
సర్వీసుల ప్రారంభానికి సన్నాహాలు
ఎంట్రీ ఫీజు చెల్లించాక తుది లైసెన్సు
ఇప్పటికే ప్రాథమిక అనుమతులు జారీ
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్‌వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి.
శాట్‌కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్‌పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్‌వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది.
ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్..
ఇప్పటికే యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది.
సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది.