
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
కడప కార్పొరేషన్ : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యూనివర్సిటీ వద్ద విద్యార్థులు చేస్తున్న నాలుగో రోజు నిరవధిక నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నెలకొల్పారన్నారు. గత ప్రభుత్వంలోనే జీఓ నంబర్–42 ద్వారా యూనివర్సిటీలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీఓఏ) పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చొరవ చూపి సీఓఏ అనుమతి వచ్చేలా చర్యలు తీసుకొని యూనివర్సిటీకి కేటాయించిన స్థలం శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు.
మంత్రి లోకేష్ స్పందించపోతే
పెద్ద ఎత్తున ఉద్యమం
విద్యార్థుల దీక్షలకు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి. సాయిదత్త, ఏఐఎస్‌ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి. రవి తదితరులు మద్దతు ప్రకటించి దీక్షల్లో కూర్చున్నారు. ఈ సమస్యపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు శివారెడ్డి, సాయి కుమార్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ శేఖర్ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, నగర కార్యదర్శి తేజ పాల్గొన్నారు. సాయిరెడ్డి, రామ్, మేఘసాయి, పవిత్ర, సుష్మ, సుధీర్, సుధాకర్, ఆదిత్య, వసంత్, సింధు, మోహన్, మనోజ్ దీక్షల్లో కూర్చున్నారు.
ఎమ్మెల్యేకు వినతిపత్రం
కడప ఎడ్యుకేషన్ : ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డిని కలిసి వినతిప్రత్రం సమర్పించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఐక్యవేదిక నాయకులు ఎం.అంకన్న, సుబ్బారాయుడు, జయవర్ధన్, నాగరాజు, నాగేశ్వరరావు, మహేష్ ఉన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్
నాలుగో రోజుకు చేరిన విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు