అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కడప సెవెన్‌రోడ్స్: తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రాజెక్టుల జలాశయాలు, నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, కాలువలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదితిసింగ్ మాట్లాడుతూ కాలువలు, కుంటలు, చెరువుల్లో యువకులు, పిల్లలు ఈతకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారు లు మొదలు నియోజకవర్గ,మండల, సచివాలయ, గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జిల్లాలోని కుందూ, పెన్నా పరివాహక ప్రాంతాలతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. అందుకు సంబంధించి అధికారులు పంట నష్టాన్ని ప్రాథమిక అంచనా వేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల గ్రామీణ రోడ్లు, కొన్ని నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయా లని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం అయితే వెంటనే పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా తాత్కాలిక షెల్టర్లను సిద్ధం చేసుకోవాలని మండల తహశీల్దార్లను ఆదేశించారు. సకాలంలో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయ సమాచార నిమిత్తం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూంతో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అధికారులను ఆదేశించినజిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అదితి సింగ్


