నకిరేకల్ : తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబాసాహెబ్‌గూడెంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబాసాహెబ్‌గూడేనికి చెందిన నిమ్మల నర్సయ్య తన భార్య, కుమారుడు అక్షయ్(28)తో కలిసి ముంబైలో పాల వ్యాపారం చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు. అక్షయ్ జల్సాలకు అలవాటుపడి ఏ పనిచేయకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అక్షయ్ ముంబై నుంచి శనివారం ఉదయం స్వగ్రామం బాబాసాహెబ్‌గూడేనికి వచ్చాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్‌చేసి డబ్బులు కావాలని అడిగాడు. డబ్బులు లేవని, ముంబై వచ్చి ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు అక్షయ్‌కు సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ్ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మృతుడి తండ్రి నిమ్మల నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ హరిబాబు తెలిపారు.


