ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయిన ఆయన సొల్లు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇంకా దమ్ముంటే 175 స్థానాల్లో పోటీకి రావాలన్నారు. అప్పుడు తాము రెఫరెండంగా స్వీకరిస్తామని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు పోటుగాడు కాదు...అనుభవజ్ఞుడు కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు ఎంపీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయాడు. 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే...21చోట్ల చంద్రబాబు డిపాజిట్ కోల్పోయారు. పది స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో 250మందికి పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తే 39మంది పంపారు...అవి కూడా చెల్లలేదు. అంటే ఉద్యోగులు వాళ్ల నిరసనను ఈ విధంగా తెలిపారు.