రాష్ట్రంలో జరుగనున్న ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కాం గ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, అలాంటి జాబితాతో ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని పేర్కొంటోంది. ఓటర్ల జాబితాలోని తప్పులన్నీ సవరించి, కొత్త ఓటర్లందరినీ చేర్పించిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ 19 లేదా 20న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మాజీ మంత్రి, టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో పాటు హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌తో కలసి దీనిపై కసరత్తు చేస్తున్నారు.