Sakshi Lifestyle
-
రోజుకు 10 గ్రాములు చాలు!
సాక్షి, స్పెషల్ డెస్క్: అమ్మ చేతి గోరు ముద్దను నెయ్యి కమ్మదనం లేకుండా ఊహించలేం. నేతి రుచి తగలకపోతే భోజనమైనా, అల్పాహారమైనా, పిండి వంటలైనా సంతృప్తికరం, సంపూర్ణమూ కావంటే అతిశయోక్తి కాదు. వివిధ రకాల పచ్చళ్లు, పొడులకు కాస్త నెయ్యి జోడించి తింటే ఆ మజాయే వేరు. 3 వేల ఏళ్ల క్రితం నుంచే నెయ్యి వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. అయితే నెయ్యి వినియోగంపై భిన్నాభిప్రాయాలున్నాయి.మంచిదని కొందరంటుంటే, మితిమీరి వాడితే రక్తనాళాల్లో అవరోధాలేర్పడతాయని కొందరంటున్నారు. ఇంతకీ నిపుణులేమంటున్నారు? భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల వరకు నెయ్యి/వెన్న తీసుకోవచ్చని హైదరాబాద్‌లోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో లిపిడ్ కెమిస్ట్రీ డివిజన్ సైంటిస్ట్ (జి)గా ఉన్న డాక్టర్ అహ్మద్ ఇబ్రహీం (Dr. Ahmed Ibrahim) తెలిపారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..ఔషధ విలువలపై పరిశోధనలు జరగలేదు.. నెయ్యిలో ఎక్కువ వరకు కొవ్వు పదార్థాలే ఉంటాయి. విటమిన్ ఎ, ఇ, కె కూడా కొంతవరకు ఉంటాయి కానీ, అవి పరిగణనలోకి తీసుకోదగినంత ఎక్కువగా ఉండవు. అందుకని ఈ విటమిన్లను పొందటం కోసం నెయ్యిని వనరుగా చూడకూడదు. ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు ఉంటుంది.మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థం ఆవు నెయ్యిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది.. అంతే తేడా. నెయ్యిలో ఔషధ విలువల గురించి ఎన్ఐఎన్లో పరిశోధనలేమీ చెయ్యలేదు. అలాగే వేసవిలో ఎంత నెయ్యి తీసుకోవాలి? అనే విషయంపై కూడా పరిశోధనలేమీ జరగలేదు. అయితే నెయ్యిని నిర్దేశిత మోతాదుకు మించకుండా తీసుకోవాలి. నెయ్యిలో పోషకాలు (100 గ్రాములకు) ⇒ శక్తి – 870 కిలోకేలరీలు ⇒ పిండి పదార్థం– 0 గ్రా. ⇒ కొవ్వు – 99.5 గ్రా. ⇒ శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 61.9 గ్రా. ⇒ మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 28.7 గ్రా. ⇒ పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3.69 గ్రా. ⇒ మాంసకృత్తులు – 0.3 గ్రా. ⇒ కొలెస్ట్రాల్ – 256 మిల్లీ గ్రాములు ⇒ కాల్షియం – 4 మిల్లీ గ్రాములు వేర్వేరు వంట నూనెలు మంచిది ఒకరు సగటున రోజుకు సుమారు 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకోవాలి. అందులో 30% కేలరీల మేరకు కొవ్వు పదార్థాలు ఉండాలి. అందులో ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’సగం, ‘విజిబుల్ ఫ్యాట్’సగం ఉండాలి. మనం రోజూ తినే అనేక ఆహార పదార్థాల్లో అంతర్లీనంగా కలిసి ఉండే కొవ్వు పదార్థాలనే ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’అంటున్నాం. 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకునే వ్యక్తి రోజుకు సుమారు 30 గ్రాముల ‘విజిబుల్ ఫ్యాట్’అంటే.. వంట నూనెలు, నెయ్యి/వెన్న వంటివి తీసుకోవచ్చు.వీటిలో మూడింట ఒక వంతు మాత్రమే నెయ్యి/వెన్న ఉండాలి. వంట నూనెలు ఒకే రకం కాకుండా అనేక రకాలను తీసుకోవటం చాలా మంచిది. ఒక్కో నూనెలో ఒక్కో రకం ఫ్యాటీ యాసిడ్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే అనేక రకాల నూనెలను రోజుకు 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 10 గ్రాములకు మించకుండా నెయ్యి / వెన్న వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవచ్చు. అయితే, 30 గ్రాముల వరకు నూనెలు తీసుకునే వారు కూడా నెయ్యి తప్పకుండా తీసుకోవాలనేమీ లేదు. మొత్తం కలిపి కొవ్వు పదార్థాలు రోజుకు 30 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. దీన్ని ఎన్ఐఎన్ విడుదల చేసిన ‘భారతీయులకు ఆహార సంబంధ మార్గదర్శక సూత్రాలు’లోనూ పొందుపరిచాం.పిల్లలు ఇలా తీసుకోవాలి పిల్లలు వారి వయసు, బరువు ఆధారంగా ఎన్ని కేలరీలను రోజువారీ ఆహారం తీసుకోవాలో ఎన్ఐఎన్ నిర్దేశించింది.⇒10–12 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,200 కేలరీల ఆహారం తినాలి. వీరు 24 గ్రాముల నూనెలు, 12 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 10–12 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,000 కేలరీల ఆహారం తినాలి. 22 గ్రాముల నూనెలు, 11 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,800 కేలరీల ఆహారం తినాలి. వీరు 30 గ్రాముల నూనెలు, 15 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,400 కేలరీల ఆహారం తినాలి. 27 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 3,300 కేలరీల ఆహారం తినాలి. వీరు 37 గ్రాముల నూనెలు, 18 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,500 కేలరీల ఆహారం తినాలి. వీరు 28 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి వాడొచ్చు.వ్యాయామం చేసే వారికి నెయ్యితో మేలు! నెయ్యి మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. మెదడును శక్తిమంతం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుంది. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని సమస్థితిలో ఉంచుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నేతిలోని బుటిరేట్ జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. విష దోషాల్ని, పేగుల్లో పుళ్లు, వాపుల్ని, గడ్డల్ని నివారిస్తుంది. నెయ్యి తినే అలవాటున్న వారిలో పేగు కేన్సర్ తక్కువ. భారతీయ గోసంతతి విదేశీ గోసంతతి కన్నా భిన్నమైనది. మన ఆవుల వెన్నలో అపకారక ఎల్డీఎల్ కొవ్వు కన్నా ఉపకారక హెచ్‌డీఎల్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బాగా వ్యాయామం చేసే వారికి నెయ్యి మేలే చేస్తుంది. – డా. జీవీ పూర్ణచందు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు -
’గోల్డెన్ డేస్’ ఆగని రేస్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పుత్తడి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గోల్డెన్ డేస్’ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం రేటు 3,000 డాలర్లు దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఔన్స్ పసిడి ధర 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు.. అంటే కేవలం 7 నెలలు మాత్రమే పట్టడం. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. అంటే దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు. దీనినిబట్టి పుత్తడి పరుగు ఏ స్థాయిలో వేగం అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే తదుపరి రికార్డు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర 4,000 డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold Price) గురువారం రూ.91,650 పలికింది. ఈ నెల 19న రూ.91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. రికార్డులే రికార్డులు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాల ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్–టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా 500 డాలర్ల మార్కును తాకింది. ఆ తదుపరి 500 డాలర్లకు.. అంటే 1,000 డాలర్ల స్థాయిని 2008 మార్చిలో చేరుకుంది. 2011 ఏప్రిల్‌లో 1,500 డాలర్లకు, 2020 ఆగస్టులో 2,000 డాలర్లు, 2024 ఆగస్టులో 2,500 డాలర్ల మార్కును తాకింది. 500 నుంచి 1,000 డాలర్లను చేరుకోవడానికి 834 రోజులు పట్టింది. అక్కడి నుంచి 1,500 డాలర్లకు 1,132 రోజులు, 1,500 నుంచి 2,000 డాలర్లకు 3,394 రోజుల సమయం తీసుకుంది. 2,000 నుంచి 2,500 డాలర్లను అందుకోవడానికి 1,473 రోజులు పట్టింది. సురక్షితమైన ఆస్తిగా బంగారం పుత్తడి 3,000 డాలర్ల కంటే అధిక ధర వద్ధ స్థిరంగా ఉంటే అదనపు కొనుగోళ్లు ధరను మరింత ప్రేరేపించవచ్చని డబ్ల్యూజీసీ జోస్యం చెబుతోంది.కన్సాలిడేషన్‌కూ అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారని వివరించింది. గతంలో ప్రతి అదనపు 500 డాలర్ల మార్కును చేరుకున్న తరువాత సగటున తొమ్మిది రోజుల తరువాతే పుత్తడి ధర వెనక్కి వచ్చిందని, అయితే అయిదింటిలో నాలుగు సందర్భాల్లో కొన్ని రోజుల్లోనే బంగారం అదే స్థాయి కంటే పైకి పుంజుకుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన యూఎస్ డాలర్.. వెరసి పుత్తడిలో పెట్టుబడి డిమాండ్‌కు బలమైన ప్రోత్సాహకాలను అందిస్తూనే ఉందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ధర ఎగసినా డిమాండ్ తగ్గలేదు అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్‌కు ప్రతికూలతలను సృష్టించవచ్చని డబ్ల్యూజీసీ అంటోంది. ‘ఆభరణాల రీసైక్లింగ్ స్థాయిలను పెంచవచ్చు. పెట్టుబడిదారులలో కొంత లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ అంశాలు బంగారం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇచ్చే విస్తృత ఆర్థిక, ఆర్థిక చోదకాలను అధిగమించే అవకాశం లేదు’ అని వివరించింది. 2024లో పుత్తడి ధర 27 శాతం ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్‌లో 808.8 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగాయి. -
ప్యాలెస్‌లో ప్రయాణం రాజస్థాన్ విహారం
ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో వారం రోజుల ప్రయాణం. ఇది ప్రయాణం మాత్రమే కాదు... ఒక అనుభూతి. రాజస్థాన్ కోటలను చూడాలి... థార్ ఎడారిలో విహరించాలి. రాజపుత్రులు మెచ్చిన జానపద కళల ప్రదర్శనలను ఆస్వాదించాలి.ఇవన్నీ మామూలుగా కాదు... సకల మర్యాదలతో రాజసంగా ఉండాలి.పర్యటన ఆద్యంతం కాలు కింద పెట్టకుండా సౌకర్యంగా ఉండాలి. రాజస్థాన్ టూరిజం... సామాన్యులకు రాజలాంఛనాలను అందిస్తోంది. ఇందుకోసం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక రైలునే సిద్ధం చేసింది. ఇది టూర్ మాత్రమే కాదు... ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్.ఇంకెందుకాలస్యం... ట్రైన్ నంబర్ 123456... ప్లాట్ మీదకు వస్తోంది... లగేజ్‌తో సిద్ధంగా ఉండండి.రాజస్థాన్ పర్యాటకం రాజసంగా ఉంటుంది. సాధారణ ప్యాకేజ్‌లు క్లస్టర్లుగా కొన్ని ప్రదేశాలనే కవర్ చేస్తుంటాయి. పింక్‌సిటీ, బ్లూ సిటీ, గోల్డెన్ సిటీ, లేక్ సిటీలన్నింటినీ కవర్ చేయాలంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ సౌకర్యంగా ఉంటుంది. 7 రాత్రులు 8 రోజుల ప్యాకేజ్‌లో రైలు న్యూఢిల్లీ సఫ్దర్ గంజ్ స్టేషన్లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుంది. 8 రోజు ఉదయం ఏడున్నరకు అదే స్టేషన్లో దించుతుంది.ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్‌లో జయ్‌పూర్, సవాయ్ మాధోపూర్, చిత్తోర్ఘర్, ఉదయ్‌పూర్, జై సల్మీర్, జో«ద్‌పూర్, భరత్పూర్, ఆగ్రాలు కవర్ అవుతాయి. ఈ పర్యాటక రైలు 1982, జనవరి 26 నుంచి నడుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో టూరిజమ్ ప్రమోషన్ కోసం ఇండియన్ రైల్వేస్– రాజస్థాన్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టూర్ విదేశీయులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పర్యటిస్తున్నారు.