
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.
ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా
పరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు.