వెల్‌నెస్ కోర్సుల పేరుతో ఆస్తులు కూడగడుతున్న కల్కి ఆశ్రమం, కార్యాలయాల్లో మూడు రోజులుగా సాగుతున్న ఇన్‌కం టాక్స్ తనిఖీల్లో రూ.500 కోట్లకు పైగా వెల్లడించని ఆస్తులు వెలుగు చూశాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ‘ఏకత్వం’ అనే తత్వంతో కల్గి భగవాన్ స్థాపించిన ట్రస్టు వెల్‌నెస్ కోర్సుల పేరిట తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాల పేరుతో ఏపీలోని వరదయ్యపాలెం, చెన్నై, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా ఆశ్రమం ఎవరిదనే అంశాన్ని ఆర్థిక శాఖ ప్రస్తావించలేదు. ఆ ప్రకటనలోని వివరాలివీ. ‘ఆధ్యాత్మిక గురువు స్థాపించిన ఈ గ్రూపు క్రమంగా దేశ, విదేశాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణం, క్రీడలు వంటి అనేక రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఈ గ్రూపును ఆధ్యాత్మిక గురువు, అతడి కుమారుడు నిర్వహిస్తున్నారు.