తొలిరోజు: ఢిల్లీ టూ జయ్పూర్పర్యాటకులకు రాజపుత్రుల సంప్రదాయ రాచమర్యాదలందిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రైల్వే స్టేషన్‌కి చేరగానే రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతారు. పూలమాల వేసి, బొట్టు పెట్టి, గంధం రాస్తారు. షెహనాయ్ రాగం, కచ్చీఘోదీ నాట్యం, ఏనుగు అంబారీల మధ్య రిఫ్రెష్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింకులు, బార్) తో వెల్కమ్ చెబుతారు. పర్యాటకులు ఎవరికి కేటాయించిన గదిలోకి వాళ్లు వెళ్లిన తర్వాత ఆరున్నరకు రైలు ఢిల్లీ స్టేషన్ నుంచి పింక్‌సిటీ జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు రైల్లో విందు భోజనం ఇస్తారు.రెండవ రోజు: జయ్‌పూర్ టూ సవాయ్ మాధోపూర్అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ట్రైన్ జయ్‌పూర్‌కి చేరుతుంది. పర్యాటకులు నిద్రలేచి రిఫ్రెష్ అయిన తర్వాత ఏడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ఎనిమిది గంటలకు రైలు దిగి (లగేజ్ రైల్లోనే ఉంటుంది) సైట్ సీయింగ్ కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లోకి మారాలి. నగరంలో ఆల్బర్ట్ హాల్, హవామహల్, సిటీ ప్యాలెస్, జంతర్‌మంతర్ (ఖగోళ పరిశోధనాలయం)ని చూడడం. మధ్యాహ్నం లోహగర్ ఫోర్ట్‌లోని రిసార్ట్‌కు తీసుకెళ్తారు. లంచ్ అక్కడే. ఆ తర్వాత సూర్యాస్తమయంలోపు అమేర్ ఫోర్ట్ విజిట్, షాపింగ్ పూర్తి చేసుకుని ఆరు గంటలకు ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. ఏడు గంటల తర్వాత రాజస్థాన్ సంప్రదాయ వంటకాలతో డిన్నర్. ప్రయాణం సవాయ్ మాధోపూర్‌కు సాగుతుంది.మూడవ రోజు: మాధోపూర్ టూ చిత్తోర్ఘర్తెల్లవారు జామున ఐదు గంటల లోపు సవాయ్ మాధోపూర్ చేరుతుంది. రిఫ్రెష్ అయి ఆరు గంటలకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్క్, రణతంబోర్ ఫోర్ట్ విజిట్‌కి వెళ్లాలి. నేషనల్ పార్క్ పర్యటన పూర్తి చేసుకుని పదింటికి ట్రైన్ ఎక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రైలు చిత్తోర్ఘర్ వైపు సాగిపోతుంది. లంచ్ రైల్లోనే. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తోర్ఘర్ చేరుతుంది. రైలు దిగి సైట్ సీయింగ్‌కి వెళ్లాలి. ఆరు గంటలకు కోట లోపల టీ తాగి, లైట్ అండ్ సౌండ్ షో ను ఆస్వాదించి ఏడున్నరకు రైలెక్కాలి. ఎనిమిది గంటలకు రైల్లోనే డిన్నర్.నాలుగవ రోజు: చిత్తోర్ఘర్ టూ జై సల్మీర్ వయా ఉదయ్పూర్రెండు గంటలకు చిత్తోర్ఘర్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకు లేక్‌సిటీ ఉదయ్‌పూర్ చేరుతుంది. రైలు దిగి తొమ్మిదింటికి వాహనంలోకి మారి సైట్‌సీయింగ్, షాపింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒకటిన్నరకు బోట్ రైడ్, ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం. మూడు గంటలకు తిరిగి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగు గంటలకు జై సల్మీర్‌కు ప్రయాణం. రాత్రి భోజనం రైల్లోనే ఎనిమిది గంటలకు.ఐదవ రోజు: జై సల్మీర్ టూ జోద్పూర్రైలు ఉదయం తొమ్మిదిన్నరకు జై సల్మీర్కి చేరుతుంది. రైలు దిగి గడిసిసార్ సరస్సు. జై సల్మీర్ కోట, నగరంలోని హవేలీలు చూసుకుని షాపింగ్ చేసుకుని తిరిగి రైలెక్కాలి. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత నాలుగు గంటలకు రైలు దిగి ఎడారిలో విహారం, క్యామెల్ రైడ్ ఆస్వాదించాలి. రాజస్థాన్ సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాల వినోదం, రాత్రి భోజనం కూడా అక్కడే చేసుకుని రాత్రి పది గంటలకు రైలెక్కాలి. పన్నెండు గంటలలోపు రైలు జై సల్మీర్ నుంచి బ్లూ సిటీ జో«ద్‌పూర్‌కు బయలుదేరుతుంది.ఆరవ రోజు: జో«ద్‌పూర్ టూ భరత్పూర్రైలు ఉదయం ఏడు గంటలకు జో«ద్‌పూర్‌కు చేరుతుంది. ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎనిమిదిన్నరకు సైట్ సీయింగ్ కోసం రైలు దిగాలి. మెహరాన్‌ఘర్ ఫోర్ట్, జస్వంత్ థాడా, ఉమైద్ భవన్ ప్యాలెస్ మ్యూజియం చూసుకున్న తర్వాత షాపింగ్. ఒకటిన్నరకు బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌లో రాజలాంఛనాలతో విందు భోజనం చేసిన తర్వాత ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగన్నరకు రైలు జో«ద్‌పూర్ నుంచి భరత్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.ఏడవ రోజు: భరత్పూర్ టూ ఆగ్రారైలు ఉదయం ఆరు గంటలకు భరత్‌పూర్‌కి చేరుతుంది. వెంటనే సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. ఘనా బర్డ్ సాంక్చురీ విజిట్ తర్వాత ఎనిమిది గంటలకు మహల్ ఖాజ్ ప్యాలెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలెక్కాలి. పది గంటలకు రైలు ఆగ్రాకు బయలుదేరుతుంది. పదకొండు గంటలకు ఆగ్రా రెడ్ ఫోర్ట్ చూసుకుని ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ తర్వాత మూడు గంటలకు తాజ్‌మహల్ వీక్షణం. ఐదున్నర నుంచి షాపింగ్, ఏడున్నరకు రైలెక్కి డిన్నర్ తర్వాత ఎనిమిది ముప్పావుకి ఢిల్లీకి బయలుదేరాలి.ఎనిమిదవ రోజు: ఆగ్రా టూ ఢిల్లీఉదయానికి రైలు ఢిల్లీకి చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి, లగేజ్ సర్దుకుని ఏడున్నరకు దిగి ప్యాలెస్ ఆన్ వీల్స్‌కి వీడ్కోలు పలకాలి.తరగతుల వారీగా ట్రైన్ టికెట్ వివరాలు:⇒ ప్రెసిడెన్షియల్ సూట్లో క్యాబిన్‌కి... 2,67,509 రూపాయలు⇒ సూపర్ డీలక్స్‌లో క్యాబిన్‌కి... 2,18,207 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ సింగిల్ ఆక్యుపెన్సీ... 1,10,224 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి... 71,712 రూపాయలు⇒ ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితం. పన్నెండేళ్ల లోపు పిల్లలకు సగం చార్జ్.⇒ ఒక క్యాబిన్లో ఇద్దరికి అనుమతి. పిల్లలను పేరెంట్స్తోపాటు అదే క్యాబిన్లో అనుమతిస్తారు.ప్యాలెస్ ఆన్ వీల్స్ మరిన్ని వివరాల కోసం...Email : palaceonwheels.rtdc@rajasthan.gov.in Website: Palaceonwheels.rajasthan.gov.inపులి కనిపించిందా!ఈ టూర్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీతం, స్థానిక ఘూమర్, కల్బేలియా జానపద నృత్యాలను ఆస్వాదిస్తూ సాగే కామెల్ సఫారీ, డెజర్ట్ సఫారీలు, క్యాంప్‌ఫైర్ వెలుగులో ఇసుక తిన్నెల మీద రాత్రి భోజనాలను ఆస్వాదించవచ్చు. భరత్‌పూర్‌లోని కెలాడియా నేషనల్ పార్క్‌కి సైబీరియా నుంచి వచ్చిన కొంగలను చూడవచ్చు. ఈ పక్షులు ఏటా సైబీరియా నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నవంబర్‌లో ఇక్కడికి వలస వస్తాయి.మార్చి వరకు ఇక్కడ ఉండి ఏప్రిల్ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. ఈ కొంగలతోపాటు వందల రకాల పక్షులుంటాయి. రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లి జీప్ సఫారీ లేదా ఎలిఫెంట్ సఫారీ చేస్తూ పులి కనిపిస్తుందేమోనని రెప్పవేయకుండా కళ్లు విప్పార్చి బైనాక్యులర్‌లో చూసి చూసి... దూరంగా ఎక్కడో పులి అలికిడి కనిపించగానే భయంతో కూడిన థ్రిల్‌తో బిగుసుకు పోవచ్చు.ఏడు హెరిటేజ్ సైట్లను చూడవచ్చుప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాకేజ్‌లో యునెస్కో గుర్తించిన ఏడు వరల్డ్ హెరిటేజ్ సైట్లు కవర్ అవుతాయి. అవేంటంటే... జయ్‌పూర్‌లోని జంతర్ మంతర్, రణతంబోర్లో రణతంబోర్ కోట, చిత్తోర్‌ఘర్‌లో చిత్తోర్ఘర్ కోట, జై సల్మీర్‌లో జై సల్మీర్ కోటతోపాటు థార్ ఎడారి, భరత్పూర్ కెలాడియో నేషనల్ పార్క్, ఆగ్రాలో తాజ్ మహల్. ఇవన్నీ యునెస్కో గుర్తింపు పొందిన హెరిటేజ్ సైట్లు. ఈ గౌరవంతోపాటు తాజ్‌మహల్‌కి ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో కూడా స్థానం ఉంది.