వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొత్తులు అవసరం లేదని, సింహం సింగిల్‌గానే వస్తుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ షర్మిల ప్రసగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రుణమాఫీ హామీతో రైతులు, డ్వాక్రా మహిళలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసం చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చి, ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబానికి జబ్బు చేస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా అని సూటిగా ప్రశ్నించారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచారని, రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా చంద్రబాబు ప్రభుత్వం కట్టలేదని చెప్పారు.