● టీడీపీ శ్రేణులు పెట్రేగిపోతున్నారు: మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

● టీడీపీ శ్రేణులు పెట్రేగిపోతున్నారు: మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డి

May 4 2026 7:13 AM | Updated on May 4 2026 7:13 AM

● టీడీపీ శ్రేణులు పెట్రేగిపోతున్నారు: మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డి

సాక్షి అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అనుచరులు చెలరేగిపోతున్నారు. అధికారం ఉండగా... మంత్రి అండగా... వైఎస్సార్‌సీపీలోని కీలక నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. ఇదేమని అడిగే పోలీసులు లేకపోగా.. ఇది తప్పు అని చెప్పే వారు లేకపోవడంతో వారు అనుకున్న ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఒకప్పుడు అన్నమయ్య జిల్లా కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతంగా ఉండేది. కానీ కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత వరుసగా ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న దాడులతో అలజడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దాడులు ఎక్కువగా జరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ఆదివారం మధ్యాహ్నం ఒక స్థల వివాదంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డితోపాటు మరికొంత మందిపై పచ్చ మూకలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఒక రకంగా భయోత్పాతం సృష్టించి అలజడులు రేకెత్తించడం చూస్తే అధికార పార్టీ నేతలు అమలు చేసిన ప్రణాళికలో భాగంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

కూటమి సర్కార్‌లో వరుస దాడులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉండేది. ఎక్కడికక్కడ శాంతి భద్రతల పరంగా గొడవలకు ఆస్కారం లేకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వారానికో, పది రోజులకో అలజడులు జరుగుతూనే ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల పర్వం ముగియగానే రాయచోటి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, బీసీ నాయకుడు వెంకటేష్‌పై.. తర్వాత కూటమి సర్కార్‌ అధికారంలోకి రాగానే తొలిగా రాయచోటి మండల ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై దాడి, తర్వాత రాయచోటిలో కౌన్సిలర్ల ఇళ్ల వద్ద దాడులకు పూనుకోవడం, లక్కిరెడ్డిపల్లెలో ఎంపీపీ రెడ్డయ్య ఇంటిపై దాడులు చేయడం, రాయచోటికి చెందిన వైఎస్సార్‌సీపీ బీసీ నాయకుడు సిబ్యాల విజయభాస్కర్‌పై దాడి, రామాపురం మండలంలో కూడా పలు చోట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఇళ్లను కూల్చివేసిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల రాయచోటి పరిధిలోని ఒక అంగన్‌వాడీ భవనం వద్ద జరిగిన గొడవలో కూడా మంత్రి అనుచరులు భయానక వాతావరణం సృష్టించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో గుర్రంకొండ పోలీస్‌స్టేషన్‌పైకే టీడీపీ నేతలు దాడులకు వెళ్లడం అప్పట్లో ఎస్పీ సీరియస్‌గా తీసుకుని కేసులు నమోదు చేశారు. పీలేరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఇంటిపై దాడులకు పురిగొల్పారు. అంతేకాకుండా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ఇలా చెబుతూ పోతే అన్ని చోట్ల అధికారం అండ చూసుకుని దాడులకు తెగబడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా..

జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా పచ్చ ముఠా దాడులకు ప్రణాళిక రచిస్తోంది. ఆదివారం పచ్చ మూకల దాడిలో తీవ్ర స్థాయిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డి రెండు రోజుల కిందట పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే మరుసటి రోజు సంఘటన ప్రాంతంలో ఆయనపై దాడి జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితయ్యారని.. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని రాజంపేట పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రధానంగా రాయచోటి ప్రాంతంలో మంత్రి అండ చూసుకుని అనచరులు టార్గెట్‌ చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాయచోటిలో అలజడి

అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఆదివారం అలజడి చెలరేగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన పచ్చ మూకలు దశరథరామిరెడ్డితోపాటు మిగతా వారిపై మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడులు చేశారు. పచ్చ ముఠాను ఆపేవారు లేరు. పదుల సంఖ్యలో వచ్చిన వారు రావడం రావ డంతోనే దాడులకు తెగబడటం.. వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు గాయపడటంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్‌ను కూడా అడ్డుకోవడంపై తీవ్ర చర్చసాగుతోంది.

వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గాసాగుతున్న దాడులు

మంత్రి మండిపల్లి అనుచరుల దాడులతో రాయచోటిలో భయం భయం

తాజాగా మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం

నేతలను భయపెట్టిభయాందోళనలతో అలజడులు

ప్రేక్షక పాత్రకేపరిమితమవుతున్న పోలీసులు

రాయచోటి: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో.. ఎక్కువగా రాయచోటిలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత దశరథ రామిరెడ్డి, అతని అనుచరులపై ఆదివారం జరిగిన దాడులపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గూండాలు పెట్రేగి పోతున్నారన్నారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను, స్టేటస్‌ కోలను అధికార పార్టీ నాయకులు తమకున్న అధికార బలంలతో లెక్కచేయకుండా దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక, దౌర్జన్యకర పాలనతో అస్థిరత నెలకొందన్నారు. రాయచోటి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు భూ ఆక్రమణలు, దోపిడీలు, సెటిల్మెంట్ల పేరుతో స్థానిక ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకపోగా ఫిర్యాదు చేసిన వారిపైనే తప్పుడు కేసులు బనాయిస్తుండడం దారుణమన్నారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు భయపడరని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని రమేష్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement