
వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు వేళాయె
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కీలకమైనస్థానాల కోసం ఉద్యోగుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొందరు ‘డిమాండ్’ ఉన్న ‘సీటు’ను పొందడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందు కోసం మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో బది‘లీలలు’ జరగకుండా చర్యలు చేపట్టాలి.
కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలపై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని కారణాల వల్ల ట్రాన్స్‌ఫర్స్ ప్రక్రియసై సందేహాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం జీఓ ఆర్టీ నంబరు 344, 399, ఈ–ఫైల్ నంబరు 2840767ను జారీ చేస్తూ, గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.
అనుకూలమైన స్ధానాల కోసం ఆరాటం..
కడపలోని వైద్య ఆరోగ్య శాఖ జోన్–4 కార్యాలయంతో పాటు ఈ శాఖ పరిధిలోకి వచ్చే రాయలసీమ జిల్లాల్లోని ఆరోగ్య శాఖల్లో పలు కీలకమైన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోటికి వెళ్లడానికి ఉద్యోగులు ఉబలాటపడుతున్నారు. ఉదాహరణకు కడపలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో బదిలీల కారణంగా అక్కడ పనిచేసే సీనియర్ అసిస్టెంట్స్ మరొక చోటికి వెళ్లాల్సివుంది. ఆ సీటులోకి రావడానికి ఇప్పటికే పలువురు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అదే కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గోపాల్‌రెడ్డి మే 31వ తేదీన పరిపాలనా అధికారిగా పదోన్నతిపొంది, పదవీ విరమణ పొందారు. ఇప్పుడు ఈ స్థానంపై రాయలసీమ వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల కన్ను పడింది. ఇది చాలా ప్రధానమైన సీటు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఇందుకు కొందరి అండదండలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. పదోన్నతుల ద్వారా ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయాలి. అంతలోపే ట్రాన్స్‌ఫర్స్ రావడంతో వేరొక ప్రాంతంలో పనిచేస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్ బదిలీపై ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అసలు సంగతి ఏమిటంటే..‘పదోన్నతులు వస్తే ఎవరిని తేవాలి లేదా ఆ లోపు బదిలీలు గనుక జరిగితే ఎవరిని తీసుకురావాలి, లేదా మరే మార్గం ఏమైనా ఉందా..!’ అనే ఎత్తుగడల్లో ఉన్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్స్ కారణంగా వైద్య ఆరోగ్య శాఖల్లో ఉత్కంఠ..సందడి వాతావరణం నెలకొననుంది.
● 20 రోజుల పాటు..
గైడ్‌లైన్స్‌ను జారీ చేసిన పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్
ఈ నెల 19 వరకు ప్రక్రియ
20 నుంచి నిషేధం
కీలకమైన స్థానాల కోసం గట్టి పోటీ
మే 31వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు 20 రోజుల పాటు బదిలీల ప్రక్రియ సాగుతుంది. 23వ తేదీన ఉద్యోగులు రిలీవ్ కావాలి. 20వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం ఉంటుంది. ఒకే స్ధానంలో ఐదేళ్లకు పైగా విధులను చేపడుతున్న ఉద్యోగులంతా ట్రాన్స్‌ఫర్ అవుతారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తదితర ప్రధాన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్ (జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరిండెంట్ తదితరులు) ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీసు నిండిన వారు బదిలీ అవుతారు. ఒకే చోట రెండేళ్లకు పైగా పనిచేస్తున్న వారు అభ్యర్థన బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లు, ఉద్యోగులైన భార్యాభర్తలు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం బదిలీలను చేపడుతారు.

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు వేళాయె