Success Story: జస్ట్‌ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..! | Srivalli Sailaja from Malkajgiri was appointed as a judge at the age of 24 | Sakshi
Sakshi News home page

Success Story: జస్ట్‌ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!

Published Tue, May 6 2025 10:31 AM | Last Updated on Tue, May 6 2025 5:12 PM

Srivalli Sailaja from Malkajgiri was appointed as a judge at the age of 24

చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేయాలనే తపన, న్యాయవాది కావాలన్న తన తండ్రి ఆశయాన్ని గమనించారు.. లా పూర్తి చేసినా న్యాయవాదిగా స్థిరపడాలన్న తండ్రి లక్ష్యం నెరవేరలేదు.. అందుకే తండ్రి కలను పట్టుదలతో తాను సాధించారు.. న్యాయవాది కాదు.. ఏకంగా న్యాయమూర్తిగానే ఎంపికయ్యారు.. మొదటి ప్రయత్నంలోనే.. ఉన్నత స్థానాన్ని అధిరోహించారు.. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణం ఆమె మాటల్లోనే.. 

తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరికి చెందిన శ్రీవల్లి శైలజ 2024లో నిర్వహించిన జ్యుడీషియరీ పరీక్షలో జనరల్‌ కేటగిరిలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 24 ఏళ్ల వయసులో చదువు పూర్తయిన అనతి కాలంలోనే న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల ఇంటా బయటా ప్రశంసల జల్లు కురుస్తోంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన తాను చిన్ననాటి నుంచే సామాజిక సేవ చేయాలన్న తండ్రి ఆశయంతో పెరిగారు. 

న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయినా న్యాయమూర్తి కాలేకపోయారు. దీంతో తండ్రి ఆశయాన్నే తన ఆశయంగా చేసుకుని లక్ష్యం చేరుకున్నారు శ్రీవల్లి. ఇంటర్‌ అవగానే ఎంసెట్, లా ప్రవేశపరీక్షలు రెండూ రాశారు. రెంటిలోనూ మంచి ర్యాంకులు సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో జ్యుడీషియరీ మెయిన్స్‌ వైపు అడుగులువేశారు. 

ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి.. 
అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వాధికారులు. నాన్న రమేష్‌ నరసింహం హైదరాబాద్‌లో సీజీఎస్‌టీ సూపరింటెండెంట్‌. తల్లి లక్ష్మీసురేఖ దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌. 

ఓయూలో ఎల్‌ఎల్‌బీ, నల్సార్‌ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. అనంతరం జ్యుడీషియరీ మెయిన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్‌ సివిల్‌ జడ్జి వరకూ ఎదిగారు. శ్రీవల్లి సోదరి సహితం నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాలో ఐపీఎం (మూడో సంవత్సరం) చదువుతున్నారు. 

నాన్న కల నెరవేరింది.. 
జ్యుడీషియరీ మెయిన్స్‌ తరువాత ఏప్రిల్‌ నెల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఫలితాలు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి. చిన్న వయసులోనే జూనియర్‌ సివిల్‌ జడ్జి వంటి ఉన్నత ఉద్యోగం లభించడం సంతోషించదగ్గ విషయం. నాన్న కల నెరవేరింది. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. సామాజిక న్యాయం కోసం కృషి చేయగలనన్న నమ్మకం కలిగింది. జ్యుడీషియరీలో అత్యున్నత స్థానం వరకూ వెళ్లేందుకు సాధన చేస్తా.  
– శ్రీవల్లి శైలజ, జూనియర్‌ సివిల్‌ జడ్జి 

(చదవండి: 'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement