భాస్వరం.. భూమికి ముఖ్య పోషకం | - | Sakshi
Sakshi News home page

భాస్వరం.. భూమికి ముఖ్య పోషకం

Mar 30 2026 7:15 AM | Updated on Mar 30 2026 7:15 AM

పెద్దవూర : భూమికి భాస్వరం ముఖ్యమైన పోషకం. గాలి, నీరులానే మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు సాగు భూమి ద్వారా లభ్యమవుతాయి. వీటిలో నత్రజని, భాస్వరం పోషకాలు తక్కువ పరిమాణంలో, పొటాష్‌ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ పోషకాలు ఇసుక భూములు, మధ్యస్త నేలలు, ఎర్రనేలలు, నల్లరేగడి భూముల్లో తక్కువ శాతం ఉండే అవకాశాలు ఉన్నాయి. పోషక పదార్థాల లభ్యత నేల రకాన్ని బట్టి నేల భౌతికస్థితి, రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారి పి.సందీప్‌ తెలిపారు.

కరగని రూపంలో భాస్వరం..

సాగవుతున్న భూముల్లో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్న భాస్వరం పోషకం కరగని డైకాల్షియం, ట్రై కాల్షియం ఫాస్ఫేట్‌ల రూపంలో ఉంది. తేలిక భూముల్లో కంటే బరువు నేల(వరి పండించే డెల్టా భూములు)ల్లో భాస్వరం పోషకం ఎక్కువ శాతం మొక్కలకు అందుబాటులో లేని రూపంలో ఇమిడీకృతమై ఉంది. ఈ నెలల్లో భాస్వరం వినియోగ సామర్థ్యం తక్కువేనని చెప్పవచ్చు. రైతులు వాడే భాస్వరపు ఎరువుల్లోని భాస్వరం పోషకం మోనో కాల్షియం ఫాస్ఫేట్‌ రూపంలో ఉంటుంది. ఇది పూర్తిగా నీటిలో కరుగుతుంది. కరిగిన వెంటనే కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్లతోనూ రసాయన చర్య జరుగుతుంది. దీని ఫలితంగా అల్యూమినియం ఫాస్ఫేట్‌, మెగ్నీషియం ఫాస్ఫేట్లుగా మారుతాయి. ఇవి కరగని రూపంలో ఉండి తర్వాత భూమిలోని సూక్ష్మజీవుల చర్యల వలన మొక్కకు అందుబాటులోకి వస్తాయి.

భాస్వరం ఏ మేరకు వాడాలి?

భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే సాగులో ఉన్న వివిధ పంటలకు ఎంత భాస్వరం అవసరమో తెలుస్తుంది. దీనిని బట్టి పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, రసాయన ఎరువుల ద్వారా భాస్వరాన్ని అందజేయాలి. సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫెట్‌ డీఏపీ, ఎన్‌పీకే కాంప్లెక్స్‌ ఎరువులు మొదలగు వాటి ద్వారా భాస్వరాన్ని అందజేయవచ్చు.

జీవ ఎరువులతో ఉపయోగాలు

జీవ ఎరువులతో బాసిల్లాస్‌, సూబోమోనాస్‌ వంటి సూక్ష్మజీవులు ఆస్పర్జిల్లడ్‌ పెన్సిలియం వంటి శిలీంద్రాలు భూమిలో కరగని రూపంలో భాస్వరాన్ని కరిగించి మొక్కకు లభ్యత పెంచుతాయి. సిఫార్సు చేసిన భాస్వరం మోతాదును ఎకరాకు 10 నుంచి 12కిలోల వరకు తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల వాడకం ద్వారా భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. సూక్ష్మజీవుల సంతతి వృద్ధి చెందుతాయి. మట్టి నమూనాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములను 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి.

ప్రాముఖ్యత

భాస్వరాన్ని లవణాల రూపంలో మొక్కలు తీసుకుంటాయి. పూలు, విత్తనాలు, దుంపలు తదితర ఆర్థిక ప్రాముఖ్యత గల పంటల్లో విత్తనపు భాగాల్లో ఈ పోషకం అవసరం ఎక్కువే. భూమిలో సేంద్రియ ఎరువులు బాగా కుళ్లేందుకు దోహదపడుతుంది. పంట త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. కణ విభజన, పైరు అభివృద్ధి మొక్క తొందరగా నిలదొక్కుకోవడం, మొక్కలో మాంసకృత్తులు, ఎంజైములు తయారీకి ఉపయోగపడుతుంది. భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పంటలకు కలిగే దుష్పలితాలను కొంతమేరకు అరికడుతుంది. మొక్కలకు అవసరమైన పిండి పదార్థం తయారు చేసుకునే కిరణజన్య సంయోగక్రియలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ మూలకం లోపిస్తే మొక్కల వేర్ల పెరుగుదల బలహీనమవుతాయి. పంటలో పెరుగుదలతో పాటు పిలకలుపెట్టే శక్తి క్షీణిస్తుంది. పైరు పూతకు రావడం ఆలస్యమై దిగుబడులు ఘణనీయంగా తగ్గుతాయి. భాస్వరం లోపించిన పత్ర హరితం(క్లోరోఫిల్‌) ఏర్పడకపోవడం వలన ముదురు ఆకుపచ్చ రంగులో ఆకులు కనబడతాయి. మొక్కలు వాతావరణం నుంచి బొగ్గు పులుసు వాయువును తీసుకుని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొక్కలు వాటి తొలిదశలో ఎదిగే భాగాల్లో భాస్వరం అందుబాటులో ఉండటం అవసరం. ఆమ్ల, క్షార భూముల్లో భాస్వరం సరిగ్గా అందుబాటులో ఉండదు. సాగు నేలల్లో భాస్వరం అధికమైనా జింకు లోపం వస్తుంది.

ఏ దశలో వేయాలి

ఫ భాస్వరం ముఖ్యంగా వేరు వ్యవస్థను అభివృద్ధి పరుస్తుంది. వరి పంటలో నాట్లకు ముందు దమ్ము చేసేటప్పుడు సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ 75–100 కిలోలు, 20 కిలోల యూరియా కలిపి వేయాలి. లేదా వరి నాటిన తర్వాత పది రోజులకు డీఏపీ ప్లస్‌ యూరియా లేక ఇతర భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్‌ ఎరువులు వేసుకోవాలి.

ఫ వర్షాధార మెట్టపంటలకు పత్తి, వేరుశనగ, మొక్కజొన్న మొదలగు పంటలకు ఆఖరి దుక్కిలో వేయాలి.

ఫ రైతులు అవసరం లేకున్నా ముఖ్యంగా వరి పంటకు భాస్వరం ఎరువులను రెండు, మూడు పర్యాయాలు వాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement