నిందితుడికి చనిపోయేంత వరకు జైలుశిక్ష

Life Time Imprisonment for the accused  - Sakshi

వైఎస్ఆర్ జిల్లా : చేసిన నేరం పాపమై పండింది.. నిందితుడికి జైలు శిక్ష పడింది. వివాహేతర బంధంలో తలెత్తిన అనుమానంతో ప్రియురాలిని హత్య చేసి.. ఈ విషయాన్ని దాచేందుకు ఆమె తల్లిని కూడా చంపేశాడు. వరసకు కూతురైన మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితునికి చిత్తూరు స్పెషల్‌ పోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి సోమవారం శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేసిన అప్పటి ములకలచెరువు సీఐ పి.సురేష్‌కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

వివాహేతర బంధంతో మొదలై..
తంబళ్లపల్లె మండలం గోవిందువారిపల్లెకు చెందిన గంగులమ్మకు సరళమ్మ కుమార్తె. ఈమెకు ముగ్గురు కుమార్తెలు. సరళమ్మ భర్త 8 ఏళ్ల క్రితం మృతి చెందడంతో తల్లి గంగులమ్మ ఇంటిలో ఉంటోంది. భూ సమస్యకు సంబంధించి సరళమ్మ తరచూ తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తుండేది. ఈ నేపథ్యంలో గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన సయ్యద్‌మౌలాలి (47)తో వివాహేతర బంధం ఏర్పడింది. వారు కలిసి నివసించే వారు. వివాహేతర బంధం విషయం అందరికీ తెలియడంతో కాపురాన్ని ఏటిగడ్డతండాకు మార్చారు. నాలుగేళ్లు అక్కడ ఉండి గ్రామానికి సమీపంలో రేకులషెడ్డును నిర్మించుకుని కాపురం ఉంటూ వచ్చారు.

ఈ పరిస్థితుల్లో సరళమ్మ ఫోన్‌లో ఎవరో వ్యక్తితో మాట్లాడటం తెలిసి మాట్లాడవద్దని మౌలాలి చెప్పినా వినలేదు. 2020 సెప్టెంబర్‌ 29న వేరుశనగ పొలంలోకి పందులు వస్తున్నాయని సరళమ్మ, మౌలాలి కాపలా కాస్తూ మంచంపై పడుకున్నారు. వేరే వ్యక్తులతో ఎందుకు మాట్లాడుతున్నావని మౌలాలి ప్రశ్నించడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో మౌలాలి కట్టెతో సరళమ్మ ఎడమ పక్క కణితిపై కొట్టడంతో కింద పడిపోయింది. చనిపోయిందని నిర్ధారించుకుని మృతదేహాన్ని సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టులోకి ట్యూబ్‌బ్‌పై తీసుకెళ్లి శవం తేలకుండా బండరాళ్లను కట్టి నీటిలోకి పడేశాడు. ఉదయం కుమార్తె ఎక్కడని తల్లి గంగులమ్మ ప్రశ్నించగా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు.

2020 అక్టోబర్‌ 1న సరళమ్మ ఎక్కడని గంగులమ్మ గట్టిగా నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అదే రోజు రాత్రి ఆమెకు మద్యం తాగించాడు. ఇంటి బయట నిద్రిస్తున్న గంగులమ్మ అర్ధరాత్రి దాటాక ఆమె చీర కొంగుతో గొంతుకు బిగించి హత్య చేశాడు. చనిపోయిన గంగులమ్మ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి గంగచెరువులో చెట్టు మొదలుకు చీరను కట్టి నీటిలో పడేశాడు. మరుసటి రోజు తల్లి, అవ్వ ఎక్కడున్నారని మౌలాలిని సరళమ్మ కుమార్తెలు ప్రశ్నించగా.. కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లారని నయమయ్యాక వస్తారని నమ్మించాడు. ముగ్గురు పిల్లలను కర్ణాటకలోని గౌనిపల్లెకు తీసుకెళ్లి అక్కడ అద్దె ఇంటిలో ఉంచాడు.

అక్కడ సరళమ్మ పెద్ద కుమార్తైపె లైంగిక దాడికి పాల్పడి వేధించాడు. చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం బాహ్యప్రపంచానికి తెలియకుండా పోయింది. పీలేరులోని ఏటిగడ్డ గ్రామానికి చెందిన బంధువులు గోవిందువారిపల్లెకు వచ్చి గుంగులమ్మ గురించి ఆరా తీయగా కనిపించలేదు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి తంబళ్లపల్లె ఎస్‌ఐ సహదేవి అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో హత్యలుగా వెలుగు చూడటంతో సీఐ సురేష్‌కుమార్‌ దర్యాప్తు ప్రారంభించారు.

తర్వాత బాలికపై లైంగిక దాడి వెలుగులోకి రావడంతో అప్పటి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి దర్యాప్తు చేశారు. జంట హత్యలు, బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు నిర్ధారించి, మౌలాలిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. మౌలాలికి చనిపోయేంత వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ.. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top