజా అధ్యయనంలో వెల్లడి 

వరి. విశ్వవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపునింపే అమృతం. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్ని చిరుతిళ్లు, ఇతర చల్లనిపానీయాలు తాగినా కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కల్గుతుంది. జీవకోటి ప్రాణాలు నిలుపుతున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్‌ మూలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చేదు నిజాన్ని బయటపెట్టింది. 

యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల దహనం, శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పుడీ వాతావరణ మార్పుల విపరిణామాలు వరి పంటలపై పడుతున్నాయని స్పష్టమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి, కార్భన్‌డయాక్సైడ్, కర్భన ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటి కారణంగా పొల్లాల్లో మట్టి, నీటి నుంచి ఆర్సెనిక్‌ మూలకం అత్యధికంగా వరిధాన్యంలోకి చేరుతోంది. 

విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్‌ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దు్రష్పభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్‌ స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ, ఊపిరితిత్తుల సంబంధ క్యాన్సర్లతో పాటు ఎన్నోరకాల తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయం. రక్తసరఫరా, రోగ నిరోధక వ్యవస్థలు, కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయం, చర్మం, ప్రోస్టేట్‌ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

 హృద్రోగ సమస్యతోపాటు మధుమేహ వ్యాధి ప్రబలే ప్రమాదముంది. గర్భిణుల్లో పిండం సరిగా ఎదగపోవడం, అకాల మరణాలు సంభవించే ముప్పు ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వాతావరణంలోని వెలువడుతున్న అధిక కర్భన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్తా విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్‌ ప్లానిటరీ హెల్త్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

అకర్బన ఆర్సెనిక్‌తో మరింత ప్రమాదం 
ఆర్సెనిక్‌ కర్భన, అకర్బన రూపాల్లో సహజంగానే నేల పొరల్లో ఉంటుంది. మానవునికి  అకర్బన ఆర్సెనిక్‌తో పోలిస్తే  అకర్బన ఆర్సెనిక్‌తో ముప్పు చాలా ఎక్కువ. వరిపంట మడుల్లో నీటితో నింపినప్పుడు మట్టిలోని ఆర్సెనిక్‌ వరినాట్ల ద్వారా వరిధాన్యంలోకి చేరుతుంది. అధ్యయనంలో భాగంగా పదేళ్లపాటు చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో సాగుచేస్తున్న 28 రకాల వరి వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

 వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, వాతావరణంలో కార్భన్‌డయాక్సైడ్‌ స్థాయిలు పెరిగినప్పుడు ఆర్సెనిక్‌ శోషణ స్థాయిలూ పెరుగుతున్నాయి. దీంతో వరి ధాన్యంలో ఆర్సెనిక్‌ స్థాయిలు ఎక్కువవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఒక్క చైనాలోనే వరి అన్నం తినడం వల్ల 1.93 కోట్ల క్యాన్సర్‌ కేసులు పెరుగుతాయని న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలోని వాతావరణ ఆరోగ్య శాస్త్ర సహాయ అధ్యాపకులు, ఈ పరిశోధనలో సహ రచయిత లెవీస్‌ జిస్కా చెప్పారు. ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే మరో పాతికేళ్లలో వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ ప్రతి 10 లక్షలకు 200 పాళ్లు ఎక్కువవుతుందని ఆయన పేర్కొన్నారు.  

మతలబు అంతా వరిమళ్లలోనే  
వేల సంవత్సరాల క్రితం వరిసాగు లేదు. అక్కడక్కడా పెరిగిన వరికంకుల నుంచే వరిధాన్యాన్ని సేకరించి వండుకుని తిన్నారు. ఆ వరిమొక్కల మొదళ్ల వద్ద ఎలాంటి నీరు నిల్వ ఉండేదికాదు. ఇప్పుడు నాగరిక సమాజంలో మడులు కట్టి నీటిని నిల్వచేసి వరిసాగు చేస్తున్నారు. వరి మొక్కల మొదళ్ల వద్ద పూర్తిగా నీరు ఉంటుంది. దీంతో మట్టిలో సహజ ఆక్సిజన్‌ ఉండదు. దీంతో మొక్క వేర్ల వద్ద అన్‌ఎరోబిక్‌ బ్యాక్టీరియా శక్తి సంగ్రహణ కోసం ప్రత్యామ్నాయంగా ఆర్సెనిక్‌ అణువులను లాగేస్తుంది. అలా గతంలో పోలిస్తే ఆర్సెనిక్‌ వరిధాన్యంలోని వచ్చి చేరుతోంది. కాలుష్యం, తదితర మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగా నేలలో కర్భన ఉద్గారాలు పెరిగి, ఉష్ణోగ్రత ఎక్కువై ఈ ఆర్సెనిక్‌ సంగ్రహణ రేటు పెరుగుతోంది.  

