రియల్టర్‌ హత్యకేసులో వీడిన మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

రియల్టర్‌ హత్యకేసులో వీడిన మిస్టరీ

Jun 19 2025 4:18 AM | Updated on Jun 19 2025 4:18 AM

రియల్టర్‌ హత్యకేసులో వీడిన మిస్టరీ

రియల్టర్‌ హత్యకేసులో వీడిన మిస్టరీ

మదనపల్లె రూరల్‌ : పట్టణంలో సంచలనం సృష్టించిన రియల్టర్‌ గంగాధర హత్యకేసు మిస్టరీ వీడింది. ముందు నుంచీ ఊహించినట్లుగా, గంగాధర హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా భార్య వనిత ఉందనే అనుమానం నిజమైంది. హత్య జరిగిన తర్వాత పోలీసు విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో భార్య వనితను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. దీంతో హత్యకేసుకు సంబంధించిన వాస్తవాలను వనిత బయటపెట్టింది. కొరియర్‌ బాయ్‌ రెడ్డిరాము, ఆటో డ్రైవర్‌ గంజి మహేష్‌బాబు సహాయంతో భర్తను కడతేర్చినట్లు నేరం అంగీకరించింది. దీంతో నిందితులకు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం రాయచోటిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడిస్తూ, ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చూపారు. వివరాలు.. మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ నక్కలకుంట సమీపంలో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి, నారాయణమ్మ కుమారుడు నారప్పగారి గంగాధర(37) స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌, వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తుండేవాడు. ఈనెల 15వ తేదీ ఆదివారం రాత్రి గంగాధర నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి హాల్లో పడుకుని ఉన్న అతడిపై రాళ్లతో దాడిచేసి కొట్టి చంపేసినట్లు భార్య వనిత పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో తాలూకా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, గంగాధర ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. 16వ తేదీ సోమవారం ఉదయం మృతుడు గంగాధర తమ్ముడు నారప్పగారి వెంకటేష్‌ తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ గంగాధర భార్య వనితతో పాటుగా మరికొంత మంది ప్రమేయం ఉండవచ్చని ఫిర్యాదుచేశాడు. దీంతో తాలూకా పోలీసులు వనితను అదుపులోకి తీసుకుని విచారించగా...2012లో గంగాధరతో తనకు వివాహం జరిగిందని, కుమార్తె హిమప్రియ, కుమారుడు మోక్షిత్‌ ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపింది. భర్త గంగాధర రియల్‌ఎస్టేట్‌, వడ్డీవ్యాపారాలు చేస్తూ, పలువురు మహిళలతో అక్రమసంబంధాలు పెట్టుకుని, వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి, వారికి తెలియకుండా న్యూడ్‌ వీడియోలు, ఫోటోలను సెల్‌ఫోన్‌లో తీసుకుని, తర్వాత వారిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వశపరచుకునేవాడన్నారు. అదేవిధంగా భార్యనైన తనను శారీరకంగా, మానసికంగా హింసించేవాడని తెలిపింది. దీంతో అతడి వేధింపులు భరించలేక, అతడిపై కక్ష పెంచుకుని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. హత్యచేసేందుకు పరిచయస్థులైన...కే.వి.పల్లె మండలం తీతవ వడ్డిపల్లెకు చెందిన సొదుం రెడ్డిరాము(36), మదనపల్లె పట్టణం ఎస్టేట్‌ ప్రాంతం పద్మావతి కల్యాణమండపం వద్ద నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్‌ గంజి మహేష్‌బాబు(20) సాయం తీసుకుంది. భర్త గంగాధర ఇంటికి రాగా, అతడికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. అనంతరం ఇంటి హాలులో ఆదమరచి నిద్రిస్తుండగా, భార్య వనిత మరో ఇద్దరు నిందితులతో కలిసి తలపై బండరాయితో కొట్టి హతమార్చారు. కేసులో నిందితులను మదనపల్లె మండలం ఎర్రగానిమిట్ట టిడ్కో గృహాల సమీపంలో అరెస్ట్‌చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కేసును చేధించిన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, సీఐ కళావెంకటరమణ, పోలీసు సిబ్బందిని అభినందించారు.

హత్యలో కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ గంగాదేవి..

రియల్టర్‌ గంగాధర హత్యకేసులో భార్య వనిత, ఇద్దరు నిందితులతో పాటుగా కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న గంగాదేవి ఉన్నట్లు సమాచారం. బుధవారం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో హత్యకేసులో నిందితులైన వనిత, రెడ్డిరామ్‌, మహేష్‌లతో పాటు ప్రభుత్వ వైద్యురాలు గంగాదేవికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని రాయచోటి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. వైద్యపరీక్షల నిర్వహణలో భాగంగా వైద్యురాలు గంగాదేవిని కేసులో ఏ–3గా పేర్కొన్నారు. గంగాధరను చంపేందుకు భార్య వనితకు నిద్రమాత్రలను గంగాదేవి సమకూర్చడంతో పాటు, హత్య తర్వాత అతను చనిపోయాడా లేదా అనేది నిర్ధారించడంలో సహాయపడినట్లు తెలుస్తోంది. అయితే గంగాదేవిని హత్యకేసుకు సంబంధించి మీడియా సమావేశంలో అరెస్ట్‌ చూపకపోవడం, ఆమె పాత్రపై వివరాలు వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో అదుపులోకి తీసుకుని, వైద్యపరీక్షలు సైతం నిర్వహించి ఎందుకు పోలీసులు అరెస్ట్‌ చూపలేదన్నది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

అనుమానించినట్లుగానే భర్తను

కడతేర్చిన భార్య

అక్రమ సంబంధాలు, వేధింపులు,

బ్లాక్‌ మెయిల్‌ భరించలేక హత్య

భార్యతో పాటు ఇద్దరు నిందితుల అరెస్ట్‌

హత్య కేసులో నిందితురాలుగా కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ..?

వివరాలు వెల్లడించిన

ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement