విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు | Sakshi
Sakshi News home page

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

Published Tue, May 21 2024 3:50 AM

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

ప్రొద్దుటూరు క్రైం : కౌంటింగ్‌ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ తెలిపారు. వచ్చే నెల 4న నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ చెప్పారు. పట్టణంలోని త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై సోమవారం సబ్‌ డివిజన్‌లోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అఽధికారులు నిర్వహించాల్సిన విధులపై ఎస్పీ ఆదేశాలిచ్చారు. అనంతరం మాట్లాడుతూ జూన్‌ 1 నుంచి 6 వరకు ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవాల ర్యాలీలకు అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహ నిర్భంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. కౌంటింగ్‌ అనంతరం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజు, సీఐలు శ్రీకాంత్‌, అబ్దుల్‌కరీం, వెంకటరమణ, రూరల్‌ సీఐ రమణారెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సమస్యాత్మక గ్రామాలపై

ప్రత్యేక దృష్టి సారించాలి

కడప అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 4న జరుగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ కడపలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నియోజక వర్గ నోడల్‌ పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి ఘటనలకు తావులేకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పలు ఆదేశాలిచ్చారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) లోసారి సుధాకర్‌, నియోజక వర్గ నోడల్‌ డిఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement