నేతా.. ఇదేం రోత..? | MLA birthday party next to childrens hospital | Sakshi
Sakshi News home page

నేతా.. ఇదేం రోత..?

Jul 2 2026 10:30 PM | Updated on Jul 2 2026 10:30 PM

- చిన్నపిల్లల ఆస్పత్రి పక్కన ఎమ్మెల్యే బర్త్‌ డే పార్టీ
- శబ్దాలతో ఇబ్బంది పడిన రోగులు 

సాక్షి టాస్క్‌ఫోర్క్‌: ఆయన ఓ ఎమ్మెల్యే. ఎక్కడైనా తప్పు జరిగితే సరిదిద్దాల్సిన వ్యక్తి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరిష్కరించాల్సిన నాయకుడు. అలాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యేనే చిన్న పిల్లల ఆస్పత్రి పక్కన రాత్రిపూట బర్త్‌ డే పార్టీ అంటూ నానా హంగామా చేశారు. ఆ‍స్పత్రిలో ఉన్న వారు కంగారు పడిపోయేంత శబ్దాలు చేస్తూ దగ్గరుండి నృత్యాలు నిర్వహించారు. పాతపట్నంలో జరిగిన ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుట్టిన రోజు వేడుకలు పట్టణం మధ్యలో ఉన్న ఎరుకోల కాంప్లెక్స్‌లో జరిగాయి. చిన్నపిల్లల ఆస్పత్రి, పాఠశాలలు వంటివి ఉన్న ప్రదేశంలో రాత్రి సమయం అని కూడా చూడకుండా పెద్ద సౌండ్‌ సిస్టంతో బర్త్‌డే పార్టీ చేయడంతో రోగులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్‌ పేరుతో సున్నితమైన ప్రాంతాల్లో డాన్స్‌లు పెట్టడం సబబు కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

ఇబ్బంది పెట్టడం దారుణం 
ప్రశాంత వాతవరణంలో ఉండే పాతపట్నంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో ఈవెంట్‌ల పేరుతో నృత్యాలు చేయడం దారుణం. ఈవెంట్‌ పక్కనే చిన్నపిల్లల ఆస్పత్రి ఉన్నప్పటికి ఈవెంట్‌లకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడం విడ్డురుంగా ఉంది. ఎమ్మెల్యే దగ్గర ఉండి నృత్యాలు చేయించడం దారుణం. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు.
- రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పాతపట్నం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement