పామును చూస్తేనే చాలూ అమ్మో అంటూ అల్లంత దూరం పరిగెత్తే వాళ్లని చాలామందిని చూసే ఉంటాం. అంతేకాదు మనం కూడా అలాంటి అనుభవం ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటాం. అయితే ఫ్లోరిడాకు చెందిన రోసా ఫాండ్ అనే మహిళ మాత్రం ఇలాంటి భయాలకు నేను మినహాయింపు అంటున్నారు. బాధతో విలవిల్లాడుతున్న పామును రక్షించి నెటిజన్ల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..గురువారం సాయంత్రం రోసా బ్రూక్స్‌విల్లే మార్గం గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో బీర్ కాన్‌లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పామును చూశారు. అంతే ఇక ఆలస్యం చేయకుండా టిన్ మూతను తీసి.. దానికి విముక్తి కలిగించారు.
కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన రోసా.. ‘నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. తన(పాము)ని రెండుసార్లు నా చేతులతో పట్టుకున్నాను’ అని క్యాప్షన్ జతచేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు స్పందించిన నెటిజన్లు.. ‘ అమ్మో.. మీకు చాలా ధైర్యం ఉందండీ. అది విషం లేని బ్లాక్ రేసరే అయినప్పటికీ మీ కేరింగ్ అమోఘం. ప్రపంచంలోని కేరింగ్ లేడీస్‌లో మీరూ ఒకరు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి రోసా మాట్లాడుతూ... ‘ ఆమె(పాము) బతికే ఉంది. నాకు మొదట భయం వేసింది. కానీ తనని రక్షించాలని నిశ్చయించుకున్నా. నా స్థానంలో వేరే వాళ్లుంటే భయంతో చంపేసేవారేమో. కానీ నేను ఆమెకు చిన్న గాయం కూడా కానివ్వలేదు’ అని పేర్కొన్నారు.