అరికట్టే మార్గాలున్నాయి 
వరిధాన్యంలోని ఆర్సెనిక్‌ వంట ద్వారా ఒంటిలోకి చేరకుండా అడ్డుకునే చిట్కాలున్నాయి. బ్రౌన్‌ రైస్‌తో పోలిస్తే తెల్ల బియ్యంలో పోషకాలు తక్కువ. అలాగే ఆర్సెన్‌ పాళ్లు కూడా తక్కువే. అందుకే బ్రౌన్‌రైస్‌ బదులు తెల్ల అన్నం తింటే కాస్త దీని ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇతర రకాలతో పోలిస్తే బాస్మతి రకం బియ్యంలోనూ ఆర్సెనిక్‌ తక్కువగా ఉంటుంది. ఆగ్నేయాసియా, అమెరికా, యూరప్‌ దేశాల్లోని రకాలతో పోలిస్తే తూర్పు ఆఫ్రికాలో దొరికే వరిలో ఆర్సెనిక్‌ తక్కువగా ఉంటోంది. ‘‘ అప్పటికే మరుగుతున్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడకబెట్టండి. ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ నీటినంతా పారబోయండి. తర్వాత మళ్లీ కొత్తగా నీళ్లు జతచేసి అన్నం వండండి. గంజి వార్చకండి’’ అని బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ‘‘ వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడగండి. తర్వాత ఒక పాలు బియ్యానికి, ఆరు పాళ్ల నీటిని జతచేసి వండండి’’ అని బ్రిటన్‌ ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ సూచించింది.

బ్రౌన్‌ రైస్‌ కంటే తెల్ల అన్నమే మంచిది ! 
‘‘బ్రౌన్‌ రైస్‌లో అకర్బన ఆర్సెనిక్‌ ఎక్కువగా ఉంటుంది. తెల్ల అన్నంలో ఇది తక్కువగా ఉంటుంది. విషపూరిత ఆర్సెనిక్‌ కోణంలో చూస్తే ఆహారంగా బ్రౌన్‌ రైస్‌ కంటే పాలిష్‌ చేసిన తెల్ల అన్నమే మంచిది’’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. తెల్ల అన్నంతో పోలిస్తే ముడి అన్నం, బ్రౌన్‌ రైస్‌ మంచివి అంటూ జనం కొత్తపోకడలో వెళుతున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు తెల్ల అన్నమే ఉత్తమమని చెప్పడం గమనార్హం. ‘‘ వరిధాన్యంలో ఆర్సెనిక్‌ స్థాయిని తేల్చేందుకు ప్రపంచంలో విస్తృతస్థాయిలో జరిగిన తొలి అధ్యయనం ఇది’’ అని బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్‌ యూనివర్సిటీ బయోలాజికల్‌ సైన్సెస్‌ విభాగ ప్రొఫెసర్‌ ఆండ్రూ మెహార్గ్‌ చెప్పారు.  

రంగు, రుచి, వాసన ఉండదు 
ఆర్సెనిక్‌ విషపూరితమైనదని ప్రాచీన మానవులకు కూడా తెలుసు. ఇది ఎలాంటి రంగు, రుచి, వాసన ఉండదు. ప్రాచీనకాలంలో రోమ్, యూరప్‌ దేశాల్లో శత్రువులను చంపేసేందుకు ఆర్సెనిక్‌ను ఇచ్చేవారని కథలు కథలుగా చెప్పేవారు. అయితే అత్యల్ప స్థాయిలో దీనిని తీసుకుంటే వెంటనే ఎలాంటి ప్రభావం చూపించదుగానీ స్లో పాయిజన్‌లా పనిచేసి దీర్ఘకాలంలో శరీరంపై తీవ్ర దు్రష్పభావాలను చూపిస్తుంది. అకర్బన ఆర్సెనిక్‌ అణువులు మానవశరీరంలోని జీవఅణువులతో అత్యంత సులభంగా బంధం ఏర్పర్చుకుంటాయి. కర్బన ఆర్సెనిక్‌ సహజంగా శిలలు, నేలల్లో ఉంటుంది. 

అకర్బన ఆర్సెనిక్‌ ఎక్కువగా గనుల తవ్వకం, బొగ్గును కాల్చడం ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి చేరుతుంది. ఇది నీటిలో కరుగుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లోకి పారి ఆ నీటితో పండించే పంటల ద్వారా మానవ శరీరాల్లోకి చేరుతోంది. దక్షిణ అమెరికా, దక్షిణ, మధ్యాసియా దేశాల్లోని భూగర్భ జలాల్లోనూ అకర్బన ఆర్సెనిక్‌ ఉంటోంది. అమెరికాలో దాదాపు 21 లక్షల మంది ప్రజలు ఇలా అకర్బన∙ఆర్సెనిక్‌ ఉన్న నీటినే తాగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులను దాటిన ఆర్సెనిక్‌ ఉన్న జలాలనే ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది జనం తాగుతున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement