నేడు ఫాదర్స్‌ డే | - | Sakshi
Sakshi News home page

నేడు ఫాదర్స్‌ డే

Published Sat, Jun 15 2024 11:44 PM | Last Updated on Sat, Jun 15 2024 11:44 PM

నేడు

అమ్మ ప్రేమతో పోల్చుకుంటే నాన్నెందుకో వెనుకబడ్డాడంటూ

ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక పోస్టు బాగా వైరల్‌

అయింది. బిడ్డకు నాన్న వెన్నెముకగా నిలుస్తాడు.

వెన్నెముక శరీరంలో వెనుకభాగంలో ఉంటుంది.

అందుకే వెనుకబడ్డాడంటూ నాన్న విశిష్టతను చివరిలో

ఒక్క మాటలో చక్కగా ముగించాడు ఆ కవితలో. నిజమే..

బిడ్డ ఎదుగుదల వెనుక నాన్నే సర్వస్వం. ఒడిలో కూర్చో

బెట్టుకుని ఓనమాలు నేర్పించింది మొదలు చేయి పట్టుకుని

బుడి బుడి అడుగులు వేయిస్తూ... తర్వాత ప్రపంచాన్ని

పరిచయం చేస్తాడు నాన్న. అందరి జీవితాల్లోనూ నాన్నది

ఇదే పాత్ర. బిడ్డ ఎదిగే క్రమంలో ప్రతి అడుగులోనూ

తానుంటాడు. లక్ష్యాన్ని ఏర్పరుస్తాడు. దాన్ని సాధించడానికి

మార్గమూ చూపిస్తాడు. ఇలా తన జీవితాన్ని కన్న బిడ్డల

కోసమే అంకితమిచ్చే నాన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.

గుర్తు చేసుకోవడం తప్ప. నేడు ఫాదర్స్‌ డే. ఈ సందర్భంగా

‘సాక్షి’ ప్రత్యేక కథనం..

కడప కల్చరల్‌/మదనపల్లె సిటీ: నాణేనికి రెండు ముఖాలు. అందులో బొమ్మ అమ్మ అయితే, బొరుసు నాన్న. జీవితంతో విడదీయలేని బంధం అది. ఆ వ్యక్తి లేని మన పుట్టుకను, జీవితాన్ని ఊహించుకోలేం. తల్లితో కలిసి ఆయన బిడ్డల అభివృద్ధికి పడే తపనను ఎవరూ వర్ణించలేరు. బిడ్డలు దినదినాభివృద్ధి చెందుతుంటే గుండెలనిండా సంతోషంతో పొంగిపోయే వ్యక్తి ‘నాన్న’. దేవుని తర్వాత అంతటి స్థానం అమ్మతోపాటు నాన్నకూ ఉంది. అమ్మను మమతానురాగాలకు ప్రతిరూపంగా భావించే మనం.. నాన్నను మాత్రం భయపెట్టే వ్యక్తిగా భావిస్తూ ఉంటాం. నిజానికి కుటుంబ పెద్దగా తన బాధ్యతల పట్ల తండ్రి స్పందన ఎలా ఉంటుందన్న విషయం చర్చించేందుకే ప్రతి సంవత్సరం జూన్‌ 3వ ఆదివారం తండ్రుల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం.

తండ్రి విలువ తెలియాలి

రోజురోజుకు నైతిక విలువలు పతనమవుతున్న నేటి సమాజానికి తండ్రి విలువ తెలియాల్సిన అవసరం ఉంది. వయస్సు ఉడిగిన దశలో తల్లిని పనిమనిషిగా ఇంటిలో ఉంచుకుని పనికి రాడంటూ తండ్రిని బయటికి గెంటేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం చోటుచేసుకోవడం దిగజారుతున్న మానవతా విలువలకు నిదర్శనం. పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని ఆనందపడిన తండ్రికి బతికి ఉండగానే నరకం చూపించే పుత్రరత్నాలు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ సమాజ నిర్మాణంలో తండ్రికిగల కీలకమైన స్థానం, ఆయన త్యాగాల గురించి తెలియజెప్పి తండ్రి ఔన్నత్యం పట్ల అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.

భారవి కథ

పురాణాల ప్రకారం...భారవి మహాకవి. బాల్యంలో ఎంత బాగా చదివినా తండ్రి అసంతృప్తి వ్యక్తం చేసేవాడు. భారవికి తండ్రిపై కోపం పెరిగింది. తండ్రిని మట్టుబెట్టాలనుకుని ఓ రాత్రి అందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో తండ్రి పొగిడితే కుమారుని ఆయుష్షు తగ్గుతుందన్న భయంతో భారవిని ప్రశంసించలేదని, అందుకు బిడ్డ ఎంతగా బాధపడుతున్నాడోనని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇది కుమారుడు భారవి వింటాడు. తండ్రి మనసు తెలుసుకోలేక పోయానని పశ్చాత్తాపంతో బోరున ఏడుస్తూ తండ్రి పాదాలపై వాలిపోతాడు.

కొవ్వొత్తిలా కరిగిపోతూ..

అమ్మ మనకు ఉనికినిస్తే...నాన్న విలువ కల్పిస్తాడు. అమ్మ నవమాసాలు మోసి సంతానాన్ని, ఇంటిని చక్కదిద్దేందుకు కృషి చేస్తే నాన్న పెద్దదిక్కుగా ఆ తల్లీబిడ్డలతోపాటు మొత్తం కుటుంబానికి రక్షణగా నిలుస్తాడు. అమ్మకు కష్టం వస్తే నాన్నకు చెప్పుకుంటుంది. కరువు తీరా ఏడ్చి గుండె బరువు దించుకుంటుంది. కానీ తండ్రికి ఆ అవకాశం కూడా ఉండదు. ఇంటా, బయటా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తండ్రి ఆ బాధను గుండెల్లోనే దాచుకుంటాడు. మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతాడు. అందుకే పక్షవాతం, గుండెపోటు లాంటి వ్యాధులు ఎక్కువగా పురుషులకే వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబం కోసం అమ్మ వత్తిలా కాలిపోతే...నాన్న మైనంలా కరిగిపోతూ వెలుగునిస్తాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు ఫాదర్స్‌ డే 1
1/1

నేడు ఫాదర్స్‌ డే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement