
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. పాజిటివ్ కేసుల విషయంలో పాత రికార్డులు చెదిరిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,771 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే 442 మంది బాధితులు కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 6,48,315కు, మరణాలు 18,655కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 2,35,433 కాగా, 3,94,226 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 14,335 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 60.81 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌లో జూన్ 1 నుంచి జూలై 4వ తేదీ దాకా 4,57,780 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.
రోజంతా అంబులెన్స్‌లోనే..
ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ రోగి
ముంబై: కోవిడ్ సోకిన 64 ఏళ్ల వ్యక్తి వైద్యం అందక ప్రాణాలుకోల్పోయారు. ఈ ఘటన నవీముంబైలో జరిగింది. జూన్ 20న తన తండ్రి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడటంతో నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) కోవిడ్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అతని కొడుకు చెప్పారు. ఇక్కడ బెడ్లు ఖాళీలేవని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎన్‌ఎంఎంసీ సిబ్బంది చెప్పడంతో చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ చేర్పించుకోలేదన్నారు. దీంతో రోజంతా ఆక్సీజన్ ఉన్న అంబులెన్స్‌లో ఉంచాల్సి వచ్చిందన్నారు. చిట్టచివరకు ఓ ఆస్పత్రిలో చేర్పించినా ఆయన ప్రాణాలు దక్కలేదు.