
‘దేశం కోసం మధ్యవర్తిత్వం’ ప్రచారం ప్రారంభం
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశానుసారంగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికారసంస్థ ఇన్‌చార్జి చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు సూచనల మేరకు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఇన్‌చార్జి సెక్రటరీ కె. ప్రత్యూషకుమారి ఆధ్వర్యంలో.. ‘దేశం కోసం మధ్యవర్తిత్వంపై గురువారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఒక వారం అవగాహన ప్రచారం‘ సందర్భంగా కడప కోర్టు ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌లో మధ్యవర్తిత్వం సంబంధించి కరపత్రాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు మధ్యవర్తిత్వంపై ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రజలకు మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కడప నగరంలోని ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్, కలెక్టరేట్, రైల్వే స్టేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, డీఎస్పీ ఆఫీస్, సంధ్యా సర్కిల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పాత బస్టాండ్ సర్కిల్, సెవెన్‌రోడ్ సర్కిల్, దిశా పోలీస్ స్టేషన్ మొదలగు ప్రాంతాలలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం, హసీనా, పారా లీగల్ వాలంటరీలు దశరథ రామిరెడ్డి, ఈశ్వరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.