వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ శాఖతో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమీక్ష నిర్వహించారు.
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ శాఖతో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అశోకా రోడ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పటిష్టంగా ప్రచారాన్ని జరపాలని ఆయన ఢిల్లీ నేతలను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ తర్వాత నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరగాలని ఆయన ఆదేశించారు. నగరంలోని ప్రతి ప్రముఖ ప్రదేశంలో నరేంద్ర మోదీ పోస్టర్లు, హోర్డింగులను ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం వరకు ఈ హోర్డింగుల ఏర్పాటు జరిగిపోవాలన్నారు.
సుపరిపాలన, అభివృద్ధికి ఓటేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుతున్నట్లు ఉన్న హోర్డింగులు శనివారం ఉదయం నుంచి ఢిల్లీవాసులకు దర్శనమివ్వాలని షా ఆదేశించారు. హోర్డింగుల ఏర్పాటు బాధ్యతను షా ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు అప్పగించారు. ఢిల్లీ నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో సమర్థంగా పూర్తిచేయాలని షా ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలతో పోలిస్తే తమ పార్టీ వెనుకంజ వేస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కబడకుంటే నాయకత్వంలో మార్పులు చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన ఢిల్లీ నేతలను హెచ్చరించారు, ఎంపీలతో నిర్వహించిన ర్యాలీలకు జనం భారీ సంఖ్యలో హాజరుకాకపోవడంపై కూడా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.