
వైఎస్సార్‌సీపీ నాయకులకు స్విమ్స్‌లో వైద్య పరీక్షలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కడపలో మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందులలోని రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ తోరణాలు, జెండాలు కట్టిన విషయం విదితమే. దీనిపై అప్పట్లో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులు పులివెందుల డీఎస్పీని, మున్సిపల్ కమిషనర్‌ను కలిసి టీడీపీ తోరణాలు తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు. అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్‌తోపాటు ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న తోరణాలను తొలగించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసు
అప్పట్లో జిల్లాలో ఉన్న హోం శాఖ మంత్రి అనిత, పులివెందుల టీడీపీ నాయకుల ఆదే శాల మేరకు పోలీసులు దాదాపు 18 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం వారిని పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులు పార్నపల్లె కిశోర్, సాతుపాటి రాజేష్, తావేటి మల్లికార్జున, షేక్ మస్తాన్, పార్నపల్లి వెంకట చలపతి, సాతుపాటి వెంకటపతిలు తమను పోలీసులు అకారణంగా కొట్టారని మెజిస్ట్రేట్ ఎదుట వాపోయారు. దీంతో పులివెందుల మెజిస్ట్రేట్ వారికి పులివెందుల గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
రిపోర్టుల్లో అవకతవకలు
అప్పట్లో పులివెందుల మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆరుగురికి పులివెందుల జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలనివేదికల్లో అనేక అవకతవకలు జరిగాయని సమాచారం. వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు, సూపరింటెండెంట్‌పై పులివెందుల పోలీసులు అధికార పార్టీ నాయకులచే ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా నివేదికలు తయారు చేసుకున్నారు. దీంతో ఆరుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు వైద్య పరీక్షల నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆరుగురికి మరలా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి కేంద్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సీఐలు చాంద్‌బాషా, వెంకట రమణ పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. వీరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మంతనాలు జరపడం మీడియా సాక్షిగా బయట పడింది. అంతేకాకుండా కర్నూలు డీఎస్పీ కూడా తమకేమాత్రం సంబంధం లేకున్నా ఆస్పత్రికి వెళ్లి నివేదికలను మేనేజ్ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో మరలా ఆరుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు తమకు జరిగిన అన్యాయంపై సాక్ష్యాధారాలతో హైకోర్టుకు నివేదించి ప్రైవేటు కంప్లైంటు వేశారు. దీంతో హైకోర్టు మరలా వీరికి తిరుపతి స్విమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్‌బాషాను ఆదేశించింది.
స్విమ్స్‌లోనైనా న్యాయం జరిగేనా..!
హైకోర్టు ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నాయకులను శనివారం ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి అర్బన్ సీఐ చాంద్‌బాషా ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, రూరల్ సీఐ వెంకట రమణలు నివేదికలు తమకు అనుకూలంగా ఉండాలని మేనేజ్ చేసినట్లు సమాచారం. నిష్పక్షపాతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని అధికార పార్టీ నాయకులతో స్విమ్స్ ఆస్పత్రి పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రస్తుతం రక్త పరీక్షలు నిర్వహించి మిగిలిన పరీక్షలు తర్వాత నిర్వహిస్తామని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఇక్కడైనా తమకు న్యాయం జరగాలని బాధితులు కోరుతున్నారు.
టీడీపీ తోరణాల తొలగింపు ఘటనలో అక్రమ కేసు
పోలీసుల థర్డ్‌డిగ్రీపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
తిరుపతి స్విమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు