
చంద్రప్రభ వాహనంపై సౌమ్యనాథస్వామి
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు గు రువారం రాత్రి కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయం సౌమ్యనాథస్వామి కూర్మాలంకారంలో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించారు.భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం శ్రీ సౌమ్యనాథసేవా ట్రస్ట్ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ తెలిపారు.
నేడు ట్రాఫిక్ డైవర్షన్
శ్రీ సౌమ్యనాథస్వామి కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం నందలూరు టౌన్‌లో ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నట్లు ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ పొత్తపి, చెన్నయ్యగారిపల్లి, లేబాక గ్రామాల వైపు నుంచి నందలూరు టౌన్‌కు వచ్చే ప్రజలు ఆలయం వైపు దారిలో రాకుండా ఈదరపల్లి, దుర్గాపురం మీదుగా వెళ్లాలని తెలిపారు. స్వామివారం కల్యాణానికి వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన రావాలన్నారు.మండల ప్రజలు, నాయకులు, పోలీసు వారికి సహకరించాలని కోరారు.