యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు | - | Sakshi
Sakshi News home page

యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు

Jul 5 2025 6:24 AM | Updated on Jul 5 2025 6:24 AM

యువతి

యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్ల పీపీఎస్‌ పరిధిలో జరిగిన మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో పోరుమామిళ్ల టౌన్‌ బెస్త వీధికి చెందిన షేక్‌ జిలానీ బాషా(26), కలసపాడు మండలం కట్టకిందపల్లికి చెందిన కారు నాగేంద్ర ప్రసాద్‌(25), పోరుమామిళ్లలోని తురకకోట వీధికి చెందిన షేక్‌ మహబూబ్‌ బాషా(26 ) లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కడప నాలుగో ఏడీజే కోర్టు జడ్జి జి.దీనాబాబు తీర్పు ఇచ్చారు. పోరుమామిళ్ల పీఎస్‌ పరిధిలోని రామాయపల్లి శ్వశానం వద్ద 2019 జూలై, 11న హత్య జరిగింది. ముగ్గురు నిందితులు మతి స్థిమితం లేని యువతిని గొంతు నులిమి హత్య చేశారు. అప్పటి వీఆర్‌ఓ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మోహన్‌రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో యువతి గొంతు నులిమి హత్యచేసినట్లు రుజువు కావడంతో శుక్రవారం ముగ్గురికీ పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. సీఐ మోహన్‌ రెడ్డి, సీఐడీ శ్రీనివాసులు, కొండారెడ్డి, వెంకట సుబ్బయ్యలను ఎస్పీ అభినందించారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : కడప భాకరాపేట రైల్వే స్టేషన్‌ మధ్య శుక్రవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఒక వ్యక్తి మృతిచెందాడు. కడప రైల్వే ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన వెంకటనారాయణ పనినిమిత్తం గుంతకల్‌కు రైలులో వెళుతుండగా భాకరాపేట సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న కడప రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు

అప్పుల బాధతో ఆత్మహత్య

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : కడప ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ల మధ్య కొత్త మాధవరం సమీపంలో మల్లికార్జున(38) అనే వ్యక్తి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రైల్వే పోలీసులు వివరాల మేరకు మల్లికార్జున ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ వద్ద మేనేజర్‌ గా పని చేస్తుండే వాడు. రెండేళ్ల కిందట ఇళ్లు కట్టుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశాడు.అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో భరించలేక గురువారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలల హక్కుల పరిరక్షణకు

కృషి చేద్దాం

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణ, చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ విధులు, ఆవశ్యకతను వివరిస్తూ బాలల హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు పిల్లల పట్ల సున్నితత్వంతో మెలగాలని, మౌలిక వసతులు మెరుగుపర్చాలని కోరారు. కంప్లైంట్‌ బాక్స్‌ నిర్వహించాలని, నిఅన్ని కమిటీల వివరాలు ఉండాలన్నారు. హక్కులను పర్యవేక్షించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఏవైనా లోపాలుంటే సవరించుకుంటూ ముందుకుసాగాలన్నారు. సమర్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే బాలల భవితవ్యానికి బంగారు బాటలు వేసినట్లవుతుందన్నారు. చిన్నారుల సమస్యలను పరిష్కరించేందుకు 1098 టోల్‌ ప్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. ఈ కార్య్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ సరస్వతి, ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి, బీసీ వెల్ఫేర్‌ డీడీ అంజల, మైనారిటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ హిదయతుల్లా, ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ బాలస్వామి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సుభాష్‌, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు పాల్గొన్నారు.

హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాహిర్‌

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : షా సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సివిల్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడపకు చెందిన తాహిర్‌ నియమితులయ్యారు. కడప నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ అలిషేర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. గత 16 ఏళ్లుగా సామాజిక సేవలందిస్తూ విశేష గుర్తింపు పొందిన తాహిర్‌ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాహీర్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌లో తనకు అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్‌ కడప జిల్లా అధ్యక్షుడు షాబుద్దీన్‌, కౌన్సిల్‌ రాష్ట్ర సలహాదారులు బషీర్‌బుఖారి, కౌన్సిల్‌ జిల్లా లీగల్‌ అడ్వైజర్‌ అలీమ్‌ అసద్‌, కౌన్సిల్‌ ప్రతినిధులు రియాజ్‌, జమీర్‌, రెడ్డి, అనూష, లక్ష్మిదేవి, సరస్వతి, గౌస్‌, సమీర్‌అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు 1
1/2

యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు

యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు 2
2/2

యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement